World Environment Day: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మొక్కలు పెంచుదాం, భూమిని కాపాడుకుందాం!

| Edited By: Phani CH

Jun 05, 2021 | 9:16 AM

ధరణీమాత భగభగమండుతోంది. కన్నబిడ్డలు చేస్తోన్న అకృత్యాలు భరించలేక ఆవేదన చెందుతోంది. లక్షలకొద్ది హిరణాక్ష్యులని చూసి ఆ తల్లి తల్లడిల్లుతోంది.

World Environment Day: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మొక్కలు పెంచుదాం, భూమిని కాపాడుకుందాం!
Follow us on

ధరణీమాత భగభగమండుతోంది. కన్నబిడ్డలు చేస్తోన్న అకృత్యాలు భరించలేక ఆవేదన చెందుతోంది. లక్షలకొద్ది హిరణాక్ష్యులని చూసి ఆ తల్లి తల్లడిల్లుతోంది. అభివృద్ధి పేరుతో చేస్తోన్న అరాచకాలను తట్టుకోలేకపోతోంది. ఆవేదన చెందుతోంది. కాపాడమని ఆర్థిస్తోంది. ఆ భూమాత పెడబొబ్బలు మనకు వినబడవు.. వాహనాల రొద వాటిని మింగేస్తోంది. ధరణి కన్నీరు కారుస్తోంది. మనకు కనబడదు. ఫ్యాక్టరీల పొగమబ్బులు కమ్ముకున్నాయి. నేలతల్లి బతిమాలుతోంది. మనకు పట్టదు. అభివృద్ధి ముసుగు వేసుకున్న రక్కసి వికట్టాట్టహాసం చేస్తోంది. భూమాతకు ఎందుకింత ఆవేదన. ఎందుకింత బాధ. ఏమిటీ కష్టం.. అన్నిటికీ ఒకటే సమాధానం గ్లోబల్‌ వార్మింగ్‌.. ఇప్పుడు మానవాళి మేలుకోవాల్సిన సమయం వచ్చింది. ఉపేక్షిస్తే ఆ తల్లి మహోగ్రరూపం దాలుస్తుంది. అప్పుడంతా ప్రళయమే..ఆ విలయాట్టహాసంలో మాడిమసవ్వాల్సిందే.

మన కాళ్లకింద వెయ్యి టన్నుల న్యూక్లియర్‌ బాంబులున్నాయి. వందల కొద్ది హైడ్రోజన్‌ బాంబులున్నాయి. అవి ఏ క్షణంలోనైనా పేలవచ్చు. అదే జరిగితే భూమ్మీదున్న సమస్త జంతుజాలము చెట్లు చేమలు నాశనమవుతాయి. భూమి ఓ మరుభూమిగా మారిపోతుంది. నివాస యోగ్యంగా లేని గ్రహంగా మిగిలిపోతుంది. సూర్య కుటుంబంలోని మిగతా గ్రహాల్లా మారిపోతుంది.ఇది మండిపోతున్న ధరణి భవిష్యవాణి .మనం చేసే తప్పిదాలకు ప్రకృతి అప్పుడప్పుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నా అదిచ్చే ప్రమాద సంకేతాలను గుర్తించలేకపోతున్నాం. అసలు భూమాతను పరిరక్షించుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఇప్పుడొచ్చిందేమీ కాదు. అర్ధశతాబ్దం కిందటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. సమితి జనరల్‌ అసెంబ్లీ జూన్‌ 5, 1972న పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది ఇదే రోజున ఏదైనా ఓ నగరంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 1972 సవంత్సరం జూన్ 5న స్వీడన్‌లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు వార్షికోత్సవాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించి త‌గు చ‌ర్యలు చేప‌ట్టేలా ప్రోత్సహించ‌డ‌మే పర్యావరణ దినోత్సవ ముఖ్యోద్దేశం. ఇక అప్పట్నుంచి ప్రతి ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ప్రతి ఏడాది ఓ కొత్త సవాలు ఎదురవుతున్నది. ప్రతి ఏడాది ఓ సమస్య పలకిస్తున్నది.

ప్రతి ఏడాది సమావేశమవుతున్నారు బాగానే ఉంది.. అయినా ఏడాదికేడాది పర్యావరణం బాగా దెబ్బతింటోంది. పరిశ్రమలు పెరుగుతుండటంతో అవి వెదజల్లే కాలుష్యం వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. గాలి, నీరు, ఆహారం సమస్తం కలుషితమవుతున్నాయి. ప్రకృతి మనకిచ్చిన వనరులను మనం అవసరానికి మించి వాడుకుంటున్నాం. ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాం. కార్బన్‌మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో ఎక్కువ కావడంతో క్రమంగా భూమి వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు తగ్గిపోతున్నాయి.

రెండేళ్ల నుంచి మనం కరోనాతో నానా కష్టాలు పడుతున్నాం.. విషపూరిత వైరస్‌లు చాలా పుట్టుకొస్తున్నాయి.. ప్రపంచం ఇప్పుడు కరోనా వైరస్‌తో కకావికలం అవుతున్నది. మరణాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇది ఊహించని ఉపద్రవం.. ఇలాంటి వైరస్‌లకు అంతం పలకాల్సిన సమయం కూడా ఆసన్నమయ్యింది.. అందుకే ఒక్కటే మార్గం. పర్యావరణాన్ని పరిక్షించుకోవడమే!

ఒకప్పుడీ ధాత్రి ఎంత అందంగా వుండేది. పచ్చటి అడవులతో. పారే సెలయేళ్లతో. నదీనదాలతో. కొండ కోనలతో. మిగతా గ్రహాలకు కళ్లు కుట్టేంతగా. కుళ్లు పడేంతగా..ఇప్పుడు … ఊహించడానికే భయమేస్తోంది. మంచు యుగంలో భూమంతా మంచే. వాతావరణంలో సహజంగా వున్న గ్రీన్‌హౌస్‌ వాయువులైన కార్బన్‌డై ఆక్సైడ్‌, మిథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ల కారణంగానే భూమి క్రమంగా వేడెక్కింది. జీవం పుట్టింది. అభివృద్ధి చెందింది. మనిషైంది. ఆ మనిషి తెలివి మీరాడు. నాగరికత నేర్చాడు. తన నుంచి ఉద్భవించిన మనిషిని ముచ్చటపడింది భూమాత. ఇప్పుడు అదే మనిషిని చూసి భోరున విలపిస్తోంది. కారణం గ్లోబల్‌ వార్మింగ్‌. సహజసిద్ధంగా వెలువడే గ్రీన్‌హౌస్‌ వాయువులు భూమ్మీద ఇన్‌ఫ్రారెడ కిరణాలు ఉత్పత్తి చేసే రేడియో ధార్మికతను తగ్గించి టెంపరేచర్‌ను కంట్రోల్‌ చేస్తాయి. నాగరికత నేర్చిన మానవుడు గ్రీన్‌ హౌస్‌ వాయువులను వాతావరణంలోకి వదిలేస్తున్నాడు. ఫ్యాక్టరీల పొగగొట్టాలు. వాహనాలు. విద్యుదోపకరణాలు విడుదల చేసే వాయు కాలుష్యం కారణంగానే వాతావరణంలో గ్రీన్‌ హౌస్‌ వాయువుల పరిమాణం రెట్టింపైంది. ఓజోన్‌ పొర పలుచపడుతోంది. ఉష్టోగ్రతలు భయంకరంగా పెరిగిపోతున్నాయి…

వాతావరణంలో పెరుగుతున్న కర్బన తీవ్రత పర్యావరణ వేత్తలను బెంబేలెత్తిస్తోంది. గడచిన ఆరున్నర లక్షల సంవత్సరాలలో ఇంత కర్బన తీవ్రత లేదంటే ప్రస్తుత పరిస్థితి ఏంటో ఆలోచించాల్సిందే. పారిశ్రామికీకరణ జరగక ముందు వాతావరణంలో కార్బన్‌డైయాక్సైడ్‌ ఘనపరిమాణం 280 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌. అది క్రమేణా పెరుగుతూ వస్తోంది. ఇదే లెవల్లో పెరిగితే ఈ శతాబ్దాంతానికి గరిష్టంగా 1260కి చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు సైంటిస్టులు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మానవాళి తట్టుకోగల అత్యధిక కర్బన పరిమాణం 550 పార్ట్స్‌పర్‌ మిలియన్‌ మాత్రమే. ఈ లెక్కలు వింటే వెన్నులో సన్నటి వణుకురావడం లేదూ! వంటినిండా చెమటలు పట్టడం లేదూ!..నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం…మనిషి చేజేతులా అంతాన్ని కొని తెచ్చుకుంటున్నాడు…తను అంతమవ్వడమే కాకుండా ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నాడు. ప్రకృతి గతి తప్పితే అంతా వినాశనమే. రుతువులు మారతాయి. కాలాలు కనుమరుగవుతాయి. వేసవి మండిపోతుంది. కురిస్తే కుండపోత లేకుంటే లేదు. రుతుపవనాల జాడ వుండదు. శీతాకాలంలోనూ వేడి గాలులు వీస్తాయి. ఊహించని విధంగా తుపానులు విరుచుకుపడతాయి. తరచుగా భూకంపాలు పలకరించి వెళుతుంటాయి. వరదలు ముంచెత్తుతాయి. మొత్తానికి భూమి ప్రళయభీకర రూపం దాలుస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త పడదాం.. మనం నివిస్తున్న భూమిని కాపాడుకుందాం! పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగిద్దాం..గ్లోబల్‌వార్మింగ్‌ను ఎదుర్కొనే బాధ్యత ఒక్క ప్రభుత్వానిదో, ఒక్క సంస్థదో కాదు. అందరిదీ. పౌరులు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. భూగోళాన్ని రక్షించుకోడానికి కృషి చేయాలి. మనవంతుగా మనం చేయాల్సిన పనులు చేయాలి. కాలుష్యాన్ని నియంత్రిచాలి. ఉదాహరణకు….ప్లాస్టిక్‌. ఇది వేలాది సంవత్సరాలైనా భూమిలో కరగదు. అలాంటి ప్లాస్టిక్‌ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న వస్తువు కొనుగోలు చేసినా ప్లాస్టిక్‌ కవరు వాడుతున్నాం. అందుకే ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి. అందుకే మనం మార్కెట్‌కి వెళ్లేటపుడు ఓ బ్యాగ్‌ పట్టుకెళితే సరి. అలాగే చిన్నచిన్న విషయాలు. కూలర్‌ వాడేముందు ఇంట్లో కిటికీ తెరుచుకోవాలి. వృథాగా బల్బులు, ఫ్యానులు వేయకూడదు. బైక్‌ వాడకాన్ని తగ్గించాలి. దగ్గర్లో పనులకు వాహనం బయటకు తీయకూడదు. పనిచేసే కార్యాలయానికి దగ్గర్లో నివాసం ఉంటే వాహనాన్ని వాడాల్సిన అవసరమే ఉండదు. .హైటెక్‌ యుగంలో తప్పని సరైన కంప్యూటర్‌ వాడకంలోనూ జాగ్రత్తపాటించాలి. ఒక్క కంప్యూటర్‌ ఏడాదిలో 78కిలోల కార్బన్‌డైయాక్సైడ్‌ వెదజల్లుతుందట. అందుకే ఆఫీసులలో కంప్యూటర్‌ వాడేవాళ్లు దాని అవసరం లేనపుడు స్విచ్‌ ఆఫ్‌ చేస్తే సరి. అన్నింటిని మించి మొక్కలు నాటాలి.. అడవులను పెంచాలి. పర్యావరణ మార్పుల నుంచి ఈ భూమిని రక్షించడానికి మొక్కలు పెంచడం ఒక్కటే మార్గం.. చెటటూ చేమ గుట్ట పిట్ట అన్నింటినీ వాటి మానాల వాటిని బతకనిద్దాం.. మనమూ బతుకుదాం!

 

మరిన్ని ఇక్కడ చూడండి: Twitter Ban: ఆ దేశంలో ట్విట్టర్‌‌ బ్యాన్… దేశాధ్యక్షుడి ట్వీట్‌ను డెలీట్ చేసిన రెండ్రోజుల్లోనే..

Suicide: కీసరలో దారుణం.. అవమానం భరించలేక.. కుటుంబం బలవన్మరణం..