పుట్టినరోజు వేడుకలో విషాదం.. ముఖానికి కేక్ పూశారని ముగ్గురి కాల్చివేత..!

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఒక చిన్నపాటి వివాదం ముగ్గురు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో సరదాగా సాగాల్సిన సమయం, రక్తపాత ఘర్షణగా మారి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పుట్టినరోజు వేడుకలో విషాదం.. ముఖానికి కేక్ పూశారని ముగ్గురి కాల్చివేత..!
Youths Shot Dead

Updated on: Apr 26, 2026 | 7:13 AM

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఒక చిన్నపాటి వివాదం ముగ్గురు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో సరదాగా సాగాల్సిన సమయం, రక్తపాత ఘర్షణగా మారి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఖుర్జా నగర్ ప్రాంతంలోని నెహ్రూపూర్ చుంగి, సుభాష్ రోడ్డులో ఉన్న ఒక జిమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ జీతూ అనే యువకుడి పుట్టినరోజు వేడుక కోసం అతని స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పార్టీలో అందరూ కేక్ కట్ చేసి, ఆనందంగా గడుపుతున్న సమయంలో.. కొందరు స్నేహితులు సరదాగా జీతూ ముఖానికి కేక్ పూయడం ప్రారంభించారు.

అయితే, తన ముఖానికి కేక్ పూయడాన్ని జీతూ తీవ్రంగా పరిగణించాడు. ఇది కాస్తా మాటా మాట పెరిగి పెద్ద వివాదానికి దారితీసింది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన కొందరు వ్యక్తులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. దుండగులు నేరుగా బాధితుల తలలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. ఈ భీకర కాల్పుల్లో మనీష్ సైని, ఆకాశ్ సైని, అమర్‌దీప్ అనే ముగ్గురు యువకులు తలలకు బుల్లెట్లు తగిలి రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘోరకలితో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎస్పీ రూరల్ అంతరిక్ష్ జైన్ నేతృత్వంలో భారీ పోలీసు బలగాలు, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగి ఆధారాలను సేకరించాయి. “కేక్ పూయడంపై తలెత్తిన చిన్న వివాదమే ఈ హత్యలకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం,” అని ఎస్పీ తెలిపారు.

ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి ఆ ప్రాంతంలో అదనపు పీఏసీ సిబ్బందిని మోహరించారు. ఒక చిన్నపాటి సరదా ప్రాణాంతక వైరాగ్యంగా మారడం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us