Rahul Gandhi: తెలంగాణ వైపు రాహుల్ గాంధీ చూపు.. కర్ణాటక వద్దంటున్న కాంగ్రెస్ అగ్రనేత.. ఆ రెండు సీట్లలో..

|

Mar 06, 2024 | 1:21 PM

లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.. ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. వరుసగా మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకువెళ్తోంది.. రామమందిర ప్రారంభోత్సవం అనంతరం బీజేపీకి అంతటా అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్, పలు పార్టీల నుంచి పలువురు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Rahul Gandhi: తెలంగాణ వైపు రాహుల్ గాంధీ చూపు.. కర్ణాటక వద్దంటున్న కాంగ్రెస్ అగ్రనేత.. ఆ రెండు సీట్లలో..
Revanth Reddy Rahul Gandhi
Follow us on

లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.. ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. వరుసగా మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకువెళ్తోంది.. రామమందిర ప్రారంభోత్సవం అనంతరం బీజేపీకి అంతటా అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్, పలు పార్టీల నుంచి పలువురు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కమల్‌నాథ్.. లాంటి అగ్రనేతలు కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి వెళ్తారన్న ఊహగానాలు కూడా మొదలయ్యాయి. ఈ తరుణంలో ఇండియా కూటమి కూడా బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నాహాలను ప్రారంభించింది.. ఒకప్పుడు టికెట్లు ఇచ్చిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. ఇప్పుడు తీసుకునే స్థాయికి చేరింది. దీనికి నిదర్శనం ఇటీవల ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో జరిగిన చర్చలే.. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో చర్చల అనంతరం 80స్థానాల్లో 17 స్థానాలే ఇచ్చేందుకు ఆయన సుముఖత వ్యక్తంచేశారు.. మిగతా 63 స్థానాల్లో ఎస్పీ పోటీచేయనుంది.
ఇక ఢిల్లీలో కూడా ఆప్ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీకి అంగీకరించాయి. గుజరాత్, హర్యానా, గోవాలో కూడా పోటీచేసే సీట్లపై క్లారిటీ వచ్చింది. అయితే, ఒక్క పశ్చిమ బెంగాల్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది.. అసలు కాంగ్రెస్ కు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సీట్లు ఇచ్చేందుకు నిరాకరించారు.. అంతేకాకుండా.. పొత్తు ఉండదంటూ కూడా ప్రకటించారు..

షాకిచ్చిన కమ్యూనిస్టులు..

2019లో జరిగిన లోక సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో.. స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.. రెండో చోట వయనాడ్ పోటీచేసిన రాహుల్ గాంధీ గెలిచారు.. వాస్తవానికి అమేథీలో రాహుల్ ఓడిపోవడం సంచలనమే.. ఎందుకంటే.. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది.. దీంతో ఈ సారి రాహుల్ అమేథి నుంచి పోటీచేస్తారా..? లేక వాయనాడ్ నుంచే పోటీచేస్తారా..? అన్న సందిగ్దంలో మరో కమ్యూనిస్టులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు.. ఇండియా కూటమిలో కొనసాగుతున్న కమ్యూనిస్టులు (ఎల్డీఎఫ్) ఈసారి వయనాడ్ సీటును రాహుల్ గాంధీకి ఇచ్చేది లేదంటూ ప్రకటించారు.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి యాని రాజా వాయనాడ్ నుంచి పోటీకి దింపుతున్నట్లు ఎల్‌డిఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కేరళలో అధికార కూటమి) ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ (కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) కేరళలో రెండు ప్రధాన రాజకీయ కూటములు.. ఈ క్రమంలో కమ్యూనిస్టుల మధ్య సయోధ్య కుదరకపోతే.. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో రాహుల్ గాంధీ.. కర్ణాటక లేదా తెలంగాణ నుంచి పోటీచేయవచ్చని జాతీయ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.. అయితే, రాహుల్ కు కర్ణాటక కంటే.. తెలంగాణానే బెస్ట్ ప్లేస్ అని నాయకత్వం అభిప్రాయపడుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కర్ణాటకలో పరిస్థితి మరోలా..

అయితే, కర్ణాటక, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిస్థాయి మెజార్టీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అక్కడ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లను సీఎం, డిప్యూటీ సీఎంలుగా నియమించింది.. తెలంగాణలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కను సీఎం, డిప్యూటీ సీఎంలుగా నియమించింది. ముఖ్యంగా కర్ణాటకలో పార్టీలో విబేధాలు తారాస్థాయికి చేరడం, సఖ్యత లేకపోవడం వల్ల రాహుల్ గాంధీ అక్కడినుంచి పోటీచేయరని.. అందుకే ఆయన తెలంగాణ వైపు చూస్తున్నారని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి రాహుల్ గాంధీ పోటీచేస్తే.. గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని.. అందుకే తెలంగాణ నుంచి పోటీచేయాలని నాయకత్వం కోరుతోంది. అదికాకుండా.. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ మేనియా కొనసాగుతుండటం కూడా ప్లస్ గా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు తర్వాత..

అయితే, దేశంలోని పలు రాష్ట్రాల్లో చాలామంది నేతలు బీజేపీ వైపు చూస్తుంటే.. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు.. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలు.. ఆరు గ్యారెంటీల అమలు, ప్రాధాన్యం ఇవన్నీ కూడా పార్టీకి కలిసి వచ్చాయి. అంతేకాకుండా.. పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా సోనియా గాంధీ, లేదా రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీచేయాలని ఇప్పటికే తీర్మానం చేశాయి.. ఈ క్రమంలో సోనియాగాంధీ అనూహ్యంగా ప్రత్యేక్ష ఎన్నికల నుంచి తప్పుకుని.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, ప్రియాంక గాంధీ అయినా పోటీచేయాలని టీ కాంగ్రెస్ కోరింది. అయితే ఆమె సోనియాగాంధీ సీట్ రాయ్‌బరేలీ నుంచి పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ అయినా.. తెలంగాణ నుంచి పోటీచేయాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు.

తెలంగాణ ఎందుకు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గత నెలలో సోనియా గాంధీని కలిసి ఖమ్మం నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు. ఖమ్మం లోక్ సభ ప్రాంతం నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండటంతో.. అక్కడ కాంగ్రెస్ కు తిరుగులేదని తెలిపారు. అయితే, సోనియా గాంధీ, ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఈ ఆఫర్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి సున్నితంగా తిరస్కరించడం.. ప్రియాంక గాంధీ సుముఖంగా లేకపోవడంతో.. రాహుల్ గాంధీ పోటీచేయాలని కోరుతున్నారు. ప్రధానంగా.. ఖమ్మం లేదా భువనగిరి నుండి బరిలోకి దింపాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది.. ఇక్కడైతే తిరుగులేదని ఇప్పటికే నివేదికలు అందించారు.

రాహుల్ గాంధీ నిర్ణయంపై ఉత్కంఠ..

అయితే, రాహుల్ ఎక్కడినుంచి పోటీచేస్తారన్న దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు రాహుల్ గాంధీ మాత్రం పోటీచేస్తే స్థానంపై క్లారిటీ ఇవ్వలేదు.. నార్త్ నుంచి పోటీచేస్తారా..? లేదా సౌత్ నుంచి పోటీచేస్తారా..? లేదా.. గతంలో లాగా రెండు చోట్ల నుంచి పోటీచేస్తారా..? రాహుల్ గాంధీ నిర్ణయం ఎలా ఉంటుంది..? అనే విషయాలు తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..