UNESCO Heritage structures: ప్రపంచ వారసత్వ కట్టడాలుగా భారత్‌లోని పలు స్మారకాలు ఇప్పటికే యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్‌లోని మూడు స్మారక కట్టడాలకు యూనెస్కో గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ చొరవతోనే ఇది సాధ్యమైందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వం కృషితో యునెస్కో(UNESCO) లో భారత తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించుకున్న స్మారకాల సంఖ్య 49 కి పెరిగిందని పేర్కొన్నారు. ఇటీవల తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించుకున్న స్మారకాల వివరాలను కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది భారత్ మూడు కట్టడాల చరిత్ర వాటి ఔన్నత్యం గురించి నామినేషన్లను యునెస్కోకు పంపినట్లు కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడాల గుర్తింపు ప్రక్రియకు తాత్కాలిక జాబితాలో స్థానం దక్కింది. లేపాక్షిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం అందులోని ఏకశిలా నంది విగ్రహం (విజయనగర సామ్రాజ్యంలోని శిల్పాలు, హస్తకళా చిత్ర సాంప్రదాయం) ఈ జాబితాలో చోటు సంపాదించిందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మహారాష్ట్ర కొంకన్ ప్రాంతంలో నేలపై గీసిన పురాతన చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.
మేఘాలయ రాష్ట్రంలో ప్రకృతి ద్వారా మన సంస్కృతిని తెలియజేసేలా జీవంతో ఉన్న చెట్ల వేర్లపై ఏర్పాటు చేసిన వంతెనలు తాత్కాలిక జాబితో చోటు దక్కించుకున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఏదైనా స్మారక చిహ్నాన్ని లేదా ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటే మొదట తాత్కాలిక జాబితాలో చేర్చవలసి ఉంటుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో మున్ముందు మరిన్ని కట్టడాలను చేర్చేందుకు కృషిచేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
Also Read: