కోవిడ్ మహమ్మారి ఓ సీనియర్ డాక్టర్ ప్రాణాలనే బలిగొంది. ఈ వైరస్ సోకి విషమ స్థితిలో ఉన్న ఆ డాక్టర్ వెంటిలేటర్ లభించక ప్రాణాలు కోల్పోయాడు. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో 85 ఏళ్ళ డాక్టర్ జె.కె.మిశ్రా అక్కడి స్వరూప్ రాణి నెహ్రు అనే ఆసుపత్రిలో సుమారు 50 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ నెల 13 న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ఆయనను ఇదే ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆయనకు వెంటిలేటర్ ఎంతో అవసరమైంది. కానీ ఈ హాస్పిటల్ అప్పుడే కోవిడ్ పేషంట్లతో నిండిపోగా వారందరికీ వెంటిలేటర్లను అమర్చాల్సి వచ్చింది. ఏ ఒక్క వెంటిలేటర్ తొలగించినా సదరు రోగి మరణిస్తాడని, అందువల్ల డాక్టర్ మిశ్రాకు వెంటిలేటర్ సౌకర్యం కల్పించలేకపోయామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. చివరకు తన భార్య కళ్ళ ముందే మిశ్రా మరణించారు. ఇన్నేళ్ళుగా తాను పని చేసిన హాస్పిటల్ లోనే ఆయన కన్ను మూయడం ఆయన తోటి డాక్టర్లను, వైద్య సిబ్బందిని విషాదంలో ముంచివేసింది.
దేశంలో మహారాష్ట్ర తరువాత యూపీ…. కోవిడ్ పాండమిక్ తో అల్లాడుతోంది. రాష్ట్రంలో 2.97 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒక్క రోజులోనే కొన్ని వందల కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులకుతగినంత ఆక్సిజన్ లభ్యత కోసం యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రత్యేకంగా ఓ డిజిటల్ ప్లాట్ ఫామ్ వ్యవస్థను ఇటీవల లాంచ్ చేశారు. కానీ ఈ విధమైన కార్యక్రమాలు మిశ్రా వంటి సీనియర్ డాక్టర్ల ప్రాణాలను కూడా రక్షించలేకపోతున్నాయి. ప్రయాగ్ రాజ్, మధుర, ఆగ్రా వంటి పలు జిల్లాలు కరోనా వైరస్ కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Indane Gas Booking: మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా..? ఈ నెంబర్ చెబితేనే గ్యాస్ డెలివరి అవుతుంది..!