
Yogi Adityanath: మహిళల పరువుప్రతిష్టలకు భంగం కలిగించేవారికి మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడికి పట్టిన గతే పడుతుందంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో సమాజ్‌వాది పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఆ పార్టీ మహిళా వ్యతిరేక, దళిత వ్యతిరేక, బీసీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక, బాలల వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు. సాంభల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. గతంలో రాష్ట్రంలో బాలికలు ధైర్యంగా స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నారు. గూంఢాలు వారి పరువుకు భంగం కలిగిస్తూ ఇబ్బందులు పాలు చేసేవారన్నారు. అయితే ఇప్పుడు ఎవరైనా మన అక్కాచెల్లెళ్లు, ఆడపడుచుల జోలికొస్తే దుర్యోధనుడికి ఎదురైన పరిస్థితిని రుచి చూపిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని సాంభల్ జిల్లాకు చారిత్రకు నేపథ్యం ఉందన్న ఆదిత్యనాథ్.. అయితే ఇప్పుడు కొందరు స్థానికులు తాలిబన్లకు మద్ధతు ఇస్తున్నారని అన్నారు. తాలిబన్ల పాలనలో మహిళలు ఎలాంటి దుస్థితిని ఎదుర్కొన్నారో అందరికీ తెలుసని.. అయితే కొందరు సమాజ్‌వాది పార్టీ నేతలు తాలిబన్లను వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. 2017కు ముందు రాష్ట్రంలో గోవులకు కూడా రక్షణ ఉండేది కాదన్నారు. గోవధశాలలను తాము మూసివేయించామని, దీంతో సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ వ్యాపారం ముగిసిందన్నారు. దేశం పట్ల అత్యంత భక్తి కలిగిన పార్టీ బీజేపీగా అభివర్ణించారు.
దేశ విద్రోహ శక్తులకు ఆశ్రయం కల్పించే కొన్ని శక్తులు రాష్ట్రంలో ఉన్నాయంటూ యూపీ సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ఆశీస్సులు ఉన్నంత వరకు రాష్ట్రంలో ఎవరికీ ఎలాంటి హాని జరగదని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.
Also Read..