Rare statue: గుప్త నిధుల కోసం దుండగుల వేట.. బయటపడ్డ అరుదైన మూషికా విగ్రహం.. ఇంతకీ ఏంచేశారంటే..?

|

Sep 10, 2021 | 8:13 PM

వినాయకచవితి రోజే అరుదైన మూషికా విగ్రహం లభ్యమైంది. పెద్దపల్లి జిల్లాలో అరుదైన పురాతన మూషిక విగ్రహం బయటపడింది.

Rare statue: గుప్త నిధుల కోసం దుండగుల వేట.. బయటపడ్డ అరుదైన మూషికా విగ్రహం.. ఇంతకీ ఏంచేశారంటే..?
Rare Statue
Follow us on

Rare statue in Peddapalli: వినాయకచవితి రోజే అరుదైన మూషికా విగ్రహం లభ్యమైంది. పెద్దపల్లి జిల్లాలో అరుదైన పురాతన మూషిక విగ్రహం బయటపడింది. గోదావరిఖని పట్టణానికి సమీపంలో ఉన్న జనగామ గ్రామంలో మూషిక విగ్రహాన్ని గుర్తించారు. కాకతీయుల కాలంనాటి త్రి లింగ రాజరాజేశ్వర స్వామి ఆలయ సముదాయంలో లభ్యమైన ఈ విగ్రహాన్ని 8 వందల ఏళ్లనాటి అరుదైన మూషిక విగ్రహంగా పురావస్తు చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు.

11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని ఎడ రాజు పాలించేవాడని, ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని జైన గ్రామమని జైనీయులకు ధారాదత్తం చేశారని, ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు వశం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట శిథిలావస్థలో ఉన్న త్రికూటాలయం వెనుక పొదల మధ్య ఈ మూషిక విగ్రహం బయటపడింది.ఈ విగ్రహం తెలంగాణలోనే అతి పెద్ద, అరుదైన మూషిక విగ్రహంగా చరిత్రకారులు భావిస్తున్నారు. అన్ని రకాల ఆభరణాలతో అలంకరించి ఉన్న మూషిక విగ్రహం గణపతి దేవుని కాలం నాటిదని పురావస్తు పరిశోధకులు నిర్ధారించారు. ఈ విగ్రహానికి సంబంధించి పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో తుప్పలు, పొదలు తొలగిస్తుండగా గణపతి వాహనం వెలుగుచూసిందని చెప్పారు. ఈ శిల్పం 3 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తు ఉందని శివనాగిరెడ్డి తెలిపారు.

గుప్త నిధుల కోసం ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెకిలించి ఉంటారని భావిస్తున్నారు. పవిత్ర గోదావరి నది తీరంలో ఉన్న ఈ జనగామ గ్రామంలోని త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ ఆలయంలో అరుదైన మూషిక విగ్రహాం లభ్యమవటం చాలా గొప్ప విషయమని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన చుట్టూపక్కల గ్రామస్థులు తండోపతండాలు తరలి వచ్చి దర్శించుకుంటున్నారు.

Read Also…  Vinayaka Chavithi : కరోనా వ్యాక్సిన్ బాటిల్‌లో వినాయక విగ్రహం.. మండపంలో టీకాపై అవగాహన కార్యక్రమం.. ఎక్కడంటే..