లక్నో, సెప్టెంబర్ 10: చోరీకి వెళ్లిన దొంగ హైటెన్షన్ లైన్ వైర్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఇంటిపై నుంచి శబ్ధాలు రావడంతో ఏంటా అని చూడటానికి వచ్చిన ఇంటి యజమాని అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. భయాందోళనకు గురైన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడిపై ఇప్పటికే 7 చోరీ కేసులు నమోదయ్యాయని, అవి కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని అతని కోసం ఇప్పటికే పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బండాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తరప్రదేశ్‌లోని బండాలో కొత్వాలీ నగరంలోని తింద్వారీ రోడ్డు ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఓ దొంగ దొంగతనం చేసేందుకు ఇక్కడికి వచ్చాడు. ఏసీ వైర్ కట్ చేసి టెర్రస్ వైపు వెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో భవనం పై ఉన్న హైటెన్షన్ లైన్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఇంట్లో నివాసం ఉంటున్న వారు భవనం పైకి చేరుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టెర్రస్‌పై పడి ఉన్న మృతదేహాన్ని చూసి వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కొత్వాలి ప్రాంతంలోని కాశీరాం కాలనీకి చెందిన రాజాగా గుర్తించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇరుగు పొరుగు వారు దొంగరే తగిప శాస్తి జరిగిందని, ఎవరికైనా చెడు చేస్తే వారికి కూడా చెడే జరుగుతుందని చెప్పుకొచ్చారు. దీనిపై నగర డీఎస్పీ గవేంద్ర పాల్ గౌతమ్ మాట్లాడుతూ.. నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని తింద్వారి రోడ్డులో ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మృతుడు చోరికి యత్నించి భవనం పైకి వెళ్లే క్రమంలో హైటెన్షన్ లైన్ తగిలి మృతి చెందినట్లు సమాచారం. మృతుడిపై ఇప్పటికే 7 చోరీ కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించాం. అతుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ గవేంద్ర పాల్ గౌతమ్ మీడియాకు తెలిపారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.