
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఏప్రిల్ 23 నుంచి రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. బ్రిజ్ భూషన్‌ను అరెస్టు చేయాలని.. తన పదవిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తాను అమాయకుడినంటూ ఆయన సమాధానం ఇవ్వడం తీవ్ర దుమారం రేపింది. ఆదివారం రోజున రైతులు కూడా తమ మద్దతు తెలిపేందుకు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై చేస్తున్న లైంగిక వేధింపు ఆరోపణల్లో ఒక్కటైనా నిజమని రుజువైతే ఉరి వేసుకుంటానని తెలిపారు.
ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నందువల్ల అన్ని విషయాల గురించి బహిరంగంగా మాట్లాడలేనని తెలిపారు. లైంగిక వేధింపు ఆరోపణలపై ఆధారాలు ఉంటే సమర్పించాలని రెజ్లర్లకు సవాలు చేశారు. ఇదిలా ఉండగా తమకు న్యాయం జరిగేవరకు నిరసనలు కొనసాగిస్తామని రెజ్లర్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.