
ఇండోర్, మార్చి 24: పాపిటలో సింధూరం (బొట్టు) పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత అని, అది పెట్టుకుంటే ఆమె వివాహితగా తెలుస్తుందని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఫ్యామిలీ కోర్టు వ్యాఖ్యానించింది. ఇండోర్‌కు చెందిన జంటకు 2017లో వివాహం జరిగింది. వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఐదేళ్ల క్రితం తన భార్య తనను వదిలి వెళ్లిందని, ఆమె మళ్లీ తన ఇంటికి తిరిగి వచ్చి, హిందూ వివాహ చట్టం ప్రకారం తన భార్య తనతో కలిసి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని భర్త కోర్టుకు ఎక్కాడు.
ఈ మేరకు ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో అతను పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎన్‌పీ సింగ్ తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టు విచారణ సమయంలో హాజరైన బాధితుడి భార్య తాను సింధూరం ధరించడం లేదనే విషయం కోర్టుకు తెలిపింది.
సింధూరం పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత. ఇది మహిళకు వివాహం అయిన విషయాన్ని నిర్ధారిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. మహిళ స్టేట్‌మెంట్ విన్న తర్వాత భర్త ఆమెను విడిచిపెట్టలేదని, ఆమే భర్తను విడిచిపెట్టి, విడాకులు కోరుతున్నట్లు స్పష్టమైంది. ఆమె తన భర్త కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించి సరైన ఆధారాలు లభ్యం కాలేదు. భర్త తనను వేధిస్తున్నట్లు పోలీసులకు ఆమె ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇరు వైపుల వాదనలు విన్న తర్వాత.. ఆమే తన భర్తను విడిచిపెట్టింది. అందుకే సింధూర్ ధరించలేదని కోర్టు పేర్కొంది. హిందూ ఆచారం ప్రకారం సింధూర్ ధరించడం మహిళ విధి. అది ఆమె వివాహం చేసుకున్నట్లు సూచిస్తుంది. మహిళ వెంటనే తన భర్త ఇంటికి తిరిగి వెళ్లాలని తీర్పు సందర్భంగా పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.