UAE’s travel guidelines: సాధారణంగా పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. ఏ దేశానికైనా సులువుగా వెళ్లి రావొచ్చు.. ఆయా దేశాల్లో అడుగుపెట్టాలన్నా, నివాసం ఉండాలన్నా.. అక్కడి ప్రభుత్వం ఇచ్చే వీసా మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా ఒకత్తైతే.. పాస్ పోర్టుపై ఒక పదం పేరు ఉంటే మాత్రం తమ దేశంలోకి ఎంట్రీ ఉండదని.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పష్టంచేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల ప్రవేశ నిబంధనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇటీవల కీలక మార్పులు చేసింది. యూఏఈ (UAE) అంతర్జాతీయ ప్రయాణికుల ప్రవేశ నియమాలను మార్చడంతోపాటు.. నవంబర్ 21 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి భారతీయ విమానయాన సంస్థలు.. యూఏఈ తాజా మార్పుల గురించి ప్రయాణికులకు తెలియజేస్తూ ప్రకటనలను సైతం విడుదల చేశాయి. పాస్‌పోర్టుపై పూర్తి పేరు లేకుండా కేవలం ఒక పదంతో.. మాత్రమే పేరు ఉండే వారిని తమ దేశంలోకి అనుమతించబోమని అన్ని విమానయాన సంస్థలకు స్పష్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త మార్గదర్శకాలు నవంబరు 21 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎయిరిండియా, ఇండిగో ప్రయాణికులకు సమాచారమిచ్చాయి.
యూఈఏ నిబంధనల ప్రకారం.. టూరిస్టు లేదా ఇతర రకాల వీసాదారులైనా పాస్‌పోర్టుపై పూర్తి పేరు లేకుండా ఒకే పదంతో పేరు ఉంటే వారిని యూఏఈలోకి అనుమతించరని భారత ఎయిర్‌లైన్లు వేర్వేర్లు ప్రకటనల్లో తెలిపాయి. పాస్‌పోర్టుపై ఒకే పదంతో పేరు ఉండే వారికి యూఏఈ వీసాలు జారీ చేయడం లేదని.. ఒకవేళ అలాంటి పాస్‌పోర్టుదారులకు ఇప్పటికే వీసా జారీచేసినప్పటికీ.. అరబ్ దేశ ఇమ్మిగ్రేషన్ విభాగం అనుమతించట్లేదని విమానయాన సంస్థలు ప్రయాణికులకు స్పష్టంచేశాయి.
ఈ కొత్త నిబంధన విజిట్ వీసా, వీసా ఆన్ అరైవల్, ఉపాధి లేదా తాత్కాలిక వీసాదారులకు వర్తిస్తుందని ఎయిర్ లైన్లు వెల్లడించాయి. యూఏఈలో శాశ్వత లేదా నివాస హోదా ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదని పేర్కొన్నాయి. శాశ్వత/నివాస హోదా ఉన్నవారికి పాస్‌పోర్టుపై ఒకే పదంతో పేరు ఉంటే.. అదే పేరును “first name” లేదా “surname’’ కాలమ్‌లో అప్‌డేట్ చేసుకోవాలని విమానయాన సంస్థలు వెల్లడించాయి. ఈ నిబంధన గురించి పలు భారత ఎయిర్‌లైన్లు ప్రయాణికులకు పలు సూచనలు కూడా చేశాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..