మనిషి జీవితం షడ్రుచుల సమ్మేళనం అయినప్పుడు.. ఈ ఏడాది సంఘటనలు కూడా అలాగే ఉంటాయిగా. కొన్ని తీపి జ్ఞాపకాలు, మరికొన్ని చేదు అనుభవాలు.. గుర్తుంచుకోవాల్సిన విజయాలు, మరిచిపోలేని ఓటములు.. ప్రముఖుల అరెస్టులు, ఆటగాళ్ల రిటైర్మెంట్లు.. ఆధ్యాత్మిక సంబరాలు, అద్భుత విజయాలు.. దేశాన్ని కుదిపేసిన దారుణాలు, సమాజాన్ని ప్రభావితం చేసినవారి మరణాలు.. ఇలా అన్నింటినీ మరోసారి గుర్తు చేసుకుందాం.. హిందువుల శతాబ్దాల కల నెరవేరిన ఏడాది ఇది. అయోధ్యానగరిలో భవ్య రామమందిరం రూపుదిద్దుకున్న అపురూపమైన ఏడాది ఇది. 2024కు ఒక గొప్ప ఆరంభాన్ని ఇచ్చింది బాలరాముని దర్శనం. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహించారు. అతిరథ మహారథుల సమక్షంలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండుగలా జరిగింది ఆనాడు. వజ్రతిలకంతో అపూర్వ ఆభరణాలతో కూడిన ఆ సుందర రూపాన్ని చూసేందుకు భక్త కోటి పోటెత్తింది. ఆ ప్రారంభోత్సవ వేడుకను.. వేలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా వీక్షించారు. 500 ఏళ్లుగా రామ మందిరం కోసం పోరాడుతున్న హిందువులకు మరపురాని జ్ఞాపకాలను అందించింది 2024..
ఇక ఈ ఏడాది అత్యంత ఉత్కంఠగా సాగింది మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికలే. మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, లేదా కాంగ్రెస్ కూటమికి అధికారం దక్కుతుందా? పోటాపోటీగా సాగిన ఎన్నికల రణరంగంలో రికార్డ్ విజయాన్ని అందుకుంది బీజేపీ. 400 సీట్లే టార్గెట్‌గా బరిలో దిగినప్పటికీ.. 240 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. అయినా సరే.. మిత్రపక్షాల అండతో మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు మోదీ. ఈ విజయంతో జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును కూడా సమం చేశారు ప్రధాని మోదీ.
ఈసారి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజల విలక్షణ తీర్పు కనిపించింది. ఒడిశాలో 25 ఏళ్ల సుదీర్ఘ పాలనకు బ్రేక్ పడింది. బీజేడీ నేత నవీన్ పట్నాయక్ పాలన నుంచి మార్పు కోరుకున్న ఒరియా ఓటర్లు.. బీజేపీకి అధికారం కట్టబెట్టారు. ఒడిశాకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్.. కంటబంజీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి లక్ష్మణ్ బాగ్ చేతిలో 16వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒడిశాతో పాటే ఆంధ్రప్రదేశ్‌కూ ఎన్నికలు జరిగాయి. చరిత్ర చూడని విజయంతో టీడీపీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో.. అరుణాచల్ ప్రదేశ్‌ను తిరిగి దక్కించుకుంది బీజేపీ. సిక్కింలో క్రాంతి కారి మోర్చా పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది దేశం మొత్తం ఆసక్తిగా గమనించిన ఎన్నికలు జమ్ము అండ్ కశ్మీర్‌వే. ఆర్టికల్ 370 రద్దు తరువాత వచ్చిన ఎన్నికలు కావడంతో.. ప్రజలు ఎవరిని గెలిపిస్తారనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా గెలుపు అంచుల్లోకి వచ్చిన కాంగ్రెస్.. అనూహ్యంగా ఓడిపోయింది. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు. మహారాష్ట్రలో గతంలో ఎన్నడూ చూడని విజయాన్ని సాధించింది మహాయుతి కూటమి. నవంబర్ 23న వచ్చిన ఫలితాల్లో 288 స్థానాలకు ఏకంగా 230 స్థానాల్లో విజయం సాధించింది. దాదాపు 48 ఏళ్లుగా మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడే లేరు. ఇక జార్ఖండ్‌లో జేఎంఎం అధికారాన్ని నిలుపుకుంది.
ఈ ఏడాది ఢిల్లీ రాజకీయాల్లో జరిగిన అనూహ్య మలుపుల గురించి కచ్చితంగా గుర్తుచేసుకోవాలి. మొదటగా చెప్పుకోవాల్సింది కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. జైలులో ఉన్నంత కాలం సీఎం పదవిలోనే కొనసాగిన కేజ్రీవాల్.. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 15న జరిగిన బహిరంగ సభలో.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అతిశిని ఢిల్లీ సీఎం కుర్చీపై కూర్చోబెట్టారు.
2024లో కేజ్రీవాల్‌తో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖుల అరెస్టులు కూడా జరిగాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 26 వరకు ఆమెకు బెయిల్ రాలేదు. ఇక జనవరి 31న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అక్రమ భూకబ్జా కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో చంపై సోరెన్‌ను జార్ఖండ్ సీఎంగా కూర్చోబెట్టారు. 150 రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు హేమంత్ సోరెన్.
భారత రాజకీయాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో సందర్భం.. ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ రంగ ప్రవేశం. పార్టీని వెనకుండి నడిపిస్తున్న ప్రియాంక.. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. రాహుల్‌గాంధీ రాజీనామా చేసిన వయనాడ్ పార్లమెంట్ స్థానానికి.. నవంబర్‌లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో రాహుల్ గాంధీ రికార్డును చెరిపేస్తూ.. ఏకంగా 6 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్ధిపై 4 లక్షల 10వేల ఓట్ల తేడాతో గెలిచారు.
దేశాన్ని కుదిపేసిన క్రైమ్ సంఘటనల గురించి కూడా చెప్పుకోవాలిక్కడ. కోల్‌కతాలో డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు.. యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి అత్యంత కర్కశంగా హతమార్చారు. ఆగస్టు 9న జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు.. మరో నిర్భయను తలపించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ డాక్టర్లు నిరసనకు దిగారు. బెంగాల్‌లో రోజుల తరబడి ఆందోళనలు చేపట్టారు డాక్టర్లు. ఆ దారుణాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా నిరసనకు దిగారు. జూనియర్ డాక్టర్ అనుమానాస్పద మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతోంది. ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ ఇంకా జైలులోనే ఉన్నారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఈమధ్య బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ ఘటన తరవాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.. మలయాళ చిత్రపరిశ్రమలోని చీకటి బాగోతలే. కొంతమంది నటులు, దర్శకులు, నిర్మాతల చీకటి కోణాలను జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ బయటపెట్టింది. యాక్టర్స్ సిద్ధిఖి, ముకేష్, జయసూర్య, మణియన్‌పిల్ల రాజు, ఇడవెల బాబు వంటి సినీ పెద్దలు చిత్రపరిశ్రమలోని నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. నిజానికి రెండేళ్ల క్రితమే వెలుగు చూడాల్సిన ఈ నివేదిక.. కోర్టు కేసులతో వాయిదా పడుతూ వచ్చింది. చివరికి హైకోర్టు కలగజేసుకోవడంతో.. కేరళ ప్రభుత్వం ఆ రిపోర్టును బయట పెట్టక తప్పలేదు. ఈ పరిణామాలతో మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని సైతం రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఇక ముంబైలో అక్టోబర్ 12న జరిగిన మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ మర్డర్ కూడా సంచలనం సృష్టించింది. ఈ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దారుణాలు మరోసారి తెరపైకి వచ్చాయి. సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సిద్దిఖీని హత్య చేయడం ద్వారా పరోక్షంగా సల్మాన్‌ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు పంపింది. గుజరాత్ జైల్లో ఉన్న బిష్ణోయ్ జైలు నుంచే తన కార్యకలాపాలను సాగిస్తున్నారు. విదేశాల్లో ఉన్న అన్మోల్ బిష్ణోయ్.. బాబా సిద్ధిఖి హత్యకు ప్లాన్ చేశారు.
2023 మేలో మొదలైన మణిపూర్‌లో అల్లర్లు ఈ ఏడాది కూడా ఆగలేదు. రెండు తెగల మధ్య ప్రారంభమైన అల్లర్లు మిలిటెంట్లు, ప్రత్యేక బలగాలకు మధ్య పోరాటంగా మారాయి. నవంబర్ 14న మైతీ తెగకు చెందిన ఇద్దరు పిల్లలు, ఓ మహిళ సహా ఆరుగురి శవాలు నదిలో కనిపించడంతో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కుకీ తెగ వాళ్లే మహిళలు, పిల్లల్ని కిడ్నాప్ చేసి హత్య చేశారనే అనుమానాలున్నాయి. సరిగ్గా రెండు రోజుల తరువాత.. నవంబర్ 16న ఏకంగా సీఎం బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసానికి నిప్పు అంటించే ప్రయత్నం కూడా జరిగింది. ఆ సమయంలో పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించినా నిరసనకారులు వెనక్కు తగ్గలేదు. ఆరుగురు ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకుల ఇళ్లపై ఆందోళనకారులు దాడులకు దిగారు.
ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం కృషిచేసిన మేటిఘనులు కన్నుమూసిన ఏడాది ఇది. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సర్ రతన్ టాటా గురించి. పుట్టుక పార్సీ అయినా పదహారణాల భారతీయుడు. నిఖార్సైన దేశభక్తుడు. స్కూల్ పుస్తకాల్లో కచ్చితంగా ఉండాల్సిన ఓ పాఠ్యాంశం. ఈ దేశంలో ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నా, ప్రపంచ కుబేరుల జాబితాలో బోలెడు మంది ఉన్నా.. రతన్ టాటా లాంటి వాళ్లు మాత్రం ఒక్కరే ఉంటారు. భారతదేశ ప్రజలు సగర్వంగా చెప్పుకోదగిన పారిశ్రామికవేత్తల్లో ఒకరైన పద్మవిభూషణ్ రతన్ టాటా.. అక్టోబర్ 9న అనారోగ్యంతో కన్నుమూశారు. పేరుకి వ్యాపారవేత్త అయినా.. అంతకు మించిన మానవతావాదిగా పేరు సంపాదించుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తీరుకు నిలువెత్తు నిదర్శనం అనే ఘనత దక్కించుకున్నారు రతన్‌టాటా.
సీతారాం ఏచూరి. మూడుసార్లు సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరి అనారోగ్యంతో సెప్టెంబర్ 12న కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీతారం ఏచూరి.. పుచ్చలపల్లి సుందరయ్యకు శిష్యుడు. సీతారాం ఏచూరి 12 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 1975లో సీపీఎంలో చేరిన సీతారాం ఏచూరి.. 1977లో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో జైలుకు కూడా వెళ్లారు. SFI నిర్మాణంలో ఏచూరి కీలకంగా పనిచేశారు. 1992 నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2015 నుంచి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. చనిపోయే వరకు కూడా ఆయన ఈ పదవిలోనే కొనసాగారు. 2004, 2023 ఇండియా కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు సీతారాం ఏచూరి.
ఇక భారతదేశాన్ని ఆర్థిక కష్టాల్లోంచి బయటపడేసిన ఘనుడు.. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్. డిసెంబర్ 26న తుదిశ్వాస విడిచారు. 1991లో భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు.. దేశ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గానూ పనిచేసిన అనుభవం ఉంది. అందుకే, రాజకీయాలతో సంబంధమే లేని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను.. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఇద్దరి సారథ్యంలోనే దేశ ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడిన పడింది. ఆ తరువాత దేశ ప్రధానిగా దశాబ్ద కాలం పాటు పాలించారు. ఆ పదేళ్ల పాలనలో దేశం ఆర్థికంగా పరుగులు పెట్టింది. జీడీపీ కొత్త రికార్డులు సృష్టించింది. పేదవాడు సగర్వంగా జీవించేలా కీలకమైన పథకాలను ప్రవేశపెట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆధార్, సెజ్ యాక్ట్.. ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చి సరికొత్త సంస్కరణలు అమలుచేశారు. మన్మోహన్ సింగ్‌కు డిసెంబర్ 28న అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.
తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మరణం.. సంగీత ప్రియులకు తీరని లోటు మిగిల్చింది. డిసెంబర్ 15న.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ అవార్డులను నాలుగు సార్లు అందుకున్న విద్వాంసుడు.. జాకీర్ హుస్సేన్. ఏడేళ్ల వయసు నుంచే తన తండ్రి వద్ద తబలా వాయించడంలో మెళకువలు నేర్చుకున్న జాకీర్.. విశ్వవేదికలపై తన మ్యూజిక్ మ్యాజిక్‌ను ప్రదర్శించారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సంగీత కచేరీలు చేసి అభిమానులను అలరించారు.
ఇక కళాత్మక చిత్రాల దర్శకుడు.. అచ్చమైన హైదరాబాదీ.. శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బెనగళ్ డిసెంబర్ 23న చనిపోయారు. హైదరాబాద్‌లోనే చదువుకున్న శ్యామ్ బెనగల్.. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసి.. ఆ తరువాత ‘అంకుర్’ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించారు. తొలి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్న శ్యామ్ బెనగల్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆయన ప్రతిభ చూసి నేషనల్ అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డులే వెతుక్కుంటూ వచ్చాయి. ‘అమరావతి కథలు’ను తెరపైకి తీసుకొచ్చింది కూడా శ్యామ్ బెనగలే.
ఇదే సందర్భంలో వయనాడ్ విలయాన్ని కూడా గుర్తుచేసుకోవాలి. కేరళలోని వయనాడ్ జిల్లాలో మారుమూల గ్రామాలపై కొండచరియలు విరిగిపడడంతో.. ఏకంగా 231 మంది సజీవ సమాధి అయ్యారు. దాదాపు 120 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. ఈ విలయానికి వేలమంది సర్వస్వం కోల్పోయారు.
ఇందాక పొలిటికల్ అరెస్టుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని అరెస్టుల గురించి మాట్లాడుకుందాం. అభిమానిని హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కన్నడ స్టార్ దర్శన్‌ను అరెస్ట్ చేశారు. రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా హింసించి, హతమార్చినట్లు కర్నాటక పోలీసులు ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. ఇదే కర్నాటకలో.. వందల మందిపై అత్యాచారాలు చేసి.. వాటిని వీడియోలు తీసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను సైతం అరెస్ట్ చేశారు. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రజ్వల్ తీసిన వీడియోలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఇది సెన్సేషన్ సృష్టించింది.
పెళ్లి అంటే ఇదీ అని కొన్ని తరాల వరకు గుర్తుంచుకునేలా జరిగింది అంబానీ ఇంట పెళ్లి. ఏడు నెలల ముందు నుంచే మొదలైన అనంత్ అంబానీ వివాహ వేడుకలను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. ఈ పెళ్లి కోసం ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చెబుతారు విశ్లేషకులు. అనంత్-రాధిక మర్చంట్ వివాహ వేడుకకు సుమారు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉండొచ్చని బ్రిటిష్ మీడియా ‘డైలీ మెయిల్’ ఓ కథనాన్ని ఇచ్చింది.
భారతదేశం సాధించిన గొప్ప విజయాల గురించి చెప్పుకుందాం ఇప్పుడు. 2024లోనూ సత్తా చాటింది ఇస్రో. అసలు ఈ ఏడాది మొదలవుతూనే జయభేరి మోగించింది. జనవరి 1న.. బ్లాక్ హోల్స్, ఎక్స్ రేస్‌పై శోధనకు పొలారీమీటర్ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం ముగిసిన వారంలోపే.. సూర్యునిపై పరిశోధనలకు ఆదిత్య ఎల్–1ను కక్ష్యలోకి చేర్చింది. లేటెస్ట్‌గా స్పేస్ డాకింగ్ టెక్నాలజీని విజయవంతంగా సాధించింది చూపించింది ఇస్రో. ఈ ప్రయోగం ద్వారా స్పేస్ క్రాఫ్ట్స్ డాకింగ్, అన్ డాకింగ్ టెక్నాలజీని పరీక్షించింది. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేయడం, విడదీయడం అనే టెక్నాలజీ భారత్‌కు కూడా సాధ్యం అని ప్రపంచానికి చాటింది ఇస్రో. డిసెంబర్ 30 రాత్రి 10:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన PSLV-C60 ప్రయోగం ఈ మైలురాయిని సాధించింది. తాజా ప్రయోగంతో ఇలాంటి సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.
ఇక స్పోర్ట్స్ విషయానికొద్దాం. 11 ఏళ్ల కరువు తీరిపోయేలా టీ-20 వరల్డ్‌కప్‌ను సాధించింది టీమ్ఇండియా. జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తిరుగులేని విజయాన్ని సాధించంది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకున్న భారత్.. మరో ఘనత కోసం 11 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తరువాత.. టీ-20లకు వీడ్కోలు చెబుతూ జూన్ 15 విరాట్ కొహ్లీ, జూన్ 20న రోహిత్ శర్మ, జూన్ 30న రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు తరువాత.. అనూహ్య నిర్ణయం ప్రకటించారు రవిచంద్రన్ అశ్విన్. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం.. క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది. ఇక ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గెలుచుకుంది. లీగ్ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడిన KKR.. మూడవసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
గుకేశ్ దొమ్మరాజు. ది వరల్డ్ చెస్ ఛాంపియన్. 2012 తరువాత భారత్‌కు ప్రపంచ చెస్ ఛాంపియన్ ట్రోఫీని అందించిన ఘనుడు.. తెలుగు కుటుంబానికి చెందిన గుకేశ్ దొమ్మరాజు. అంతేకాదు.. 18 ఏళ్ల వయసుకే ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన అతిపిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించారు. విశ్వనాథన్ ఆనంద్ తరువాత.. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సాధించిన రెండో భారత ఆటగాడిగానూ రికార్డ్ క్రియేట్ చేశారు.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఈసారి 6 పతకాలు సాధించింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్యం సాధించగా, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యం సాధించారు మనుభాకర్. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్యం, భారత హాకీ జట్టు కాంస్యం, 57 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో అమన్ కాంస్యం గెలిచారు. టోక్యోలో జరిగిన పారాఒలింపిక్స్‌లో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలతో 24వ స్థానంలో నిలిచింది భారత్. గెలిచింది తక్కువే అయినా.. గతం కంటే ఘనంగా పతకాలు సాధించింది ఇండియా..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..