Vice president election 2022: భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే తరపు అభ్యర్థి ఎంపికపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జులై 19తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించి కీలక ప్రకటన చేసే అవకాశమునట్టు సమాచారం. కాగా.. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల ప్రచారాన్ని ఎన్డీయే, విపక్షాలు ముమ్మరంగా నిర్వహించాయి. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ద్రౌపది ముర్ము ఎన్‌డిఎ అభ్యర్థిగా ఉండగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఉన్నారు. సోమవారం ఎన్నిక జరగనుంది. కాగా.. భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6న ఓటింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూలై 5న ప్రారంభం కాగా, జూలై 19తో ముగియనుంది.
ప్రతిష్టాత్మకమైన ఉప రాష్ట్రపతి పదవి కోసం పలువురు సీనియర్ నేతలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, నజ్మా హెప్తుల్లా ప్రధానంగా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు సిక్కునేతలు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో అధికార కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఎన్డీయే అభ్యర్థి విజయం ఖాయమైనట్లు పేర్కొంటున్నారు. బీజేపీ పేరును ఖరారు చేసిన తర్వాత, ఏకాభిప్రాయం కోసం ప్రతిపక్ష పార్టీలు, మిత్రపక్షాలను సంప్రదించే అవకాశం ఉంది.
ప్రతిపక్ష పార్టీలు కూడా ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఆదివారం సమావేశం కానున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు జూలై 17న సమావేశం కానున్నట్లు కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఈ సమావేశానికి విపక్ష నేతలందరూ హాజరవుతారన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ సమావేశం అనంతరం భేటీ కానున్నారు.
భారత 16వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఓటింగ్ ప్రక్రియ ఆగస్టు 6న జరగనుంది. అదేరోజు ఫలితాలు వెలువడుతాయి. ప్రస్తుత ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. 11న కొత్త ఉప రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి