Kashmir: తుపాకుల మోతతో ఉలిక్కిపడుతున్న కశ్మీర్.. నాలుగు రోజుల్లో ముగ్గురు పౌరులు మృతి..

మంచు కొండల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మైనార్టీలు, వలస కూలీలను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు పౌరులు చనిపోవడం సంచలనంగా మారింది...

Kashmir: తుపాకుల మోతతో ఉలిక్కిపడుతున్న కశ్మీర్.. నాలుగు రోజుల్లో ముగ్గురు పౌరులు మృతి..
Jammu And Kashmir
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 18, 2022 | 1:34 PM

మంచు కొండల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మైనార్టీలు, వలస కూలీలను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు పౌరులు చనిపోవడం సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితం ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపగా.. తాజాగా మరో ఇద్దరు వలస కూలీలు ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున షోపియాన్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిద్దరూ ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ ప్రాంతానికి చెందిన రామ్ సాగర్, మోనిశ్ కుమార్ గా గుర్తించారు. కాగా.. షోపియాన్‌లోని హర్మెన్‌ ప్రాంతంలో వీరు నివాసముంటున్న ఇంటిపై ఉగ్రవాదులు గ్రనేడ్‌ విసిరారు. ఈ దుర్ఘటనలో వీరిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఘటన సమచారం అందుకున్న పోలీసులు.. హర్మెన్‌ ప్రాంతంలో కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టారు. టెర్రరిస్టుల కోసం గాలించారు. ఈ సోదాల్లో లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్‌ ఉగ్రవాది ఇమ్రాన్‌ బషీర్‌ గనీని అరెస్టు చేశారు. కూలీలపైకి గ్రనేడ్‌ విసిరింది అతనే అని నిర్ధరించారు. అయితే.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌ అదనపు డీజీపీ విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసుల బృందాలు ముమ్మరంగా చెకింగ్స్ చేపట్టారు.

కాగా.. భారత్ – పాకిస్తాన్ సరిహద్దులోని అమృత్ సర్ లో డ్రోన్ సంచారం కలకలం రేపింది. ఇంటర్నేషనల్ బోర్డర్ కు సమీపంలో డ్రోన్ కనిపించడం సంచలనంగా మారింది. వెంటనే అలర్ట్ అయిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక డ్రోన్‌ను కూల్చివేసింది. దానిని క్వాడ్-కాప్టర్ డ్రోన్ గా అధికారులు గుర్తించారు. ఈ సరిహద్దులో గత మూడు రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది కావడం గమనార్హం. డ్రోన్ ద్వారా రవాణా చేసిన వస్తువులు, పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి