
బెళగావి, ఏప్రిల్ 28: కర్నాటక సీఎం సిద్ధరామయ్య పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 28) బెళగావిలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందరూ చూస్తుండగా అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ (ASP)ను చెంపదెబ్బ కొట్టబోయారు. ఓ పోలీస్ ఉన్నతాధికారిని పబ్లిక్ ముందు చేయెత్తి కొట్టేందుకు యత్నించిన సీఎం సిద్ధరామయ్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ASP నారాయణ్ భరమణిని వేదికపైకి పిలిపించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోపంగా ఆయనపై చేయి చేసుకునేందుకు చేయి లేపడం వీడియోలో కనిపిస్తుంది. సిద్ధరామయ్య ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న వేదిక దగ్గర జరిగిన గందరగోళం కారణంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మీటింగ్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే బీజేపీ మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య వేదిక వద్ద భద్రతను నిర్వహించడానికి ASP భరమణిని నియమించారు. అయితే అక్కడి పరిస్థితిని చక్కదిద్దడంలో అసంతృప్తి చెందిన సిద్ధరామయ్య భరమణిని వేదికపైకి పిలిచి..’ఇక్కడికి రా.. నువ్వు ఏం చేస్తున్నావ్?’ అంటూ బహిరంగంగా మందలించారు. కోపావేశంలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీస్ అధికారిని కొట్టేందుకు చేయి పైకెత్తారు. కానీ మళ్లీ ఆగిపోయారు.
,@siddaramaiah ನಿಮಗೆ ಅಧಿಕಾರದ ದರ್ಪ ತಲೆಗೇರಿದೆ.
ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್ ವರಿಷ್ಠಾಧಿಕಾರಿಗೆ ಹೊಡೆಯಲು ಕೈ ಎತ್ತುವುದು ನಿಮ್ಮ ಸ್ಥಾನಕ್ಕೆ, ಘನತೆಗೆ ಕಿಂಚಿತ್ತೂ ಶೋಭೆ ತರುವುದಿಲ್ಲ.
ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಥಾನದಲ್ಲಿರುವ ನೀವು, ಬೀದಿ ರೌಡಿಯಂತೆ ಸಾರ್ವಜನಿಕ ವೇದಿಕೆಯಲ್ಲಿಯೇ ಏಕವಚನ ಪ್ರಯೋಗಿಸಿ, ಎಸ್ಪಿ (SP)ಗೆ ಹೊಡೆಯಲು ಯತ್ನಿಸಿದ್ದು ಅಕ್ಷಮ್ಯ… pic.twitter.com/GXeZbtk73t
— Janata Dal Secular (@JanataDal_S) April 28, 2025
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మళ్లీ సిద్ధరామయ్య వివాదంలో ఇరుక్కున్నారు. దీనిపై ప్రతి పక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య చర్యను జనతాదళ్ (సెక్యులర్) ఖండించింది. ఓ ప్రభుత్వ అధికారిపై చేయి ఎత్తి, ఆయనను కించపరిచే స్వరంతో సంబోధించడం క్షమించరాని నేరమని జేడీఎస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లేనని, ప్రభుత్వ అధికారి దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని దుయ్యబట్టింది. అహంకారం, చేతి దురుసుతనం తగదని సూచించింది. మరోవైపు.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై ఆయన వ్యాఖ్యానిస్తూ.. పాక్‌తో యుద్ధం అవసరం లేదని పేర్కొన్నారు. సైనిక చర్య కంటే దౌత్య, భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉగ్రదాడిలో రక్తం మరిగిపోతున్న తరుణంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారితీసింది. అయితే యుద్ధం చివరి ఛాయిస్ మాత్రమేనని, శాంతి, అంతర్గత భద్రత దృష్ట్యా తాను ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.