Bizarre News: బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టండి మహాప్రభో.. కోర్టును వేడుకున్న హత్య కేసు నిందితుడు

హత్య కేసుల్లో నిందితులకు బెయిల్ లభించడమే కష్టం. అయితే ఓ హత్య కేసు నిందితుడు తనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసి జైల్లో ఉంచాలంటూ కోర్టును వేడుకోవడం కాస్త వింతే.

Bizarre News: బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టండి మహాప్రభో.. కోర్టును వేడుకున్న హత్య కేసు నిందితుడు
Representative Image
Follow us
Janardhan Veluru

|

Updated on: Feb 03, 2022 | 10:55 AM

Kodanad Estate Murder Case: హత్య కేసుల్లో నిందితులకు బెయిల్ లభించడమే కష్టం. అయితే ఓ హత్య కేసు నిందితుడు తనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసి జైల్లో ఉంచాలంటూ కోర్టును వేడుకోవడం కాస్త వింతే. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు (Tamil Nadu)లోని కొడనాడు ఎస్టేట్ హత్య, దోపిడీ కేసులో నిందితుల్లో ఒకడైన మనోజ్.. తనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలంటూ ఊటీ(Ooty)లోని జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత(J Jayalalithaa) చెందిన కొడనాడు ఎస్టేట్‌లో హత్య, దోపిడీ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ కేసుపై డీఎంకే అధికారంలోకి వచ్చాక పునర్విచారణ జరుపుతోంది. ఈ కేసులో పలువురు నిందితులను ఒక్కొక్కరుగా విచారణ కమిటీ ప్రశ్నిస్తోంది.

ఈ కేసులో అరెస్టైన నిందితుడు మనోజ్.. గత ఏడాది నవంబరు నెలలో బెయిల్‌పై విడుదలయ్యాడు. రెండు మాసాల వ్యవధిలోనే తనకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేసి మళ్లీ జైల్లో ఉంచాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.  బెయిల్ మంజూరు సమయంలో విధించిన కఠిన నిబంధనలే తన వినతికి కారణమని నిందితుడు చెబుతున్నాడు. బెయిల్ షరతుల మేరకు మనోజ్ ఊటీని విడిచి వెళ్లేందుకు వీల్లేదు. అలాగే ప్రతి సోమవారం జిల్లా కోర్టులోని రిజిస్టర్‌లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్నందున ఊటీలో తాను బస చేసేందుకు హోటళ్లు, రెస్టారెంట్లలో ఎవరూ అద్దె గదులు ఇవ్వడం లేదని నిందితుడు మనోజ్ వాపోయాడు. అలాగే అక్కడ తనకు ఉపాధి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని.. దీంతో తినేందుకు తిండి కూడా కరువైందని ఆవేదన వ్యక్తంచేశాడు. అలాగే తాను మధుమేహంతో బాధపడుతున్నట్లు తెలిపిన మనోజ్.. ఊటీలోని శీతల వాతావరణం తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలిపాడు. బెయిల్ కఠిన నిబంధనలు తన పాలిట శాపంగా మారాయంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ పిటిషన్‌పై ఇవాళ(గురువారం) కోర్టు విచారణ జరపనుంది. మరో గత్యంతరం లేకనే తన బెయిల్‌ను రద్దు చేసి మళ్లీ జైలుకు పంపించాలని మనోజ్ కోర్టును కోరుతున్నట్లు అతని తరఫు న్యాయవాది మునిరత్నం తెలిపారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొడనాడు హత్య కేసులో మనోజ్ రెండో నిందితుడిగా ఉన్నాడు. ప్రధాన నిందితుడు కేవీ సయన్‌తో పాటు మనోజ్‌ను 2019 జనవరిలో పోలీసులు అరెస్టు చేశారు.

Also Read..

Viral Video: పానీపూరితో నూడుల్స్ కోసం జనం క్యూ !! వీడియో

Allu Arjun: బెంగుళూర్‏కు అల్లు అర్జున్.. పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించనున్న బన్నీ..