Who is Bhole Baba: జైలుకెళ్లొచ్చిన ఓ కానిస్టేబుల్.. ‘భోలే బాబా’గా ఎలా అవతరించాడంటే? సినిమా స్టోరీకి మించిన ట్విస్టులు

|

Jul 03, 2024 | 6:59 PM

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్ జిల్లా సికంద్రారావు పట్టణానికి సమీపంలో నిర్వహించిన సత్సంగ్ (ఆధ్యాత్మిక కార్యక్రమం)లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 120 దాటింది. మహిళలు, పిల్లలతో సహా వందలాది మంది ప్రాణాలు క్షణాల్లో గాల్లోకలిసిపోయాయి. ఎటు చూసినా చెల్లా చెదురుగా పడిపోయిన మృతదేహాలతో భయానక వాతావరణం తలపించింది. ఘటన అనంతరం భోలేబాబా పరారవడం..

Who is Bhole Baba: జైలుకెళ్లొచ్చిన ఓ కానిస్టేబుల్.. భోలే బాబాగా ఎలా అవతరించాడంటే? సినిమా స్టోరీకి మించిన ట్విస్టులు
Who Is Bhole Baba
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్ జిల్లా సికంద్రారావు పట్టణానికి సమీపంలో నిర్వహించిన సత్సంగ్ (ఆధ్యాత్మిక కార్యక్రమం)లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 120 దాటింది. మహిళలు, పిల్లలతో సహా వందలాది మంది ప్రాణాలు క్షణాల్లో గాల్లోకలిసిపోయాయి. ఎటు చూసినా చెల్లా చెదురుగా పడిపోయిన మృతదేహాలతో భయానక వాతావరణం తలపించింది. ఘటన అనంతరం భోలేబాబా పరారవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలో అసలెవరీ భోలేబాబా అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు. సినిమా స్టోరీని తలపించేలా ఉన్న బోలే బాబా యవ్వారం విన్న ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఎవరీ భోలే బాబా?

సరిగ్గా 28 ఏళ్ల క్రితం వేధింపుల కేసులో యూపీ పోలీసు శాఖలో లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎల్ఐయూ)లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సూరజ్‌పాల్ జాతవ్ సస్పెండ్ అయ్యాడు. వేధింపుల కేసులో ఆరోపణలు రావడంతో 28 ఏళ్ల కిందట ఆయన సస్పెండ్ అయ్యాడు. తర్వాత సర్వీస్ నుంచి డిస్మిస్ కూడా చేశారు. ఈ కేసులో అతడు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అతని స్వస్థలం కస్గంజ్ జిల్లాలోని పాటియాలీ ప్రాంతంలోని బహదూర్ నగరి అనే గ్రామం. జైలు నుంచి విడుదలైన సూరజ్‌పాల్.. పోలీసు సేవల నుంచి డిస్మిస్ కావడంతో కోర్టును ఆశ్రయించగా మళ్లీ ఉద్యోగం వచ్చింది. కానీ 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నాడు. ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మిక చింతనలో కాలం గడిపాడు. పదవీ విరమణ తర్వాత స్వగ్రామం నాగ్లా బహదూర్‌పూర్ చేరుకుని అక్కడే తన డ్రామాకు తెర లేపాడు. తాను భగవంతుడితో మాట్లాడతానని తన గ్రామ ప్రజలకు చెప్పడం మొదలు పెట్టారు. తనకు తాను భోలే బాబాగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. అతడి మాయమాటలు నమ్మిన ప్రజలు తండోపతండాలుగా కదలివచ్చేవారు. చూస్తుండగానే అతడికి లక్షలాది భక్తులు పుట్టుకొచ్చారు. అలా అనూహ్యంగా కొంతకాలానికే భోలే బాబా నారాయణ్ సాకార్ హరిగా అవతరించాడు. ఇతగాడి ప్రవచనాలకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి ఇతర రాష్ట్రాలలో కూడా పిచ్చ ఫాలోయింగ్ ఉంది. కొద్దికాలంలోనే ఆయనకు పెద్ద సంఖ్యలో అనుచరులు పుట్టుకొచ్చారు. ఎక్కడ సమావేశం నిర్వహించినా వేలసంఖ్యలో ప్రజలు వచ్చేవారు.

Bhole Baba

కానిస్టేబుల్ కొలువు వదిలేసి బాబాగా అవతరణ

ప్రతి మంగళవారం వివిధ ప్రాంతాల్లో ‘సత్సంగ్‌’ పేరటి పెద్దపెద్ద మతపర సభావేశాలు నిర్వహించేవాడు. ఇటీవల హత్రాస్లో జరిగిన సంఘటనకు సరిగ్గా వారం ముందు మెయిన్‌పురి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించాడు. కరోనా మహహ్మారి టైంలో 2022లో భోలే బాబా సమావేశాలకు కేవలం 50 మందిని మాత్రమే హాజరయ్యేలా ప్రభుత్వం అనుమతి ఇస్తే.. ఏకంగా 50 వేల మంది హాజరుకావడంతో అప్పట్లోనే పెద్ద వివాదానికి దారి తీసింది. సూరజ్‌పాల్ అలియాస్ భోలే బాబాకు ముగ్గురు సోదరులలో ఒకరని, అందరిలో పెద్దవాడు. సూరజ్ పాల్ రెండో సోదరుడు మరణించగా, మూడో సోదరుడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పని చేస్తున్నాడు. భోలే బాబా చాలా అరుదుగా తన ఊరు వెళ్తుంటాడు. సర్కార్ కొలువు వదిలేసి తాను ఇక్కడి దాకా ఎలా ఎదిగాడో తనకే తెలియదని సత్సంగ్‌లలో అనేకమార్లు చెప్పుకునేవాడు.

ఇవి కూడా చదవండి

హత్రాస్‌ ఘటన తర్వాత పరార్‌..

తాజా ఘటనలో నారాయణ్ సాకార్ హరి పేరుతో హత్రాస్‌లో ఈ కార్యక్రమం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హాథ్‌రస్ వీధుల్లో అన్ని ఇతగాడి పోస్టర్లే పెద్ద ఎత్తున పెట్టారు. నారాయణ్ సాకార్‌ను ప్రజలు భోలే బాబా, విశ్వహరి అనే పేర్లతో పిలిచేవారు. జూలై నెల తొలి మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ‘మానవ్ మంగళ్ మిలన్’ పేరుతో నిర్వహించారు. ‘మానవ్ మంగళ్ మిలన్ సద్భావన సమాగమ్ సమితి’ అనే పేరుతో మొత్తం ఆరుగురి పేర్లు ఉన్నాయి. వీరితోపాటు బోలేబాబా కూడా పరారయ్యాడు. ప్రస్తుతం వారందరి మొబైల్ ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో స్థానిక పోలీసులు వారిని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు. వీరి కోసం యూపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు ఇంతటి మారణహోమానికి కారణమైన సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీపై, బోలే బాబాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అలీగఢ్ ఐజీ శలభ్ మాథుర్ చెప్పారు.

ఎక్కడా విరాళాలు సేకరించలేదు..

బోలే బాబాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అతను ఇప్పటి వరకు భక్తుల నుంచి ఎలాంటి విరాళాలు, దక్షిణలు, కానుకలను తీసుకోలేదు. కానీ, ఉత్తరాదిలో అనేక ఆశ్రమాలను ఎలా స్థాపించాడు అనే విషయం ఎవరికీ బోధపడకుంది. ఉత్తరప్రదేశ్‌లోనే వేరువేరు ప్రాంతాల్లో సొంత స్థలాల్లో ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రాలలోనే భక్తులకు కనిపించేవాడు. పైజామా కుర్తా, ప్యాంట్ -షర్ట్, సూట్‌లలో ఎక్కువగా కనిపిస్తాడు. ఇంతటి ఫాలోయింగ్‌ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోగానీ, ఇంటర్నెట్‌లో గానీ ఇతని గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడం మరో విచిత్రం. క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనకు లక్షలాది భక్తులున్నారు. అతను నిర్వహించే కార్యక్రమాల్లో వందలమంది వలంటీర్లు ఉంటారు. వీరు భక్తులకు ఉచితంగా నీళ్లు, ఆహారం పంచడం నుంచి రద్దీని నియంత్రించేంత వరకు అన్నీ వారే చూసుకుంటూ ఉంటారు. బోలేబాబా భక్తుల్లో సమాజ్‌వాద్ పార్టీ నేత అన్వర్ సింగ్ జాతవ్ కూడా ఒకరు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.