రక్తంతో తడిసిన చెక్క పెట్టె.. లోపల ఏం ఉందో తెరిచి చూసి గ్రామస్తులు షాక్!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ దారుణ హత్య ఘటన కలకలం రేపింది. జాతీయ రహదారి పక్కన ఉన్న చిన్న కాలువలో ఓ యువకుడి మృతదేహం చెక్క పెట్టెలో లభించడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారితీసింది. భావఖేడ గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ దారుణ హత్య ఘటన కలకలం రేపింది. జాతీయ రహదారి పక్కన ఉన్న చిన్న కాలువలో ఓ యువకుడి మృతదేహం చెక్క పెట్టెలో లభించడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారితీసింది. భావఖేడ గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలువలో అనుమానాస్పదంగా ఓ చెక్క పెట్టె కనిపించింది. దాన్ని పరిశీలించగా పెట్టె నుంచి రక్తం కారుతున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మోహన్‌లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పెట్టెను తెరిచి చూడగా అందులో రక్తంతో తడిసిన మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వేరే చోట హత్య.. ఇక్కడ మృతదేహం పడేశారా?
ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్య సోమవారం-మంగళవారం మధ్య రాత్రి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య మరో ప్రాంతంలో జరిగి ఉండవచ్చని, అనంతరం మృతదేహాన్ని చెక్క పెట్టెలో ఉంచి వాహనంలో తీసుకొచ్చి అర్ధరాత్రి సమయంలో కాలువలో పడేసి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడి వయస్సు సుమారు 32 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు అతడి గుర్తింపు నిర్ధారణ కాలేదు. సమీప గ్రామాల ప్రజలను పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల అదృశ్యమైన వ్యక్తుల వివరాలను కూడా పరిశీలిస్తూ మృతుడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సీసీటీవీ, ఫోరెన్సిక్ ఆధారాలపై దృష్టి
కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ బృందం పోలీసులకు సహకరిస్తోంది. ఘటనాస్థలానికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని తరలించిన వాహనం లేదా అనుమానితుల కదలికలు కెమెరాల్లో నమోదయ్యాయా అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతదేహం లభించిన ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే విషయంలో తొలుత మోహన్‌లాల్‌గంజ్, నిగోహన్ పోలీసుల మధ్య స్పష్టత లేకపోయింది. అనంతరం అధికారుల సమక్షంలో సరిహద్దును నిర్ధారించి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి గుర్తింపు, హత్యకు దారితీసిన కారణం, నిందితులు ఎవరు అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
