ఆటబొమ్మల్లా విరిగిపోతున్న ఘాట్‌రోడ్లు! పేకమేడల్లా కూలుతున్న భవనాలు..!
ఢిల్లీని వరద ముంచెత్తితే అది బ్రేకింగ్ న్యూసే. కాని, ఎడారి రాష్ట్రాల్లోనూ మోకాలి లోతు వరదలు ముంచెత్తితే? అది బ్లాస్టింగ్ న్యూస్. ఇక పంజాబ్‌లో అయితే ఒక్కరోజులోనే 1,272 శాతం అధిక వర్షపాతం రికార్డ్ అయింది. ఏ సీజన్‌లోనూ చూడని ప్రకృతి వైపరీత్యం ఈ సీజన్‌లోనే కనిపించింది. హిమాలయన్ స్టేట్స్‌తో పాటు ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనూ వర్షబీభత్సం కొనసాగుతోంది.

జడివాననే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇది అలజడివాన.. ఎన్నో వరదలు చూసుంటాం.. ఇవి అసాధారణం. ఉన్నవే విరిగిపడడానికి అన్నట్టుగా మీదపడిపోతున్న కొండచరియలు. ఇక్కడా.. వరదా..! అని అనుకున్న చోట కూడా ఫ్లాష్ ఫ్లడ్స్. ఇలా.. విరుచుకుపడడానికి ఎన్ని రకాలున్నాయో అన్నిటినీ ప్రయోగిస్తోంది ప్రకృతి. ఉత్తర భారతావనిలో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్.. ఈ రాష్ట్రాల్లో ఎక్కడ అడుగు పెట్టాలనుకున్నా ముంచేసే వరదలే ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే.. ఉత్తరాదికి వెళ్తే చాలు. ఇంతటి జలవిలయానికి మరో కారణం.. పాకిస్తాన్-చైనాలో భయానకంగా మారిన వాతావరణం. అదొక డిఫరెంట్ కేసు. అసలు.. పక్క దేశాల్లో మారిన వాతావరణం మనదేశంలో ఇంపాక్ట్ చూపడటేంటి? పుష్కరకాలంగా లేని అసాధారణ వాతావరణ పరిస్థితులు ఇప్పుడే ఉత్తర భారతాన్ని కమ్మేయడమేంటి? వీటన్నింటి గురించి డిటైల్డ్‌గా చెప్పుకుందాం..! ఇప్పుడు దంచికొట్టిన వానలకే నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు కట్టలు తెంచుకున్నాయి. నీటి చుక్క పారే ప్రతి జలమార్గం ఆల్రడీ కెపాసిటీని మించి ప్రవహిస్తోంది. వేరే దారి లేక.. ఊళ్ల మీదకి, పట్టణాలపైకి విరుచుకుపడుతోంది. అడ్డొచ్చిన ప్రతీ కాంక్రీట్ కట్టడాన్ని కూల్చేస్తూ పరుగులు పెడుతోంది వరద. ఇదే గరిష్టస్థాయి, ఇక వరద తగ్గినట్టే అనుకుంటుండగానే అంతకు మించిన వరద తన్నుకొస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న భీతావహ పరిస్థితి ఇది. ఎందుకని ఈ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి? ఎంత వర్షాకాలం అయితే మాత్రం మరీ రేంజ్‌లో దంచికొట్టడమా?...




