పంజాబ్‌లో పాతమిత్రులు ఒక్కటయ్యారు.. విభేదాలు పక్కనబెట్టి సీఎంతో సిద్ధూ భేటీ.. కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్..!
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పంజాబ్‌లో రాజకీయాలు పుంజుకున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు.
Sidhu meet Amarinder singh : అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పంజాబ్‌లో రాజకీయాలు పుంజుకున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవలె రాజకీయ చతురుడు ప్రశాంత్ కిశోర్‌ను సలహాదారుడిగా నియమించుకున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూకు చేరువయ్యారు. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో విభేదాలు కారణంగా దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉన్న మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ దగ్గరయ్యారు. తాజాగా సిద్ధూ తిరిగి రాష్ట్ర కేబినెట్‌లో చేరుతారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే విషయమై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం సూచనప్రాయంగా వెల్లడించారు. సిద్ధూ కేబినెట్‌లో తిరిగి చేరుతారనే ప్రచారం జోరందుకున్న వేళ.. అమరీందర్‌తో ఆయన సమావేశం కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రి ఆయన ఫామ్‌హౌస్‌లో అమరీందర్, సిద్ధూ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో చేరే అంశంపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. తమ బృందంలో సిద్ధూ చేరాలని అందరూ కోరుకుంటున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు. అమరీందర్, సిద్ధూ 40 నిమిషాల పాటు సమావేశం జరగ్గా.. మాజీ క్రికెటర్ కేబినెట్‌లోకి చేరుతారనే చర్చ జోరుగా సాగుతోంది. మా భేటీ స్నేహపూర్వకంగా సాగిందని, తనతో కలిసి సిద్ధూ టీ తాగారని అమరీందర్ చెప్పుకొచ్చారు.
సిద్ధూ తనకు సమయం కావాలన్నారు.. అయన తగినంత సమయం తీసుకోనివ్వండి.. తిరిగి రాష్ట్ర మంత్రిమండలిలోకి వస్తారు.. మా బృందంలోకి తప్పకుండా వస్తారని కెప్టెన్ అమరీందర్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ సిద్ధూ డిప్యూటీ సీఎం లేదా పంజాబ్ పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది అని కెప్టెన్ బదులిచ్చారు.
‘ఈ నిర్ణయం తీసుకోవాల్సింది నేను, పీసీసీ చీఫ్ సునీల్ జాఖర్ కాదు.. ఆయన ఏం కావాలనుకుంటున్నారో కాంగ్రెస్ అధ్యక్షులు నిర్ణయిస్తారు.. ఒకవేళ ఆయన సీఎం పదవి కోరుకుంటే అదే దక్కుతుందని సీఎం అమరీందర్ వ్యాఖ్యానించారు. సిద్ధూ తనకు రెండేళ్ల వయసు నుంచే తెలుసని అమరీందర్ పేర్కొన్నారు. ఇరువురు భేటీకి సంబంధించిన ఫోటోలను సీఎం మీడియా సలహాదారు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
ఇదిలావుంటే సిద్ధూ తిరిగి కేబినెట్‌లోకి చేరుతారని, కీలక బాధ్యతలను అప్పగిస్తారని కాంగ్రెస్ వర్గాల్లో గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో సీఎం అమరీందర్‌తో ఆయన భేటీ కావడం దీనికి మరింత బలం చేకూర్చింది. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం సిద్ధూపై అమరీందర్ ఆరోపణలు చేశారు. ఆయన సరిగ్గా ప్రచారం నిర్వహించకపోవడం సహా తన మంత్రిత్వశాఖను పూర్తిస్థాయిలో సమర్థంగా నిర్వహించలేకపోయారని ఆరోపించారు.
తర్వాత మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేపట్టి సిద్ధూ నిర్వహిస్తున్న శాఖల్లో ముఖ్యమైన స్థానిక సంస్థలు, పర్యాటక, సాంస్కృతిక శాఖను తొలగించి విద్యుత్, నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల శాఖలను అప్పగించారు. దీంతో అమరీందర్ కేబినెట్ నుంచి సిద్ధూ తప్పుకున్నారు.
Read Also… Swaeroes IPS Praveen Kumar : దేశంలో హిందూ, నాన్ హిందూ విభజన రేఖలు పెరుగుతున్నాయి : ప్రవీణ్‌కుమార్