Varanasi: కోవిడ్ రెండో వేవ్ కలకలం కాశీకి తాకింది. యూపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాని ప్రభావం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ మీదా పడింది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కాశీ వచ్చేవారికి కొన్ని నిబంధనలు విధించింది. కాశీ విశ్వనాధుని దర్శనం చేసుకోవాలంటే మూడు రోజుల ముందు కోవిడ్-19 ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఆ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ కాశీ వెళ్ళేవారు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమే దర్శానికి అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వం చెప్పింది. అంతే కాకుండా, ఏదైనా అత్యవసర సందర్భం అయితే తప్ప ఈ నెల ౩౦వ తేదీ వరకూ కాశీ సందర్శన విషయంలో ఆలోచన చేయాలని అక్కడి అధికారులు కోరుతున్నారు. కాశీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా చెబుతున్నారు. కాశీలో ఇప్పటికే రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి, దీంతో పరిస్థితి అడుపుతప్పకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు.
ఇక ఇక్కడ రెండు వారాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు 1266 శాతం పెరిగాయి. దీంతో కరోనా కట్టడికి మే 3 వరకు వారాంతపు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు వారణాసి కలెక్టర్ కుశాల్ రాజ్ శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో కాశీకి వచ్చే దేశీయ, విదేశీ యాత్రికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ విషమ పరిస్థితుల నుంచి బయటపడాలంటే కోవిడ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటివి పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని కలెక్టర్ పేర్కొన్నారు. లక్నో, ప్రయాగ్ రాజ్ తర్వాత వారణాశిలో అత్యధిక కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ప్రస్తుతం వారణాసి జిల్లాలో 10,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మార్చి 31న కాశీలో 116 కేసులు నిర్ధారణ కాగా.. అప్పటికి 550 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కానీ, గురువారం ఒక్కరోజే 1,859 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా వచ్చాయి. దీంతో వారణాసి నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భక్తులను గంగా ఘాట్ల వద్దకు అనుమతించడంలేదు.
Also Read: Kanchi Kamakshi: సమస్త భూమండలానికి నాభి ఈ క్షేత్రం.. దర్శనంతోనే కష్టాలను తీర్చే అమ్మవారు