కన్యత్వపొర చిరిగిపోతే బాధితురాలిని తప్పుబట్టలేం.. అత్యాచార కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు..
అత్యాచార కేసుల్లో నిందితులు తప్పించుకోవడానికి వైద్య నివేదికలను, బాధితురాలి వ్యక్తిత్వాన్ని అడ్డం పెట్టుకునే పద్ధతికి అలహాబాద్ హైకోర్టు గట్టి చెక్ పెట్టింది. మెడికల్ రిపోర్టులో హైమెన్ చిరిగిపోయి ఉందని తేలినంత మాత్రాన.. బాధితురాలు తప్పుడు సాక్ష్యం చెబుతోందని అర్థం కాదని కోర్టు తేల్చి చెప్తూ 44 ఏళ్ల నాటి కేసులో కీలక తీర్పు ఇచ్చింది.

అత్యాచార కేసు విచారణలో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాధితురాలి సాక్ష్యం పూర్తిగా నమ్మేదిగా ఉన్నప్పుడు.. కేవలం ఆమె మెడికల్ రిపోర్టులో హైమెన్ చిరిగిపోయి ఉందనే కారణంతో నిందితుడికి బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద రిలీఫ్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు అత్యాచారం అనేది ఒక చట్టపరమైన పదం, వైద్యపరమైన పదం కాదు అని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు దాదాపు 44 ఏళ్ల క్రితం జరిగిన ఒక అత్యాచార కేసులో నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను హైకోర్టు సమర్థించింది.
అసలేం జరిగిందంటే..?
ఉత్తరప్రదేశ్ అలహాబాద్ పరిధిలోని ఒక గ్రామంలో 1982వ సంవత్సరంలో 15 ఏళ్ల నిరక్షరాస్యురాలైన బాలిక ఉదయం వేళ పొలానికి వెళ్లినప్పుడు రాకేష్ అనే వ్యక్తి, మరో వ్యక్తితో కలిసి ఆమెను అడ్డుకుని అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై ఘోరంగా దాడి చేశారు. 1983 మే నెలలో అడిషనల్ సెషన్స్ జడ్జి ఈ ఇద్దరు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు రాకేష్ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు.
నిందితుడి తరఫు లాయర్ విచిత్ర వాదన..
ఈ అప్పీల్ విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది మెడికల్ రిపోర్టును ప్రస్తావిస్తూ వింత వాదనను లేవనెత్తారు. బాధితురాలి వైద్య పరీక్షల్లో ఆమె హైమెన్ ముందే చిరిగిపోయి ఉన్నట్లు తేలిందని, దీన్ని బట్టి ఆమెకు ఇదివరకే ఇతరులతో శారీరక సంబంధాలు ఉన్నాయని వాదించారు. అందువల్ల తన క్లయింట్ అత్యాచారం చేయలేదని నమ్మడానికి ఇది ఒక ఆధారమని కోర్టుకు విన్నవించారు.
నిందితుడి వాదనను తిప్పికొట్టిన హైకోర్టు..
జస్టిస్ సంతోష్ రాయ్‌తో కూడిన ధర్మాసనం నిందితుడి తరఫు న్యాయవాది చేసిన హైపర్ టెక్నికల్ వాదనలను, బాధితురాలి క్యారెక్టర్‌ను తప్పుబట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని శాస్త్రీయ మరియు సామాజిక విషయాలను స్పష్టం చేసింది. హైమెన్ చిరిగిపోవడానికి అనేక కారణాలు ఉంటాయని తెలిపింది. క్రీడల్లో పాల్గొనడం, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, గుర్రపు స్వారీ, కఠినమైన శారీరక శ్రమ లేదా ప్రమాదవశాత్తూ జరిగే గాయాల వల్ల కూడా హైమెన్ చిరిగిపోయే అవకాశం ఉందని జస్టిస్ సంతోష్ రాయ్ తెలిపారు. అంతేకాకుండా కొంతమంది మహిళలు పుట్టుకతోనే హైమెన్ లేని స్థితితో జన్మిస్తారని, మరికొందరిలో అది చాలా సాగే గుణాన్ని కలిగి ఉంటుందని కోర్టు గుర్తుచేసింది. అందువల్ల ఇటువంటి వైద్యపరమైన అంశాలు బాధితురాలి చెప్పిన సాక్ష్యాన్ని అధిగమించలేవని స్పష్టం చేసింది. అత్యాచారం వంటి నేరాలు సాధారణంగా రహస్య వాతావరణంలో జరుగుతాయని కాబట్టి అక్కడ స్వతంత్ర ప్రత్యక్ష సాక్షులు దొరికే అవకాశం ఆచరణాత్మకంగా ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది.‘‘ఒకవేళ బాధితురాలి హైమెన్ చిరిగిపోయి ఉన్నప్పటికీ.. అత్యాచారం జరిగిందనే ఆమె స్టేట్‌మెంట్ పూర్తిగా నమ్మదగినదిగా ఉన్నప్పుడు, కేవలం ఆ ఒక్క కారణంతో నిందితుడికి ఊరట ఇవ్వలేం. రేప్ అనేది చట్టపరమైన పదం, మెడికల్ పదం కాదు. కాబట్టి డాక్టర్ ఇచ్చిన అభిప్రాయాన్ని బట్టి నిందితుడు తప్పు చేయలేదని నిర్ధారించలేం” అని కోర్టు తేల్చి చెప్పింది.
బెయిల్ రద్దు.. 10 రోజుల్లో లొంగిపోవాలని ఆదేశం..
ఇంతకాలం బెయిల్‌పై బయట ఉన్న నిందితుడు రాకేష్ బెయిల్ బాండ్లను హైకోర్టు తక్షణమే రద్దు చేసింది. అతను మిగిలిన శిక్షా కాలాన్ని అనుభవించడానికి వీలుగా రాబోయే 10 రోజుల్లోగా ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని సంచలన ఆదేశాలు జారీ చేస్తూ అప్పీల్‌ను కొట్టివేసింది.
