Varanasi bomb blast case 2006: వారణాసి వరుస బాంబు పేలుడు కేసు (2006)లో దోషిగా తేలిన ఉగ్రవాది వలీవుల్లా ఖాన్ (55)కు ఘజియాబాద్ జిల్లా సెషన్ కోర్టు సోమవారం (జూన్ 6) మరణశిక్ష విధించింది. బాంబు పేలుళ్ల అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌కు చెందిన మహమ్మద్ వలీలుల్లా ఖాన్ (Waliullah Khan)ను పోలీసులు 2006 ఏప్రిల్ 6న లక్నోలో అరెస్టు చేశారు. ఈ కేసును వారణాసి న్యాయవాదులు వాదించడానికి నిరాకరించడంతో కేసు విచారణను ఘజియాబాద్ కోర్టుకు అప్పగించారు. జూన్ 4న విచారణ జరిపిన ఘజియాబాద్ కోర్టు ఉగ్రవాది వలీలుల్లాను దోషిగా నిర్ధారించింది. ఎట్టకేలకు ఈ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన వలీలుల్లా ఖాన్కు అంతిమ శికను విధిస్తూ ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది.
నాటి వరుస బాంబు పేలుళ్లతో ఘోర మారణహోమం..
2006, మార్చి 7వ తేదీన సాయంత్రం 6 గంటల 15 నిముషాలకు వారణాసిలోని సంకట్ మోచన్ మందిరంలో మొదటి బాంబు పేలుడు జరిగింది. ఆ తర్వాత 15 నిముషాలకే వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లోని ఫస్ట్-క్లాస్ రిటైరింగ్ రూమ్ బయట సంభవించింది. గుడౌలియా నివాస ప్రాంతంలో మూడో బాంబు, వారణాసిలోని ప్రసిద్ధ గంగాఘాట్‌లో నాలుగో బాంబును పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి విచ్చిన్నం చేశారు. ఈ వరుస బాంబు పేలుడిలో 20 మంది అమాయక ప్రజలు మృతి చెందగా, 100కి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి నగరమంతా భయందోళనలకు గురయ్యారు. వారణాసి వరుస బాంబు పేలుళ్ల కేసు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దాదాపు 16 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది.