ఫస్ట్ నైట్ రోజే వరుడికి షాకిచ్చింది ఓ నవ వధువు. నగలతో పరార్ అవ్వడమే కాదు.. తనకు ఇంకెప్పుడూ ఫోన్ చేయొద్దంటూ చెప్పింది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు సదరు వ్యక్తి. ఈ అరుదైన ఘటన ఉత్తరపదేశ్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బిల్హర్ జిల్లా జదేపూర్ గ్రామానికి చెందిన అరవింద్‌ను ఇటీవల ఇద్దరు వ్యక్తులు కలిశారు. ఆ ఇద్దరూ పెళ్లి కుదిరిస్తామని అతడ్ని నమ్మించారు. చెప్పినట్లుగా ఆ వ్యక్తులిద్దరూ.. గయాకు తీసుకెళ్లి అక్టోబర్ 1వ తేదీన రుచి అనే యువతితో వివాహం జరిపించారు. అనంతరం అక్టోబర్ 3వ తేదీన తన భార్యను ఇంటికి తీసుకొచ్చాడు అరవింద్. ఇక ఆ తర్వాత రోజు ఉదయం లేచేసరికి తన భార్య కనిపించకుండా పోయింది. అంతేకాదు ఇంట్లోని రూ. 30 వేల నగదు, బంగారు ఆభరణాలు, పెళ్లి బట్టలు ఇలా ఏం కనబడలేదు. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అరవింద్ నిర్ధారణకు వచ్చాడు.
ఇక ఇంతలోనే అతడికి రుచి ఫోన్ చేసి.. ‘తనకోసం వెతకొద్దని.. తనకు ఇంకెప్పుడూ ఫోన్ చేయొద్దంటూ’ చెప్పింది. దీంతో తాను నిండా మోసపోయాయని అరవింద్‌కు అర్ధమై.. పోలీసులను ఆశ్రయించారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. అరవింద్.. పెళ్లి కుదిర్చడానికి ఆ ఇద్దరు వ్యక్తులకు రూ. 70 వేలు ఇచ్చాడు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ యువతితో సహా పెళ్లి కుదిర్చిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.