తమ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేయించదలిచామని, ఇందుకు సాయపడాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ రాస్తూ..తగినన్ని కోవిడ్ వ్యాక్సిన్లను తమ రాష్ట్రంప్రొక్యూర్ చేసుకునేలా చూడాలని అభ్యర్థించారు. ‘ఎన్నికల ముందే మొత్తం రాష్ట్ర మంతా వ్యాక్సినేషన్ చేయించుకోవాలనుకుంటున్నాం.. అది కూడా ఉచితంగా.. దీనికోసం తగినన్ని టీకామందులను తెప్పించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది..ఈ విషయంలో మీరు మాకు సహకరించి సాయపడాలి’ అని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతా ప్రాతిపదికపై నిర్దేశిత పాయింట్ల నుంచి టీకామందులను కొనుగోలు చేయగలుగుతుందని మమతా బెనర్జీ తెలిపారు.
మా సర్కార్ ఇప్పటికే చాలా త్వరగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని, హెల్త్ కేర్ వర్కర్లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ చేయించడం జరిగిందని ఆమె అన్నారు. ఎన్నికలు సేఫ్ గా జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అందరికీ వర్తింపజేయాల్సి ఉందని, అప్పుడే టీకామందులు తీసుకున్నవారంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లగలుగుతారని మమత అన్నారు. ముఖ్యంగా ఫ్రీ వ్యాక్సినేషన్ అన్న పదాన్ని ఆమె పదేపదే ప్రస్తావించారు.
బెంగాల్ లో తాజాగా 182 కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య 5,73,762 కి చేరింది. 10,249 మంది మృత్యువాత పడ్డారు. పాజిటివిటీ నిష్పత్తి 6.8 శాతం ఉంది. కాగా-అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ చేపట్టాలన్న సీఎం మమతా బెనర్జీ ‘ఎన్నికల ఎత్తుగడ’ కావచ్ఛునన్న విమర్శలు వినవస్తున్నాయి. తద్వారా ఆమె రాజకీయ లబ్ది పొందజూస్తున్నారని అంటున్నారు. అయితే ఆమె రాసిన లేఖపై ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతల స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
Also Read:
అలెక్సీ నావెల్నీ కేసులో రష్యాపై ఆంక్షల విధింపునకు యోచిస్తున్న జోబైడెన్ ప్రభుత్వం