నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు.. ఈ చేదు నిజాలు తెలుసుకోండి..

మనం నిర్మించుకుంటున్న నగరాలు మనల్ని నిలువునా దహించేసే ఓవెన్‌లా తయారవుతున్నాయా? తాజా పర్యావరణ అధ్యయనాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. నగరాలు వేడెక్కిపోవడానికి వాతావరణ మార్పులు కేవలం 40 శాతం కారణమైతే.. మిగిలిన 60 శాతం మనం పెంచుకుంటూ పోతున్న కాంక్రీట్ అడవులేనని నేచర్ సిటీస్ నివేదిక హెచ్చరిస్తోంది.

నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు.. ఈ చేదు నిజాలు తెలుసుకోండి..
Why Indian Cities Are Getting Hotter

Updated on: Jul 06, 2026 | 1:19 PM

మధ్యాహ్నం పూట మన దేశంలోని ఏదైనా నగరంలో రోడ్డు మీద నడిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మంట కేవలం సూర్యుడి నుంచి మాత్రమే రావడం లేదు.. మనం నడుస్తున్న రోడ్డు నుంచి సెగలు పుడుతుంటాయి, కాంక్రీట్ గోడల నుంచి వేడి సెగలు తాకుతుంటాయి. గ్లాస్ బిల్డింగుల నుంచి ఎండ తీవ్రత రెట్టింపు అవుతుంది. చివరికి సూర్యుడు అస్తమించినా ఆ వేడి నగరాలను వదిలిపెట్టదు. దీనినే శాస్త్రవేత్తలు అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న మాట నిజమే అయినప్పటికీ, మన నగరాలు వేడెక్కడానికి మన చేతులారా చేసుకుంటున్న తప్పులే 60 శాతం కారణమని నేచర్ సిటీస్ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.

నగరాలు ఎందుకు ఓవెన్‌లా మారుతున్నాయి?

పచ్చని ప్రకృతిని కనుమరుగు చేసి.. వాటి స్థానంలో కాంక్రీట్ బిల్డింగులు, తారు రోడ్లు, స్టీల్, గ్లాస్ కట్టడాలను నిర్మించడమే దీనికి ప్రధాన కారణం. ఈ సిమెంట్, తారు ఉపరితలాలు పగటిపూట సూర్యుడి నుంచి వచ్చే వేడిని భారీగా పీల్చుకుంటాయి. రాత్రి వేళల్లో ఆ వేడిని నెమ్మదిగా వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దీనివల్ల రాత్రిళ్ళు కూడా నగరాలు చల్లబడటం లేదు. ఇళ్లను చల్లబరుచుకోవడానికి మనం వాడే లక్షలాది ఎయిర్ కండిషనర్లు (ACs) లోపలి వేడిని బయటకు నెట్టేయడం వల్ల నగరాల బాహ్య ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రకారం.. నగరాలు ప్రపంచ సగటు కంటే రెట్టింపు వేగంతో వేడెక్కుతున్నాయి. 2050 నాటికి దాదాపు 1.6 బిలియన్ల మంది పట్టణ ప్రజలు ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల బారిన పడే ప్రమాదం ఉంది.

గ్లాస్ బిల్డింగులు

ఈ రోజుల్లో నగరాల్లో పెద్ద పెద్ద గ్లాస్ భవనాలు నిర్మించడం ఒక ట్రెండ్‌గా మారింది. చల్లటి పాశ్చాత్య దేశాలకు సరిపోయే ఈ ఆర్కిటెక్చర్, భారతదేశం లాంటి ఉష్ణమండల దేశాలకు అస్సలు సెట్ అవ్వదని నిపుణులు చెబుతున్నారు. ఈ అద్దాల భవనాలు సూర్యరశ్మిని లోపలికి లాక్కోవడం వల్ల ఏసీల వాడకం విపరీతంగా పెరుగుతోంది. సాధారణ ప్రాంతాల కంటే ఇలాంటి కమర్షియల్ జోన్లు 5 నుండి 10 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ వేడిగా ఉంటున్నాయి.

పరిష్కారం ఏంటి? కూల్ సిటీస్ వైపు అడుగులు..

ఈ గండం నుంచి నగరాలను కాపాడుకోవాలంటే భవన నిర్మాణ శైలి మారాలని రియల్ ఎస్టేట్, పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు:

పాసివ్ కూలింగ్ : సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా ఇళ్లను డిజైన్ చేయడం. దీనివల్ల ఏసీల అవసరం లేకుండానే ఇంటి ఉష్ణోగ్రత 3 డిగ్రీల వరకు తగ్గుతుంది, కరెంట్ బిల్లు 35 శాతం ఆదా అవుతుంది.

కూల్ రూఫ్స్ – గ్రీన్ రూఫ్స్: మిద్దెలపై తెల్లటి రిఫ్లెక్టివ్ పెయింట్లు వేయడం లేదా టెర్రస్ గార్డెన్స్ పెంచడం.

మియావాకీ అడవులు: నగరాల్లో ఖాళీగా ఉన్న చిన్న చిన్న స్థలాల్లో దట్టమైన స్థానిక అడవులను పెంచడం. ఇవి చుట్టుపక్కల ప్రాంతాలను 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరుస్తాయి.

ఇంకుడు రోడ్లు: నీటిని భూమిలోకి ఇంకేలా చేసే రోడ్ల వల్ల భూగర్భ జలాలు పెరగడమే కాకుండా రోడ్ల వేడి తగ్గుతుంది.

పచ్చదనం అంటే కేవలం అందం కోసం కాదు.. అది మన మనుగడకు అవసరమైన మౌలిక సదుపాయం. రాబోయే రోజుల్లో భారత్‌లో రాబోయే హీట్‌వేవ్స్ కేవలం గ్లోబల్ వార్మింగ్ వల్ల మాత్రమే కాదు.. మనం నగరాలను ఎలా నిర్మిస్తున్నాం అనేదానిపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పటికైనా పర్యావరణ అనుకూల నగరాల వైపు అడుగులు వేయకపోతే, భవిష్యత్తులో మన నగరాలు నిప్పుల కొలిమిలుగా మారడం ఖాయం.

Follow Us