దేశంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి.. అధిక వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ఓవర్ డ్రైవింగ్, నిబంధనలు ఉల్లంఘించడం, హెల్మెట్ లేకుండా రోడ్లపై వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ ఇలా ఎన్నో రకాల కారణాలతో నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో బాధితుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రమాదాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించింది.. రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని గడ్కరి వెల్లడించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే, చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
అయితే, ప్రమాదం జరిగిన తర్వాత.. ఇది మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుందని నితిన్ గడ్కరి పేర్కొన్నారు. ప్రమాద ఘటన జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారాన్ని అందిస్తేనే ఈ పథకం ద్వారా నగదు రహిత చికిత్సను పొందొచ్చని గడ్కరీ స్పష్టం చేశారు.
అంతేకాకుండా.. హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయే వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని నితిన్ గడ్కరి తెలిపారు.
ఈ పథకాన్ని ఇప్పటికే.. కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ఆ సమయంలో పథకంలో కొన్ని లోపాలు బయటపడగా, వాటిని ఇప్పుడు సరిదిద్దామన్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తర్వాత లక్షలాది మందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.. నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి.. దీనిని నిరంతరం మెరుగుపరుస్తూ వస్తోంది..
రోడ్డు భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని గడ్కరీ వెల్లడించారు.. 2024 సంవత్సరంలో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.80 లక్షల మంది చనిపోవడం ఆందోళన కలిగించే విషయమని.. వీటిలో 30వేల మరణాలు కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్డు ప్రమాదాల బారినపడిన వారిలో దాదాపు 66 శాతం మంది 18 నుంచి 34 ఏళ్లలోపు యువతే ఉన్నారని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..