Uttar Pradesh: మసీదుల నిర్మాణానికి కూల్చివేసిన అన్ని దేవాలయాలను పునర్నిర్మిస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదుల నిర్మాణానికి కూల్చివేసిన అన్ని దేవాలయాలను తమ పార్టీ పునర్నిర్మిస్తుందన్నారు.

MLA Sangeet Som: ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదుల నిర్మాణానికి కూల్చివేసిన అన్ని దేవాలయాలను తమ పార్టీ పునర్నిర్మిస్తుందని మీరట్‌లోని సర్ధన అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అన్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ‘కాలానుగుణ హిందువు’ అని సోమ్ ఆరోపించారు. గత నాలుగున్నర సంవత్సరాల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో సోమ్ ప్రసంగించారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను ఎగతాళి చేస్తూ, ‘‘రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా మంది ప్రజలు కాలానుగుణ హిందువులు అవుతారు’’ అని సోమ్ వ్యాఖ్యానించారు.
భక్తులపై కాల్పులకు ఆదేశించిన వ్యక్తులు ఇప్పుడు దేవాలయాల నిర్మాణం గురించి మాట్లాడుతున్నారని సోమ్ ఎద్దేవా చేశారు. ‘‘మసీదులను కూల్చివేసిన తర్వాత ఒక దేవాలయం పునర్నిర్మిస్తాం’’ అని సోమ్ స్పష్టం చేశారు. హిందుస్థాన్ హిందువులకు చెందినదని, ఇక్కడ ప్రతి మనిషి హిందువేనని సోమ్ వ్యాఖ్యానించారు. ముస్లింలు కూడా హిందువులేనని ఆయన పేర్కొన్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సోమ్ 2013 ముజఫర్‌నగర్ మత కలహాల కేసులో నిందితుడు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 350 సీట్లు గెలిచి, ఉత్తర ప్రదేశ్‌లో భాజపా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సోమ్ జోస్యం చెప్పారు.




