Kishan Reddy Visits Vadnagar Railway Station: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో బుధవారం పర్యటించారు. ప్రాచీన పట్టణం, గొప్ప చరిత్రను వెలుగులోకి తెచ్చే “అనంత్ అనాది వాద్‌నగర్” డాక్యూసిరీస్ ప్రదర్శనను పురస్కరించుకుని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి వాద్‌నగర్‌లోని రైల్వే స్టేషన్, తదితర ప్రాచీన ప్రాంతాలను సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మస్థలమైన బహుళస్థాయి చారిత్రక పట్టణం వాద్‌నగర్‌ను 2022లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాచీన పట్టణ విశిష్టతను, గొప్ప చరిత్రను చాటిచెప్పే విధంగా కేంద్ర పర్యటక శాఖ.. పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా అనంత్ అనాది వాద్‌నగర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వాద్‌నగర్‌లో గత 2700 సంవత్సరాల నుంచి ప్రజలు నివసిస్తున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక పట్టణమైన వాడ్‌నగర్‌ను భారతదేశంలోని చారిత్రక జీవన నగరాలైన మధుర, ఉజ్జయిని, పాట్నా, వారణాసితో పోల్చవచ్చు.
అయితే, గుజరాత్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బుధవారం వాడ్‌నగర్ రైల్వే స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, పర్యాటక శాఖ అధికారులతో కలిసి టీ తాగారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారితో చర్చించారు. దీంతోపాటు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అయితే, ఈ రైల్వే స్టేషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. చిన్నతనంలో తన తండ్రికి టీ అమ్మడంలో సహాయం చేసేవారు. అక్కడ ప్రయాణికులకు టీ విక్రయించేవారు. దాదాపు 1880లలో నిర్మించిన ఈ స్టేషన్ ను ప్రస్తుతం ఆధునికీకరించారు. ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో ఈ రైల్వే స్టేషన్ స్థానిక ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..