Taj Mahal: తడియారని కన్నీటి బొట్టుగా తప్పుదోవపట్టిన తాజ్ మహల్ అసలు కథ! చరిత్ర విప్పి చెప్పని వాస్తవాలు..!
ఐతే ఇటీవల కాలంలో కొన్ని వివాదాస్పద కారణాలతో తరచుగా తాజ్ మహల్ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో తాజ్ మహల్ గురించి చరిత్ర బయటపెట్టని ఎన్నో నమ్మలేని నిజాలు.. ఆ విశేషాలు మీ కోసం..
15 Amazing Facts About The Taj Mahal: తాజ్ మహల్ పేరు వినగానే ఓ ప్రేమికుని మధుర స్వప్నంగా, ప్రేమ బంధానికి, ప్రణయత్త్వానికి స్మారక స్మృతిగా భావ కవులు అభివర్ణిస్తే.. దోపిడీకి చిహ్నంగా, తరతరాలుగా తడియారని కన్నీటి బొట్టుగా విప్లవ కవులు వర్ణించారు. శ్రీశ్రీ మరో అడుగు ముందుకేసి ’మహాప్రస్తానం’లో “తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు ?” అని ఏకి పారేశాడు. రాజులు పోయినా, రాజ్యాలు గతించినా, కాల చక్రంలో యేళ్ళు గిర్రున తిరిగినా తాజ్ మహల్ రాజసం మాత్రం చెక్కు చెదరలేదు. ఎందరో ప్రేమికులకు, కళాకారులకు, కవులకు నేటికీ స్ఫూర్తిగా నిలుస్తోందీ చలువరాతి కట్టడం. ప్రపంచవింతల్లో ఒకటిగా, అమర ప్రేమకు చిహ్నంగా.. అన్నింటికిమించి అద్భుత, అందమైన కట్టడంగా చరిత్రలో ఖ్యాతి గడించింది తాజ్ మహల్! ఐతే 21 యేళ్ల పాటు వందలాది కూలీలు రాత్రింబవళ్ళు కష్టపడి నిర్మించిన ఈ కట్టడం (taj mahal construction facts) అందం వెనుక చరిత్ర స్మృతుల్లో బయటపడని నిజాలు కూడా ఉన్నాయి. ఎన్నో తప్పుడు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
వాస్తవం తెలుసుకుంటే బహుశా! తాజ్ మహల్ మన కంటికి మనుపటి కంటే మరింత అందంగా కనిపిస్తుందేమో. యేటా కోట్లాది మంది తాజ్ మహల్ అందాలను తిలకించడానికి ప్రపంచ నలుమూలల నుంచి మన దేశానికి సదర్శిస్తుంటారు. ఐతే ఇటీవల కాలంలో కొన్ని వివాదాస్పద కారణాలతో తరచుగా తాజ్ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో తాజ్ మహల్ గురించి చరిత్ర బయటపెట్టని ఎన్నో నమ్మలేని నిజాలు.. ఆ విశేషాలు మీ కోసం..
మొఘలుల అద్భుత శిల్ప సౌందర్యమే తాజ్ మహల్..
స్వాతంత్ర్య పూర్వం భారతదేశాన్ని పాలించిన రాజ వంశీకులలో మొఘలులు కూడా ఉన్నారు. 5వ మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనా కాలంలో 1637లో రాజధానిని ఢిల్లీకి మార్చాడు. షాజహాన్ మూడో భార్య ముంతాజ్ మహాల్ 14వ సంతానానికి జన్మనిచ్చే సమయంలో మరణించింది. ఆమె మరణం షాజహాన్‌ను ఎంతో కృంగదీసింది. ఎంతగా అంటే కేవలం కొన్ని నెలల్లోనే అతని జుట్టు, గెడ్డం మంచులా తెల్లగా నెరసిపోయేంతగా.. ఆమె మరణాంతరం షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించాడు. స్వాతంత్ర్యం వచ్చాక బెస్ట్ టూరిస్ట్ ప్రేస్‌గా తాజ్‌మహల్ ప్రపంచ ఖ్యాతి గడించింది.
చారిత్రక ఆధారాలు
తాజ్ మహల్ నిర్మాణం క్రీ.శ 1632 లో ప్రారంభమవగా క్రీ.శ.1648లో పూర్తయింది. మసీదు, గెస్ట్ హౌస్, దక్షిణాన ప్రధాన ద్వారం, బయటి ప్రాంగణం, ఇతర హంగులన్నింటినీ కలిపి క్రీ.శ1653 నాటికి పూర్తి నిర్మాణం సిద్ధమయింది. తాజ్‌మహల్‌లోపల ముంతాజ్ మహల్ సమాధి మాత్రమే కాకుండా షాజహాన్ సమాధి కూడా ఉంది. దీని నిర్మాణ వ్యయం దాదాపు రూ.32 మిలియన్లని అంచనా. అరబిక్ లిపిలో రచించబడిన అనేక చారిత్రక, ఖురానిక్ శాసనాలు తాజ్‌మహల్ కాలక్రమానుసార వివరాలను సేకరించడానికి ఉపయోగపడుతున్నాయి.
తాజ్ మహల్ నిర్మాణ పనుల్లో ప్రపంచ మూలల నుంచి వచ్చిన కళాకారులు
తాజ్ మహల్ నిర్మాణానికి మొఘల్ సామ్రాజ్యంలోని ప్రతి మూల నుంచి.. మధ్య ఆసియా, ఇరాన్‌ల నుంచి తాపీపని చేసేవారు, స్టోన్ కట్టర్లు, రత్నలను పొదిగేవారు, చెక్కేవారు, చిత్రకారులు, కాలిగ్రాఫర్లు (Calligraphy), గోపురాలను నిర్మించేవారు, ఇతర కళాకారులను ఆగ్రాకు తరలించారు. ప్రధాన శిల్పకారుడు (main architect) ఉస్తాద్-అహ్మద్ లాహోరీ ఆధ్వర్యంలో దీని నిర్మాణం రూపుదాల్చింది. చారిత్రక ఆధారాల ప్రకారం.. తాజ్‌మహల్ నిర్మాణానికి దాదాపు 20,000 మంది కళాకారులు పనిచేశారు.
తాజ్ మహల్‌లోపలున్న సమాధుల్లో షాజహాన్, ముంతాజ్‌ల శరీరాలున్నాయా?
తాజ్ మహల్ తెలుపు రంగులో మెరిసిపోయే అతిపెద్ద గోపుర సమాధి. దీని చుట్టూ నాలుగు మూలల్లో, నాలుగు పొడవైన మినార్లు ఉంటాయి. దీని బాహ్య (బయటి) భాగం తెల్లని పాలరాయి (white marble)తో చేయబడింది. తాజ్‌మహల్ లోపల మెయిల్ బిల్డింగ్‌లో షాజహాన్, ముంతాజ్ మహల్‌లకు చెందిన రెండు సమాధులు ఉంటాయి. సమాధి (cenotaph) అనేది గ్రీకు పదం. “ఖాళీ సమాధి” అని దీనర్థం. అంటే తాజ్‌మహల్ లోపలున్న సమాధుల్లో షాజహాన్, ముంతాజ్ మహల్‌లకు చెందిన శరీరాలు లేవన్నమాట. అవి ఖాళీ సమాధులు. నిజానికి వీరిద్దరి శరీరాలను సార్కోఫాగి (sarcophagi) చేయబడ్డాయి. అంటే గ్రీకులు తమ పూర్వీకులను మమ్మీలుగా మర్చి పెద్ద శవ పేటికల్లో ఏవిధంగా ఐతే భద్ర పరుస్తారో అలాగన్నమాట. లోపల ఉండే సెనోటాఫ్ లేదా స్మారక సమాధి/చిహ్నం (శవముతో పాతిపెట్టకుండా ఖాళీ సమాధులను నిర్మించడాన్ని సెన్‌టాఫ్ అంటారు) చుట్టూ ఉన్న భాగాన్ని విలువైన వజ్రాలతో పొదిగించారు. రెండు బిల్డింగులు (తాజ్ మహల్‌కు ఇరువైపులా ఉండేవి), మసీదు, అసెంబ్లీ హాలులను ఎర్రటి ఇసుక రాయితో నిర్మించారు. తాజ్‌మహల్ ప్రాంగణంలో గార్డెన్, అందంగా డిజైన్ చేసిన కొలను కూడా ఉన్నాయి.
మరణశయ్యపై ఉన్న ముంతాజ్ కోరిన ఆ నాలుగు కోరికలు ఇవే: ఇతిహాసాల ప్రకారం.. ముంతాజ్ మహల్ చనిపోయే ముందు తన భర్తైన షాజహాన్ దగ్గర నాలుగు వాగ్ధానాలు తీసుకుందట. అవేంటంటే..
- తాజ్‌మహల్‌ను నిర్మించడం
- ఆమె మరణానంతరం అతను మళ్లీ పెళ్లి చేసుకోవడం
- ముంతాజ్ మహల్‌కు పుట్టిన పిల్లలను ప్రేమగా చూసుకోవడం
- ఆమె మరణించిన రోజున (వర్ధంతి నాడు) సమాధిని సందర్శించడం
ఔరంగజేబు ఎంత పని చేశాడు!
ఐతే షాజహాన్ అనారోగ్యం, అతని సొంత కుమారుడైన ఔరంగజేబు గృహనిర్బంధంలో ఉంచినందున, మొదటి మూడు వాగ్థానాలను నెరవేర్చిన చివరి వాగ్దానాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయాడనే నానుడి ఒకటి ప్రచారంలో ఉంది. మరో కథనం ఏంటంటే.. అనారోగ్యంతో ఉన్న షాజహాన్‌ను ఔరంగజేబు జైలులో ఉంచినప్పుడు, అతను తన మంచం మీద పడుకుని.. నిర్దిష్ట కోణంలో గోడకు అమర్చిన వజ్రం గుండా తాజ్‌మహల్‌ను నిరంతరం చూస్తూ ఉండేవాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది.
రోజంతా రంగులు మార్చుకునే అపురూప కట్టడం
తాజ్‌మహల్‌కున్న మరొక ప్రత్యేకత ఏంటంటే.. రోజంతటిలో దాని రంగు మారుతూ ఉంటుంది. తెల్లని పాలరాయితో తయారు చేసినందువల్ల, సూర్యకిరణాలు దానిని తాకినప్పుడు దాని రంగు పసుపు రంగులోకి మారుతుంది. సూర్యాస్తమయం జరిగుతున్నప్పుడు నెమ్మదిగా నీలం రంగులోకి మారుతుంది. ఈ విధంగా రంగులు మారడానికి కూడా షాజహాన్‌కు, ముంతాజ్ మహల్‌పై ఉన్న ప్రేమ కారణమని అంటారు. ఎలాగంటే ముంతాజ్ మరణానంతరం ఏ విధంగానైతే షాజహాన్ రూపు, రంగులో మార్పులు చోటుచేసుకున్నాయో.. ఆ విధంగానే తాజ్ మహల్ కూడా రంగులు మారుస్తుందని ప్రణయ కవులు తమ కవితల్లో వర్ణిస్తుంటారు.
తాజ్ మహల్ బయటి మినార్లు ఎందుకు వాలుగా ఉంటాయో తెలుసా..
తాజ్ మహల్ ముందు భాగంలో ఉండే రెండు మినార్లు కొద్దిగా వాలుగా ఉంటాయి. ఎందుకో తెలుసా? మెయిన్ బిల్డింగ్ (తాజ్ మహల్) ధ్వంసం కాకుండా ఉండేందుకు అలా నిర్మించారు. ఎలాగంటే.. కొంతకాలానికి స్తంభాలు శిథిలమై పడిపోతే.. అవి నేరుగా బయటికి పడిపోయేందుకు వీలుగా నిర్మించబడింది (లోపల పడితే మహల్ మీద పడి ధ్వంసం అవుతుందని). ఏ భాగం కూడా శిథిలంకాకుండా ఉండేందుకే ఈ ప్రత్యేక ఏర్పాటు.
అందుకే ఆగ్రాలో తాజ్ మహల్.. లేదంటే ఎక్కడుండేదో తెలుసా?
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోనున్న తాజ్ మహల్ నిర్మాణం ఉన్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా అది ప్రసిద్ధి చెందింది (ఎర్రకోటకు కూడా అంతటి ప్రఖ్యాతి లేదు). నిజానికి తాజ్ మహల్‌ను మొదట ఆగ్రాలో నిర్మించకూడదని అనుకున్నారని మీకు తెలుసా? ముంతాజ్ మహల్ బుర్హాన్‌పూర్ అనే నగరంలో (ప్రస్తుత మధ్యప్రదేశ్) ప్రసవ సమయంలో మరణించింది. బుర్హాన్‌పూర్‌లోనే తాజ్ మహల్ నిర్మాణానికి స్థలంగా మొదట ఎంపిక చేశారు. అక్కడ తాజ్‌ను నిర్మించడానికి షాజహాన్ తపతి నది ఒడ్డున ఒక స్థలాన్ని కూడా ఖరారు చేశాడు. ఐతే బుర్హాన్‌పూర్‌లో తాజ్ నిర్మాణానికి సరిపడినంత తెల్ల పాలరాయి సరఫరా చేసేందుకు వీలుపడలేదట. అందుకే తాజ్ మహల్ నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత ముంతాజ్ మహల్ అవశేషాలను.. ఆగ్రాకు తరలించారు. అంతేకాకుండా బుర్హాన్‌పూర్లో తపతి నది ఒడ్డున తొలుత తాజ్ మహల్ కోసం ఎంపిక చేసిన స్థలం చాలా కాలం పాటు ఖాళీగా ఉంది.
నలుపుకాబోయి తెలుపైన తాజ్ మహల్
పురాణాల (legends) ప్రకారం, షాజహాన్ యమునా నది ఒడ్డున నల్లని పాలరాయితో ‘నల్ల తాజ్ మహల్’ని నిర్మించాలనుకున్నాడు. కానీ షాజహాన్‌ను ఔరంగజేబు ఖైదు చేసినందున ఆ ఆలోచన విరమించుకున్నాడట. తాజ్ ప్రాంగణంలో నల్ల పాలరాయి అవశేషాలు కూడా కనుగొనబడ్డాయి. ఐతే 1990లో జరిపిన తవ్వకాల్లో తెల్ల పాలరాయి రాళ్ళు కాలక్రమేణా నల్లగా మారి, నల్ల రాళ్లలా కనిపిస్తున్నాయని ఆర్కియాలజిస్టులు తేల్చారు. ఇది నిజంగా ఊహా.. లేక షాజహాన్ నిజంగానే తాజ్ మహల్‌ను నల్ల పాలరాతితో కట్టాలనుకున్నాడా? అనే ప్రశ్నకు సమాధానం చరిత్ర పుటల్లో కనుమరుగైపోయింది.
తాజ్ నిర్మాణం చేపట్టిన కార్మికుల చేతులు షాజహాన్ నరికించాడా? ఎంతవరకు వాస్తవం..
తాజ్ మహల్ నిర్మాణం గురించి మరో ప్రసిద్ధ కథనం ఏంటంటే..తాజ్ మహల్ నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులందరి చేతులను షాజహాన్ నరికివేయించాడు. అందువల్లనే షాజహాన్ తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరూ అంతటి అపురూపమైన కట్టడం మరొకటి నిర్మించలేకపోయారనే వాదన లేకపోలేదు. ఐతే ఇది వాస్తవం కాదని ఎన్నో యేళ్లుగా చరిత్రకారులు చెబుతూనే ఉన్నారు. కార్మికుల చేతులు నిరికివేయమని షాజహాన్ ఎప్పుడూ చెప్పనేలేదు. ముఖ్యంగా ప్రముఖ చరిత్రకారుడు ఎస్ ఇర్ఫాన్ హబీబ్ (historian S Irfan Habib) ప్రకారం.. ఈ కథనానికి చరిత్రలో ఎటువంటి ఆధారాలు లేవు.
సమాధులపై వేలాడే దీపం బ్రిటీష్ కాలం నాటిది..
బ్రిటీష్ పాలన కాలంలో భారతదేశ వైస్రాయ్‌గా పనిచేసిన లార్డ్ కర్జన్‌కు తాజ్ మహల్ అంటే అమితమైన ఇష్టం. యాతృచ్ఛికంగా తాజ్ లోపల అతని పేరుతో ఒక దీపం (Lamp) కూడా ఉంది. ఐతే లార్డ్ కర్జన్ వైస్రాయ్‌గా ఉన్న సమయంలో, గతంలో ఉపయోగించిన స్మోకీ డిమ్ ల్యాంప్‌లను (smoky dim lamps) తొలగించి, వేరే దీపాలను వాటిస్థానంలో పెట్టించాలనుకున్నాడు. అందుకు ఇద్దరు ఈజిప్షియన్ పండితులు, టోడ్రోస్ బాదిర్ అనే కళాకారుడిని నియమించి, అనుకున్నట్లుగానే తాజ్ మహల్‌లోపల దీపాన్ని పెట్టించాడు. ఆ విధంగా.. ప్రస్తుతం షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధులపై వేలాడుతున్న కంచు దీపం కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో తయారుచేయించి పెట్టబడింది. అంతేకాకుండా దీపం పెట్టించి, అక్కడ ”1906లో ముంతాజ్ మహల్ సమాధికి లార్డ్ కర్జన్ వైస్రాయ్ సమర్పించినది” అని ఓ శాసనం కూడా వేయించాడు.
రెండో ప్రపంచ యుద్ధకాలంలో తాజ్ మహల్‌ను ఏ విధంగా కాపాడారంటే..
రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) తాజ్ మహల్‌ను భారీ పరంజాతో దాచిపెట్టింది. బాంబులు వేసే వారిని తప్పుదారి పట్టించేందుకు పెద్దఎత్తున ఆయుధాలు నిల్వచేసిన స్థావరంగా కనిపించేటట్లు చేశారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజ్ మహల్‌ను ఆకుపచ్చ గుడ్డతో కప్పిపెట్టి రక్షించింది. ఈ విధంగా యుద్ధకాలంలో తాజ్‌ను కాపాడుకునేందుకు భిన్న వ్యూహాలను అవలంభించారు. లేదంటే ? ఊహించగలరా.. తాజ్ మహల్‌లేని భారతదేశం ఏ విధంగా ఉంటుందో!
బ్రిటీష్ దొరలు అపహరించిన విలువైన రాళ్లు
తాజ్ మహల్ చుట్టూ 28 రకాల అరుదైన, విలువైన రాళ్లతో పొదిగించారు. వాటిని శ్రీలంక, టిబెట్, చైనా, మన దేశంలోని అనేక ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. బ్రిటీష్ పాలనలో తెల్ల దొరలు ఈ రాళ్లను చాలాసార్లు అపహరించారు. 19వ శతాబ్దం చివరిలో వీటి పునరుద్ధరణ పనులు జరిగాయి.
మన తాజ్‌కు ప్రపంచ ఖ్యాతి
తాజ్ మహల్ 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. మొఘలుల వాస్తుశిల్పా నైపుణ్యానికి ప్రధాన ఉదాహరణగా పరిగణించబడుతుంది. 2007లో ప్రపంచ 7 వింతల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.