AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KRMB & GRMB: గెజిట్ అమలుకు కేంద్రం కసరత్తు.. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లతో సమీక్ష

కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. రెండు నదీ జలాల యాజమాన్యపు బోర్డుల చైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష.

KRMB & GRMB: గెజిట్ అమలుకు కేంద్రం కసరత్తు..  కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లతో సమీక్ష
Krmb Grmb Meeting
Balaraju Goud
|

Updated on: Sep 13, 2021 | 8:53 PM

Share

Krishna and Godavari River Board: రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మేరకు కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. రెండు నదీ జలాల యాజమాన్యపు బోర్డుల చైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ సమావేశం నిర్వహించారు.

సోమవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరిగిన సమావేశానికి కృష్ణ నది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ జే. చంద్రశేఖర్ అయ్యర్ పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమలు చేయాల్సిన పరిస్థితుల్లో ప్రాజెక్టులు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్షించింది. ఇదే సమయంలో బోర్డు పరిధిపై రెండు తెలుగు రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలు కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టు సమాచారం. బేసిన్‌లో నిర్మించిన అన్ని ప్రాజెక్టులనూ బోర్డుల పరిధుల్లోకి తీసుకురావడంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణా నదిపై ప్రాజెక్టుల విషయంలో నదీ జలాల వాటా తేల్చిన తర్వాతే గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది.

మరోవైపు కొన్ని ప్రాజెక్టులను ఆమోదం పొందని ప్రాజెక్టులుగా గెజిట్‌లో చూపడాన్ని రెండు రాష్ట్రాలూ తప్పుబడుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రాలు బోర్డులకు లేఖలు రాశాయి. కేంద్ర పెద్దలతో సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఈ అంశాలను ప్రస్తావించడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని కోరారు. జలశక్తి శాఖ కార్యదర్శి ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఎజెండా గెజిట్ నోటిఫికేషన్ అమలు గురించేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే, గెజిట్ ప్రకారం బోర్డుల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతి బోర్డుకు చెరొక రూ.200 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ డిపాజిట్ చేయలేదు. ఈ అంశం గురించి అధికారులు జలశక్తి శాఖ కార్యదర్శి వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది.

గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశంపై ఓవైపు సమీక్ష జరుపుతూనే మరోవైపు కేంద్రం రెండు బోర్డులకు ఇద్దరేసి చీఫ్ ఇంజనీర్లను నియమించింది. తద్వారా గెజిట్‌లో ప్రస్తావించిన తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులన్నీ పూర్తిచేయాలని భావిస్తోంది. గెజిట్ ప్రకారం బోర్డుల పరిధి పెరిగినందున, బోర్డులో అధికారులు, సాంకేతిక సిబ్బంది సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ మేరకు సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ గ్రూప్-ఏ సర్వీసు నుంచి చీఫ్ ఇంజనీర్ ర్యాంకులో ఉన్న అధికారులను రెండు బోర్డులకు కేటాయించింది. గోదావరి నది యాజమాన్య బోర్డుకు ఢిల్లీలో పనిచేస్తున్న డా. ఎంకే సిన్హా, జీకే అగర్వాల్‌ను కేటాయించగా, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు కోయంబత్తూరులో పనిచేస్తున్న టీకే శివరాజన్, లక్నోలో పనిచేస్తున్న అనుపమ్ ప్రసాద్‌లను నియమించింది. తక్షణమే ఈ నలుగురూ సంబంధిత బోర్డు చైర్మన్లకు రిపోర్టు చేసి విధుల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నలుగురూ ఫుల్-టైమ్ ప్రాతిపదికన బోర్డులో పనిచేయాలని జలశక్తి శాఖ స్పష్టం చేసింది. అయితే జీతభత్యాలు మాత్రం వారు ప్రస్తుతం పనిచేస్తున్న విభాగాల నుంచే పొందుతారని ఆదేశాల్లో పేర్కొంది.

Read Also…  ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాడు.. సాగు బాట పట్టాడు.. ఇప్పుడు సంవత్సరానికి 40 లక్షలు సంపాదిస్తున్నాడు..