ఫిర్యాదు చేసేందుకు వస్తే ఇంత దారుణమా.. లాయర్ చైన్ లాక్కుని, మూత్రం తాగించిన పోలీసులు!

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. విషయం తెలిసిన స్థానిక న్యాయవాదులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌‌కు చేరుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. దీంతో ఇందిరా గాంధీ ప్రతిస్థాన్ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. చివరికి పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో గొడవ సర్ధుమణిగింది.

ఫిర్యాదు చేసేందుకు వస్తే ఇంత దారుణమా.. లాయర్ చైన్ లాక్కుని, మూత్రం తాగించిన పోలీసులు!
Lucknow Lawyers Protest

Updated on: Mar 15, 2025 | 2:41 PM

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. లక్నోలో పోలీసులు ఒక న్యాయవాదితో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. ఆ న్యాయవాది తోటి న్యాయవాది తరపున వాదించడానికి వెళ్ళాడు. అక్కడ అతనిపై దాడి చేసిన పోలీసులు, అతని బంగారు గొలుసును లాక్కున్నారు. పోలీసులు తనను బలవంతంగా మూత్రం తాగించారని బాధితుడు న్యాయవాది ఆరోపించారు. ఈ ఘటన విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ తర్వాత న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఇందిరా గాంధీ ప్రతిస్థాన్ కూడలి వద్ద ట్రాఫిక్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం(మార్చి 14) నాడు తాను హోలీ జరుపుకున్న తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు తన స్నేహితుడు న్యాయవాది అమిత్ గుప్తా నుంచి ఫోన్ వచ్చిందని బాధితుడు న్యాయవాది సౌరభ్ వర్మ తెలిపాడు. పోలీసులు తనతో దుర్భాషలాడుతున్నారని కేసు పెట్టడానికి విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చానని ఆయన తనకు తెలియజేశారు. ఆ తర్వాత సౌరభ్ మరో తోటి న్యాయవాది రాహుల్ పాండేతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.

సౌరభ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు అక్కడ చాలా మంది పోలీసులు కూర్చున్నారని, వారిలో కొందరు యూనిఫాం ధరించారని, మరికొందరు యూనిఫాం లేకుండా ఉన్నారని చెప్పారు. ఈ పోలీసులు వారిద్దరితో దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడటం ప్రారంభించారు. తాను న్యాయవాదినని చెప్పినప్పుడు, అతన్ని మరింతగా తిట్టారని, హోలీ పేరుతో అతను మెడలో ధరించిన బంగారు గొలుసును కూడా పోలీసులు లాక్కున్నారని పేర్కొన్నాడు. అతని ముఖం మీద మూత్ర విసర్జన చేశారని బాధిత న్యాయవాది ఆరోపించారు.

ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు కూడలిని దిగ్బంధించారు. దీని కారణంగా అక్కడ చాలా సేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గొడవ గురించి సమాచారం అందిన వెంటనే, సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చివరికి న్యాయవాదులను శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది.

న్యాయవాది సౌరభ్ వర్మ ఫిర్యాదు మేరకు, విభూతిఖండ్ పోలీస్ స్టేషన్‌లో 9 మంది పోలీసులు, కొంతమంది గుర్తుతెలియని పోలీసులపై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..