
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం(జూన్ 22) సంచలన ప్రకటన చేశారు. నక్సలిజానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటాన్ని ప్రకటించారు. మార్చి 31, 2026 నాటికి దేశం నుండి నక్సలైట్లను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్ష. సమావేశానికి ఏపీ, తెలంగాణ డీజీపీలతో పాటు మావోయిస్టు ప్రభావితప్రాంత రాష్ట్రాల డీజీపీలు హాజరయ్యారు.
వర్షాకాలం సీజన్‌లోనూ నక్సల్స్‌ను విశ్రాంతి తీసుకోనీయమని, నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ ఆ సీజన్‌లోనూ కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. నక్సల్స్‌తో చర్చల ప్రసక్తే లేదని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలోని వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 400 మంది నక్సల్స్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయన్నారు. ప్రతిసారి రుతుపవనాల సీజన్‌లో సహజంగా నక్సల్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారని, కానీ ఈసారి ఆ సీజన్‌లోనూ వారిని నిద్ర పోనీయమని, 2026, మార్చి 31నాటికి నక్సల్స్ నిర్మూలన లక్ష్యం సాధించే దిశగా మరింత ముందుకు దూసుకు వెళ్తామని చెప్పారు. నక్సల్స్ లొంగిపోవాలని, లొంగుబాటు పాలసీని అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేపట్టిన కొత్త నక్సల్ లొంగుబాటు విధానాన్ని హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఇది సానుకూల చొరవ అని, ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చే వారికి మెరుగైన భవిష్యత్తు, గౌరవప్రదమైన జీవితం కోసం అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. హింసా మార్గాన్ని విడిచిపెట్టి దేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని నక్సలైట్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందిన భారతదేశం అనే దార్శనికతను ప్రస్తావిస్తూ, ఈ కల మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, ఆర్థిక పురోగతికి మాత్రమే పరిమితం కాదని, ఇది సకాలంలో న్యాయం, సామాజిక స్థిరత్వంపై కూడా దృష్టి పెడుతుందని అమిత్ షా అన్నారు. నక్సలిజం వంటి సమస్యల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడం ద్వారా మాత్రమే నిజమైన అభివృద్ధిని నిర్ధారించవచ్చని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రం ఒకే నిబద్ధతతో కలిసి పనిచేయడం కొనసాగిస్తే, నిర్ణీత సమయం కంటే ముందే నక్సలిజాన్ని నిర్మూలించవచ్చని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..