Delimitation in India: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. బిల్లు రాజ్యసభలోనూ పాసవుతుంది అనడంలో ఎవరికీ సందేహం లేదు. అయితే బిల్లుపై చర్చ సందర్భంగా మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి రాకుండా జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపై పలువురు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎంఐఎంకు ఇద్దరు సభ్యులు మినహా ఏ ఒక్కరూ బిల్లును వ్యతిరేకించనప్పటికీ.. బిల్లును స్వాగతిస్తూనే అనేక ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తారు. మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల తర్వాతే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ జరుగుతాయని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. అయితే ఆ పార్టీ 1976లో ఏం జరిగిందో ఓసారి గుర్తుచేసుకోవడం చాలా అవసరం. రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. 1952లో డీలిమిటేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 1952, 1963, 1973లో వరుసగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. కానీ నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియపై నిషేధాన్ని తీసుకొచ్చారు. దీని వెనుక చాలా కారణాలున్నాయి.
ఆనాటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ తన పార్టీ కాంగ్రెస్‌కు చేటు చేస్తుందని ఇందిరా గాంధీ భయపడ్డారు. 1971 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశ జనాభాలో ఉత్తర భారత రాష్ట్రాల వాటా పెరిగింది. దీంతో ఈ రాష్ట్రాలకు లోక్ సభ, అసెంబ్లీలలో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ పరిణామం ప్రతిపక్ష పార్టీలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని ఇందిరా గాంధీ భావించారు. ప్రతిపక్ష పార్టీలు జనాభాకు అనుగుణంగా ప్రాతినిథ్యం పొందేలా డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశాయి. ఇందిరా గాంధీ డీలిమిటేషన్‌ను రాజకీయ లబ్ధి కోసం ఒక సాధనంగా భావించారు. లోక్‌సభ, అసెంబ్లీలలో తమ మెజారిటీని నిలుపుకున్నంత కాలం డీలిమిటేషన్‌ను పెండింగ్‌లో పడేయాలని నిర్ణయించారు. 2001 జనాభా లెక్కల ప్రకారమే తదుపరి డీలిమిటేషన్ జరగాలి అంటూ నాడు ఇందిరా గాంధీ ఆ ప్రక్రియపై నిషేధాన్ని తీసుకొచ్చారు. డీలిమిటేషన్‌ను నిషేధిస్తూ ఇందిరా గాంధీ తీసుకున్న చర్య ప్రజాస్వామ్య విరుద్ధమని విస్తృతంగా అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి, అధికారంపై తన నియంత్రణను సుస్థిరం చేసుకోవడానికి ఇందిరా గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఇదొకటి అని పేర్కొన్నాయి.
2001 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగాల్సినప్పటికీ.. ఆ నిషేధాన్ని 2026 వరకు పొడిగిస్తూ నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1971 నుంచి 2001 మధ్య దేశంలో జనాభా పెరుగుదలలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపించింది. 70వ దశకం నుంచి కుటుంబ నియంత్రణ విధానాన్ని దక్షిణాది రాష్ట్రాలు అమలు చేస్తూ రాగా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆ నియంత్రణ లేదు. దాంతో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా దక్షిణాదితో పోల్చితే అనేక రెట్లు పెరిగింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న నాటి వాజ్‌పేయి ప్రభుత్వం డీలిమిటేషన్‌పై నిషేధాన్ని 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా తదుపరి సీట్ల సంఖ్య పెంపు కసరత్తు చేపట్టాలి. ఆ మేరకు పార్లమెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో సీట్ల సంఖ్య పెరుగుతుంది. సీట్ల సంఖ్యలో పెంపు లేకుండా 2009లో కేవలం ఉన్న నియోజకవర్గాల పునర్విభజన మాత్రమే జరిగింది.
డీలిమిటేషన్‌పై అమలవుతున్న నిషేధం ప్రకారం 2026 తర్వాత సేకరించే జనాభా లెక్కల ఆధారంగా తదుపరి డీలిమిటేషన్ జరగాలి. 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి జరుగుతూ వచ్చిన జనాభా లెక్కలకు 2021లో బ్రేక్ పడింది. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల ప్రక్రియ కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా దేశంలో జనగణనలో భాగంగా కులాలవారిగా లెక్కలు సేకరించాలన్న డిమాండ్ కూడా పెరిగింది. తద్వారా సామాజిక న్యాయం అందించవచ్చని కొన్ని పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఇంకా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. సాధారణ పరిస్థితుల్లో 2021లో జనాభా లెక్కల సేకరణ జరిగినా వాటితో డీలిమిటేషన్ చేపట్టడం సాధ్యం కాదు. 2026 తర్వాత జరిగే జనగణన తర్వాత అని రాజ్యాంగంలో పొందుపరిచిన నేపథ్యంలో 2031లో సేకరించిన జనాభా లెక్కల తర్వాత ఈ ప్రక్రియ జరగాలి. అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మరోలా ఆలోచిస్తోంది. 2031లో జరిగే జనాభా లెక్కల కారణంగా డీలిమిటేషన్ చేయాలంటే పెరిగిన సీట్లు 2034లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనే అమల్లోకి వస్తాయి. అప్పటి వరకు వేచి చూడకుండా.. 2021లో సేకరించాల్సిన జనాభా లెక్కలను 2026 వరకు వాయిదా వేయాలని చూస్తోంది. తద్వారా ఆ ఏడాదిలోనే జనాభా లెక్కలు సేకరించడంతో పాటు వాటి ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టవచ్చని భావిస్తోంది. అందుకే మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌కు ముడిపెట్టి 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చేలా చేయాలని చూస్తోంది. తద్వారా సీట్ల సంఖ్య పెంచి రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న అనేక మంది పురుషులు తమ అవకాశాలు కోల్పోకుండా ఉంటారని, అదే సమయంలో కొత్తగా మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలతో మహిళా నాయకత్వం వృద్ధి చెందుతుందని భావిస్తోంది.
ఉత్తర భారతదేశ జనాభా దక్షిణ భారతదేశం కంటే ఎక్కువగా ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియలో డీలిమిటేషన్ తర్వాత ఉత్తర భారతదేశంలో సీట్ల సంఖ్య పెరుగుతుంది. దక్షిణ భారతదేశంలో సీట్లు ఆ నిష్పత్తిలో పెరగకపోవచ్చు. డీలిమిటేషన్ కమిషన్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య వ్యత్యాసం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సీట్ల సంఖ్యను పెంచకుండా ఉన్న సీట్లతో పునర్విభజన చేసినా సరే ఉత్తర భారతదేశంలో సీట్లు పెరిగి, ఆ మేరకు దక్షిణ భారతదేశంలో తగ్గుతాయి. అలాకాకుండా మొత్తం పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచినా.. అందులో ఉత్తరభారతదేశం వాటా మరింత పెరిగి, దక్షిణ భారత వాటాలో మార్పులు లేకపోవచ్చు లేదా తగ్గవచ్చు.
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 90-95కి పెరుగుతుందని అంచనా. బీహార్‌లో ప్రస్తుతం 40 లోక్‌సభ స్థానాలుండగా.. డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 45-50కి పెరుగవచ్చు. తమిళనాడు: తమిళనాడులో ప్రస్తుతం 39 లోక్‌సభ స్థానాలున్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 34-37కి తగ్గుతుందని అంచనా. కేరళలో ప్రస్తుతం 20 లోక్‌సభ స్థానాలుండగా.. డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 17-19కి తగ్గవచ్చు.
గమనిక: ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని గమనించాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..