
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. కుల సమీకరణాలు, సంప్రదాయ ఓటు బ్యాంకులు దాటి, ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి ఆ ఓటర్లపై పడింది. వారే ‘జెన్-జీ’ (Gen-Z) ఓటర్లు. సోషల్ మీడియా, ఉద్యోగ అవకాశాలు, విద్య.. ఇలా యువతను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సుమారు 20 శాతం వాటా ఉన్న యువ ఓటర్లే తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించబోతున్నారు. 2027 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది ఈ ‘జెన్-జీ’ ఓటర్ల మద్దతుపైనే ఆధారపడి ఉంటుంది. దీంతో అధికార బీజేపీతో పాటు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) వంటి పార్టీలు తమ పాత పద్ధతులకు స్వస్తి పలికి డిజిటల్ బాట పడుతున్నాయి. జెన్ జీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు.
– సమాజ్‌వాదీ పార్టీ (SP): యూపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఎస్పీ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చింది. కేవలం ర్యాలీలపైనే ఆధారపడకుండా, 200 మందికి పైగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో నేరుగా సమావేశమవుతున్నారు. నిరుద్యోగం, పేపర్ లీక్ వంటి అంశాలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పల్లెటూరి యువతకు చేరువ చేసే పనిలో పడ్డారు. యువ ఎంపీలను ముందుంచి డిజిటల్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
– కాంగ్రెస్ (Congress): రాహుల్ గాంధీ ‘గూంజ్’ (Goonj) కార్యక్రమం ద్వారా నేరుగా విద్యార్థులతో సంభాషిస్తున్నారు. NSUI ద్వారా యూనివర్సిటీలు, కాలేజీ క్యాంపస్‌లలో సభ్యత్వ నమోదును పెంచడంపై దృష్టి సారించింది.
– బహుజన్ సమాజ్ పార్టీ (BSP): ఆకాష్ ఆనంద్‌ను యువ సారథిగా ప్రొజెక్ట్ చేస్తోంది. అఖిలేష్, రాహుల్‌లను ‘అంకుల్స్’గా సంబోధిస్తూ, యువత సమస్యలను తాము మాత్రమే అర్థం చేసుకోగలమని ఆకాష్ ఆనంద్ బలంగా ప్రచారం చేస్తున్నారు.
– బీజేపీ (BJP): యోగి సర్కార్ ‘యువ చక్రవ్యూహం’ సిద్ధం చేసింది. ‘యువ నీతి’, ‘యువ ఆయోగ్’ల ద్వారా సమస్యలను పరిష్కరించాలని చూస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా వర్సిటీలకు వెళ్లి విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిచ్చేలా ‘టూ-వే కమ్యూనికేషన్’ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా, జిల్లా స్థాయిల్లో ‘యువ సలహా కమిటీలను’ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో యువతతో టచ్‌లో ఉండాలని నిర్ణయించింది. ఆరెస్సెస్ (RSS) కూడా క్యాంపస్‌ల వారీగా రిపోర్టింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది.
యూపీలో చాలా నియోజకవర్గాల్లో విజయావకాశాలు కొన్ని వేల ఓట్ల తేడాతోనే మారుతుంటాయి. యువతలో ఉన్న ఉద్యోగ భద్రత, పేపర్ లీక్ ఆందోళనలు, స్టార్టప్ అవకాశాలు, సామాజిక ప్రాతినిధ్యం వంటి అంశాలపై ఏ పార్టీ ఆకర్షణీయమైన హామీలు ఇస్తే వారే విజేతలుగా నిలుస్తారు.
మొత్తానికి, 2027 ఎన్నికలు కేవలం కులాల పోరుగా మిగలవు.. మొబైల్ స్క్రీన్ల నుంచి యూనివర్సిటీ క్యాంపస్‌ల వరకు సాగే హై-వోల్టేజ్ ‘డిజిటల్ వార్’గా మారబోతున్నాయి. మరి ఈ యువ ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.