Donald Trump 2.O: డొనాల్డ్ ట్రంప్ విజయం.. భారత్‌కు వరమా.. లేక శాపమా?
అమెరికా విదేశాంగ విధానంలో డొనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాల్లో భారతదేశానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలకులు మాత్రం పాకిస్తాన్‌కు ఇతోధికంగా సహకరిస్తూ పరోక్షంగా భారతదేశానికి నష్టం కలిగిస్తూ వచ్చారు. కానీ ట్రంప్ హయాంలోనే భారత్-అమెరికా సంబంధాలు బలోపేతమయ్యాయి.
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. యావత్ ప్రపంచంపై ఆ దేశం ప్రభావం అలాంటిది. 90వ దశకం తర్వాత నుంచి ఆ దేశం భారతదేశంపై చూపే ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ గతంలోనూ ఒక పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడం, కొన్ని అంశాలపై ఆయన నిక్కచ్చి వైఖరి గురించి భారతదేశానికి, అమెరికాలో స్థిరపడ్డ భారతీయులకు ఇప్పటికే తెలుసు కాబట్టి.. “ట్రంప్ గెలిస్తే భారతదేశానికి లాభం.. అమెరికాలో స్థిరపడ్డ భారతీయులకు మాత్రం నష్టం” అన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ విజయం భారత్‌కు వరమా లేక శాపమా అన్న విశ్లేషణ చాలా అవసరం. ముందుగా సానుకూలాంశాలను చర్చించుకుందాం.
ట్రంప్ విదేశాంగ విధానం
అమెరికా విదేశాంగ విధానంలో ట్రంప్ ఆసియా దేశాల్లో భారతదేశానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలకులు మాత్రం పాకిస్తాన్‌కు ఇతోధికంగా సహకరిస్తూ పరోక్షంగా భారతదేశానికి నష్టం కలిగిస్తూ వచ్చారు. కానీ ట్రంప్ హయాంలోనే భారత్-అమెరికా సంబంధాలు బలోపేతమయ్యాయి. ఆయన హయాంలోనే అమెరికాతో భారత్ అతి పెద్ద రక్షణ ఒప్పందం చేసుకుంది. అంతేకాదు, మూలనపడ్డ క్వాడ్ కూటమి (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్)ని పునరుద్ధరించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు. భారతదేశానికి సరిహద్దుల్లో సమస్యలు సృష్టించడంతో పాటు భారత మార్కెట్‌పై గుత్తాధిపత్యానికి ప్రయత్నాలు చేస్తున్న చైనా పట్ల ట్రంప్ అనుసరించే వైఖరి మన దేశానికి కలిసొచ్చే అంశం.
అలాగే భారతదేశానికి చిరకాల మిత్రదేశం రష్యా పట్ల ట్రంప్ వైఖరి డెమోక్రాట్ల మాదిరిగా లేదు. పైగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన తర్వాత భారత్ ఏ పక్షానికి మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని అవలంబిస్తూ రష్యాతో సత్సంబంధాలను కొనసాగించింది. ఇది పశ్చిమ దేశాలకు నచ్చలేదు. ఇప్పుటు ట్రంప్ రాకతో ప్రపంచ పరిణామాల్లో చోటుచేసుకునే మార్పులు భారత్‌కు అనుకూలంగా మారతాయని ఆశించవచ్చు. ఎందుకంటే.. ట్రంప్ కూడా భారత్ మాదిరిగానే ఉక్రెయిన్ – రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని, చర్చలతోనే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నారు.
రాజకీయ జోక్యం
భారత్‌లో ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛ గురించి అమెరికా ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటుంది. కానీ ట్రంప్ హయాంలో అలాంటి జోక్యమేదీ కనిపించలేదు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. పైగా మోదీ-ట్రంప్ మధ్య వ్యక్తిగత స్థాయిలో కూడా మంచి సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో ట్రంప్ కోసం మోదీ అమెరికాలో పరోక్షంగా ప్రచారం కూడా చేశారు. అలాగే గుజరాత్ వచ్చినప్పుడు ట్రంప్ సైతం మోదీని కొనియాడి తమ స్నేహాన్ని చాటుకున్నారు. కాబట్టి రానున్న నాలుగేళ్ల పాటు భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం, వ్యాఖ్యానాలు ఉండబోవని ఆశించవచ్చు.
ఇక భారతదేశానికి నష్టం కల్గించే అంశాలను ఓసారి పరిశీలిస్తే…
వాణిజ్యం
వాణిజ్యం విషయంలో భారత్ విధానాలను ట్రంప్ తప్పుబడుతూ వచ్చారు. భారత్ దిగుమతి చేసుకునే అమెరికా ఉత్పత్తులపై అధిక పన్నులు, సుంకాలు విధిస్తున్నామని, తద్వారా వారి వ్యాపారం సాగడం లేదన్నది ట్రంప్ మనోగతం. అదే సమయంలో భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న సేవలు, వస్తువులపై ఆ దేశం విధిస్తున్న పన్నులు, సుంకాలతో పోల్చితే.. భారత్ విధిస్తున్న పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇది వాణిజ్యంలో సమతుల్యత లేకుండా చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. నిజానికి 4 దశాబ్దాల క్రితం అమెరికా వాణిజ్యం ప్రపంచమంతా విస్తరించగా, నేడు అమెరికా మార్కెట్‌ను చైనా ఆక్రమించుకుంది. ఐటీ వంటి సేవా రంగాన్ని భారత్ ఆక్రమించుకుంది. దీంతో స్థానిక పరిశ్రమలకు వ్యాపారం లేకుండా పోయింది. స్థానిక యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. అందుకే భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 20% ఏకరూప సుంకం విధించాలని, చైనా నుంచి వచ్చే వస్తువులపై 60% సుంకం విధించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే భారత జీడీపీ స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది. కొందరు ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2028 నాటికి భారత జీడీపీ 0.1% మేర కుదించుకుపోవచ్చు.
ఇమ్మిగ్రేషన్
ఇది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అంశం. అమెరికాలో లక్షల సంఖ్యలో భారతీయులు వర్క్ వీసాపై పనిచేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా వారిలో దక్షిణాది రాష్ట్రాలవారు, అందులోనూ తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అధిక సంఖ్యాకులు. భారత్ సహా ఆసియా దేశాల వచ్చేవారు అధిక జీతాలు పొందే ఉద్యోగాలు తన్నుకుపోతున్నారని, కింది స్థాయి ఉద్యోగాలను మెక్సికన్, లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ దేశాలవారు తన్నుకుపోతున్నారని అమెరికా సమాజం భావిస్తోంది. దీంతో స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దేశ జనాభాలో 60% వరకు ఉన్న స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై నెలకొన్న అసహనమే ట్రంప్ విజయానికి కారణమైందని కూడా అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ గతంలోనూ H1-B వీసాల జారీ విషయంలో అనేక సరికొత్త ఆంక్షలు తీసుకొచ్చి కఠినతరం చేశారు. అమెరికా వికాసానికి HI-B ఒక ముప్పుగా మారిందని కూడా వ్యాఖ్యానించారు. అయితే గతంతో పోల్చితే భారతీయ వృత్తి నిపుణుల విషయంలో ఆయన కొంత సానుకూల వైఖరి కనబరుస్తున్నారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం కోసం ఇచ్చేవి) మంజూరు చేస్తారని ఆశిస్తున్నారు.
అయితే ట్రంప్ నిలకడ లేని వ్యక్తిగా కూడా పేరొందారు. మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియాతోనూ పేచీకి దిగిన సందర్భాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ తమ దేశ వలస చట్టాలు, విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారోనన్న ఆందోళన అక్కడున్న భారతీయులతో పాటు ఆ దేశానికి వెళ్లి స్థిరపడాలని కోరుకుంటున్న భారతీయుల్లో నెలకొంది.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి