త్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బిల్లును ఆమోదించజేసేందుకు పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. ముస్లిం మహిళల రక్షణ కోసం కొత్తగా రూపొందించిన ఈ బిల్లును గత నెలలోనే సభలో ప్రవేశపెట్టినప్పటికీ.. విపక్షాల వ్యతిరేకతతో చర్చ జరగలేదు. ఈ సారి పూర్తిస్థాయి చర్చ జరిపి ఆమోద ముద్ర వేయించాలని ప్రభుత్వం చూస్తోంది.
మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక పార్లమెంట్ తొలిసెషన్‌లో లోక్‌సభ ముందుకు తీసుకువచ్చిన మొదటి బిల్లు ఇది. అయితే పలు విపక్ష పార్టీలు బిల్లును వ్యతిరేకించగా.. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశాయి.
ఇందుకు సమాధానంగా లింగసమానత్వం, సామాజిక న్యాయం జరిగేలా బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్‌సభలో పూర్తి మోజారిటీ ఉన్న నేపథ్యంలో బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. కానీ రాజ్యసభలో సరిపడ సంఖ్యా బలం లేకపోవడం… బిల్లుపై విపక్షాలు వ్యతిరేకిస్తుండటం చూస్తే.. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించడం అంత సులువు కాదన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.