మాది సమానత్వం, సామాజిక న్యాయం.. గోధుమ ఎగుమతుల బ్యాన్‌పై పశ్చిమ దేశాలకు భారత్ కౌంటర్..

|

May 19, 2022 | 3:10 PM

Why India Banned Wheat: అవసరమైన వారికి ఆహార ధాన్యాలను అందించాలనే ఉద్దేశంతోనే ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించింది భారత్. ఆహార ధాన్యాల సరఫరా కొవిడ్‌ వ్యాక్సిన్ల మాదిరిగా ఉండకూడదంటూ అంతర్జాతీయ వేదికగా..

మాది సమానత్వం, సామాజిక న్యాయం.. గోధుమ ఎగుమతుల బ్యాన్‌పై పశ్చిమ దేశాలకు భారత్ కౌంటర్..
Why India Banned Wheat Expo
Follow us on

గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ(Wheat Ban) కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ దేశాల చేస్తున్న విమర్శలను తిప్పికొట్టింది భారత్. అవసరమైన వారికి ఆహార ధాన్యాలను అందించాలనే ఉద్దేశంతోనే ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించింది భారత్. ఆహార ధాన్యాల సరఫరా కొవిడ్‌ వ్యాక్సిన్ల మాదిరిగా ఉండకూడదంటూ అంతర్జాతీయ వేదికగా పశ్చిమ దేశాలకు గట్టి సమాధానం చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కాల్‌ టు యాక్షన్‌.. అనే అంశంపై జరిగిన మంత్రివర్గ సదస్సులో భారత్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ హజరయ్యారు. ఈ సదస్సులో మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ.. అల్పాదాయ దేశాలు నేడు రెండు ఇబ్బందులను ఒకేసారి ఎదుర్కొంటున్నాయి. ఒకటి ధరల పెరుగుదల. మరొకటి ఆహార ధాన్యాలను కొరత. భారత్‌ లాంటి దేశాలు కూడా సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ.. అక్రమ ధరల పెరుగుదలను కొంతవరకు చవిచూస్తున్నాయి. కొన్ని దేశాలు అధిక నిల్వలను ఉంచుకోవడం.. సరఫరాపై వస్తోన్న ఊహాగానాలే ఇందుకు కారణం. ఇదిలాగే కొనసాగడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

గోధుమల ఎగుమతిపై నిషేధం అందుకంటే..

అంతర్జాతీయంగా గోధుమ ధరలు ఒక్కసారిగా పెరగడంతో దేశీయ ఆహార భద్రతతో పాటు పొరుగుదేశాలు, ఇతర దుర్భల దేశాలకు సమస్యగా మారిందని గుర్తించినట్లు కేంద్ర మంత్రి మురళీధరన్‌ స్పష్టం చేశారు. దేశ ఆహార భద్రతపై ఈ ప్రభావం పడకుండా చూడటంతో పాటు అత్యంత అవసరమున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే గోధుమ ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించినట్లుగా కేంద్రమంత్రి వెల్లడించారు. గోధుమలపై నిషేధం విధిస్తూనే కొన్ని సడలింపులు కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ దేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు దిగుమతులు అత్యవసరమైన దేశాలు అభ్యర్థిస్తే తప్పకుండా వారికి సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. సమానత్వం, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే పశ్చిమ దేశాలను టార్గెట్‌ చేస్తూ ఆయన మరో కామెంట్ కూడా చేశారు. కొన్ని ధనిక దేశాలకు తమకు అవసరమున్న దాని కంటే అధికంగా కొవిడ్‌ వ్యాక్సిన్లను నిల్వ చేసుకోవడంతో పేద, మధ్యాదాయ దేశాల్లోని ప్రజలుకు కనీసం తొలి డోసు కూడా అందలేని పరిస్థితి నెలకొందని మంత్రి మురళీధరన్‌ గుర్తు చేశారు. ఆహార ధాన్యాల సరఫరా కొవిడ్ వ్యాక్సిన్ల మాదిరిగా కాకూడదని పశ్చిమ దేశాలకు సుతిమెత్తగా హెచ్చరించారు. ఆహార ధాన్యాల విషయలో సమానత్వం, స్థాయి, అందుబాటు ప్రాముఖ్యాన్ని మనమంతా గుర్తించాల్సిన అవసరం ఉందని పశ్చిమ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది.

వసుధైక కుటుంబం..

ఒత్తిడి, సంక్షోభంలో కూరుకుపోయిన దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు భారత్‌ ముందుంటుందని మంత్రి మురళీధరన్‌ మరోసారి స్పష్టం చేశారు. మా పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికాలో ఆహార భద్రతను బలోపేతం చేసేందుకు భారత్ ప్రభుత్వం వేలాది మెట్రిక్‌ టన్నుల గోధుమలు, బియ్యం, పప్పు దినుసుల వంటి వాటిని పలు దేశాలకు పంపిస్తోంది. అఫ్గానిస్థాన్‌లో మానవతా సంక్షోభం నెలకొన్నప్పుడు 50వేల టన్నుల గోధుమలను పంపించినట్లుగా గుర్తు చేశారు. శ్రీలంక, మయన్మార్‌ దేశాలను కూడా ఆర్ధిక లోటు వచ్చిన వెంటనే భారత్ స్పందించి ఆదుకుందన్నారు. వసుధైక కుటుంబమే మోడీ సర్కార్ విధానం అని కేంద్రమంత్రి మరోసారి గుర్తు చేశారు.