వీళ్లు సంరక్షకులా..? రాక్షసులా..? సొంత ఇంట్లోనే ఐదేళ్ల పాటు చీకటి గదిలో బందీలుగా తండ్రీకూతురు..!

ఆశ్రయమిచ్చిన చేతినే కాటు వేసిన రాక్షసుల కథ ఇది. ఉత్తరప్రదేశ్‌ మహోబా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘోరం మానవత్వానికే మచ్చగా మారింది. ఇంటి యజమానులనే బందీలుగా మార్చి నరకం చూపించారు కేర్ టేకర్లు. ఐదేళ్ల పాటు సాగిన ఈ చిత్రహింసల కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరోకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

వీళ్లు సంరక్షకులా..? రాక్షసులా..? సొంత ఇంట్లోనే ఐదేళ్ల పాటు చీకటి గదిలో బందీలుగా తండ్రీకూతురు..!
Father And Daughter Locked

Updated on: Dec 31, 2025 | 7:13 AM

ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో వెలుగు చూసిన ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఓంప్రకాష్ సింగ్ రాథోడ్, అతని కూతురి పట్ల ఒక జంట అమానుషంగా ప్రవర్తించింది. 70 ఏళ్ల ఓంప్రకాష్ సింగ్ రాథోడ్.. 2016లో భార్య చనిపోవడంతో మానసిక వికలాంగురాలైన తన కూతురు రష్మిని కళ్లల్లో పెట్టి చూసుకున్నారు. తాను లేనినాడు తన బిడ్డ అనాథ కాకూడదని, తనకు, తన బిడ్డకు సాయంగా ఉంటారనే ఆలోచనతో ఒక జంటను ఇంట్లో పనికి పెట్టుకున్నారు.

అన్నివిధాలా తోడు నీడగా ఉంటారని రాంప్రకాష్ కుష్వాహా, అతని భార్య రాందేవిని నమ్మి ఇంట్లోకి ఆహ్వానించారు. కానీ, ఆ నమ్మకమే ఆయన పాలిట మృత్యుపాశమైంది. వారి బలహీనతను ఆసరాగా తీసుకున్న ఆ జంట క్రూరత్వాన్ని బయట పెట్టుకుంది. తండ్రీకూతుళ్లను కింది గదిలో నరకానికి పరిమితం చేసి, ఆ దంపతులు పై అంతస్తులో విలాసంగా గడిపారు. యజమానులకు ఆహారం, వైద్య సంరక్షణలాంటివేవీ పట్టించుకోలేదు. రాను రాను వారికి తిండి, నీళ్లు ఇవ్వకుండా వేధించారు. బంధువులు ఎవరైనా చూడటానికి వస్తే.. “ఓంప్రకాష్ ఎవరినీ కలవడానికి ఇష్టపడటం లేదు” అని చెప్పి వెనక్కి పంపించేవారు. క్రమంగా ఇంటిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. అలా ఐదేళ్లపాటు వీరి ఆగడాలు సాగాయి.

తీవ్ర అనారోగ్యానికి గురైన ఓంప్రకాశ్‌ ఆకలికి తాళలేక, తన బిడ్డ భవిష్యత్తుపై బెంగతో ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న బంధువులు ఇంటికి వెళ్లగా.. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి ఖంగుతిన్నారు. మరణించిన ఓంప్రకాశ్ శరీరం కృశించిపోగా.. రష్మీ ఎముకలగూడులా మారి.. ఓ చీకటిగదిలో ఉంది. 30 ఏళ్ల రష్మీ 80 ఏళ్ల వృద్ధురాలిగా మారిందని, ఆమె శ్వాస తీసుకుంటుంటే అస్థిపంజరం శ్వాస తీసుకున్నట్లుగా కనిపిస్తోందని బంధువులు వాపోయారు. ఎంతో హుందాగా బతికిన ఆ కుటుంబం.. ఇలా అవ్వడాన్ని చూసిన స్థానికులు.. కేర్ టేకర్లుగా వచ్చిన జంటే దీనంతటికీ కారణమని మండిపడ్డారు. డబ్బు, ఆస్తికోసం ఇంతకు తెగించారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇంటి కరెంట్ కనెక్షన్‌ను రాంప్రకాశ్, రమాదేవిలు తమ పేరుమీదికి మార్చుకున్నట్లు గుర్తించారు. నమ్మిన వారిని ఇలా చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..