Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఇంకా లభించని 27 మంది మౌంటెనీర్స్‌ ఆచూకీ.. 14వేల అడుగుల ఎత్తులో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..

ప్రమాదంలో గల్లంతై పర్వతారోహకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 14మందిని ట్రెనీలను సురక్షితంగా బేస్‌ క్యాంప్‌కు చేర్చినట్టు ప్రకటించారు అధికారులు.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఇంకా లభించని 27 మంది మౌంటెనీర్స్‌ ఆచూకీ.. 14వేల అడుగుల ఎత్తులో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
Uttarakhand Danda 2 Peak

Updated on: Oct 06, 2022 | 11:24 AM

ఉత్తరాఖండ్‌ హిమపాతంలో చిక్కుకున్న మౌంటెనీర్స్‌ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటికీ 27మంది ఆచూకీ లభించలేదు. వారంతా ఎక్కడున్నారు..? ఏమయ్యారన్న ఆందోళన నెలకొంది. ద్రౌపది దండా 2 దగ్గర జరిగిన ప్రమాదంలో గల్లంతై పర్వతారోహకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 14మందిని ట్రెనీలను సురక్షితంగా బేస్‌ క్యాంప్‌కు చేర్చినట్టు ప్రకటించారు అధికారులు. మిగిలినవారు డొక్రియానీ బామక్‌ మంచుపర్వతం లోయలో చిక్కుకొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు.

వాతావరణం అనుకూలించడంతో ఉత్తరకాశీలోని మట్లీ హెలిప్యాడ్‌లో సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఐదుగురిని ఉత్తరకాశీ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. స్వల్పంగా గాయపడిన పది మందిని తిరిగి ఇంటికి పంపించారు. సహాయక చర్యల్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (సీడీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం)కి చెందిన పర్వతారోహకులు పాల్గొంటున్నారు.

ఈ ప్రమాదంలో 10మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల్లో ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు సవితా కన్స్వాల్‌ ఉన్నట్టు ప్రకటించారు అధికారులు. 16రోజుల్లో ఎవరెస్ట్‌, మకాలు పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్‌ సృష్టించారు సవితా కన్స్వాల్‌.

ఉత్తరకాశీలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనీరింగ్‌ నుంచి మొత్తం 42మంది సభ్యుల బృందం పర్వతారోహణకు వెళ్లారు. 18,600 అడుగుల ఎత్తులో ఉన్న ‘ద్రౌపది కా దండ-II’ పర్వత శిఖరం నుండి దిగుతుండగా ప్రమాదం జరిగింది. ఘ‌ర్‌వాల్ హిమాల‌య ప్రాంతంలోని గంగోత్రి స‌మీపంలో ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో పర్వతారోహకులంతా ఆ భారీ హిమపాతంలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఐతే 14వేల అడుగుల ఎత్తులో ప్రతికూల వాతావరణం..రెస్క్యూ టీమ్స్‌కు సవాల్‌గా మారింది.

మౌంటెనీర్స్‌ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ దృశ్యాలు


ట్రైనీ మౌంటెనీర్స్‌లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందినవారున్నారు. పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు, అసోం, కర్ణాటక, హర్యానా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం