150 ఏళ్ల మిస్టరీ.. కీబోర్డ్‌పై అక్షరాలు వరుసగా ఎందుకు ఉండవో తెలుసా..?
మీరు రోజుకు ఎన్ని వందల మెసేజ్‌లు టైప్ చేసినా.. మీ కీబోర్డ్‌లో దాగున్న ఈ చిన్న టెక్ మిస్టరీని ఎప్పుడైనా గమనించారా? అసలు కీబోర్డ్ తయారు చేసినవాళ్లు అక్షరాలన్నింటినీ ఆర్డర్‌లో పెట్టకుండా ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేశారు? దీనికి కారణం సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో లేదు, 150 ఏళ్ల క్రితం నాటి టైప్‌రైటర్ల కాలంలో ఉంది. ఆ సీక్రెట్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మనం ప్రతిరోజూ కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు లేదా మొబైల్స్‌లో టైప్ చేయడానికి కీబోర్డ్‌లను ఉపయోగిస్తుంటాం. అయితే కీబోర్డ్‌పై అక్షరాలు A, B, C, D.. అని వరుసగా లేకుండా ‘Q, W, E, R, T, Y.. అంటూ ఎందుకు చెల్లాచెదురుగా ఉంటాయని మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా? అక్షరాలు వరుసగా ఉంటే టైప్ చేయడం మరింత సులువు అవుతుంది కదా మరి ఎందుకు ఇలా మార్చారు? దీనికి సమాధానం ఇప్పటి సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో లేదు. దీని వెనుక 150 సంవత్సరాల నాటి టైప్‌రైటర్ల ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న ఈ ‘QWERTY’ కీబోర్డ్ డిజైన్‌ను 1870వ దశాబ్దంలో క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ అనే వ్యక్తి రూపొందించారు. టైప్‌రైటర్లు కొత్తగా కనిపెట్టిన ప్రారంభ రోజుల్లో, కీబోర్డ్‌పై అక్షరాలన్నీ మనం అనుకున్నట్లే ABCD వరుసలోనే ఉండేవి. కానీ అలా ఉంచడం వల్ల ఒక పెద్ద సమస్య ఎదురైంది.
కీబోర్డ్ అక్షరాలను ఎందుకు మార్చాల్సి వచ్చింది?
అక్షరాలు వరుసగా ఉన్నప్పుడు, ప్రజలు చాలా వేగంగా టైప్ చేయడం ప్రారంభించారు. అలా వేగంగా టైప్ చేస్తున్నప్పుడు, కీబోర్డ్ లోపల ఉండే మెకానికల్ కీస్ ఒకదానితో ఒకటి తగిలి, మధ్యలోనే ఇరుక్కుపోయేవి. దీనివల్ల టైప్‌రైటర్లు తరచూ పాడైపోయేవి. ఈ మెకానికల్ సమస్యను పరిష్కరించడానికి క్రిస్టోఫర్ షోల్స్ తన సహచరులైన కార్లోస్ గ్లిడెన్, అమోస్ డెన్స్‌మోర్‌లతో కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. ఇంగ్లీషులో తరచుగా కలిపి వాడే అక్షరాలను ఒకేచోట ఉంచకుండా కీబోర్డ్‌లో వేర్వేరు దిశల్లో దూరదూరంగా అమర్చారు. దీనివల్ల ఒక అక్షరం టైప్ చేసిన తర్వాత మరో అక్షరం టైప్ చేయడానికి మెకానికల్ కీ కొంత దూరం నుండి ప్రయాణించాల్సి వచ్చేది. ఇది టైపింగ్ వేగాన్ని కొద్దిగా తగ్గించి, కీస్ ఒకదానికొకటి తగలకుండా కాపాడింది. అలా పుట్టిందే ఈ QWERTY డిజైన్. దీనికి 1878లో పేటెంట్ కూడా లభించింది. రెమింగ్టన్ నంబర్ 2 అనే మొట్టమొదటి కమర్షియల్ టైప్‌రైటర్‌లో ఈ విధానాన్ని ఉపయోగించడంతో ఇది ప్రపంచవ్యాప్త ప్రామాణికంగా మారిపోయింది.
కంప్యూటర్లు వచ్చినా ఈ పాత పద్ధతిని ఎందుకు మార్చలేదు?
కంప్యూటర్లు వచ్చాక మెకానికల్ కీస్ జామ్ అయ్యే సమస్య పూర్తిగా తొలగిపోయింది. అయినా కూడా మనం కీబోర్డ్ డిజైన్‌ను ఎందుకు మార్చలేదు? దానికి ఒకే ఒక్క కారణం అలవాటు. ప్రజలు అప్పటికే QWERTY స్టైల్‌లో టైప్ చేయడానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. కాబట్టి కంప్యూటర్ కీబోర్డులు తయారు చేసినప్పుడు కూడా పాత డిజైన్‌నే కొనసాగించారు. కాలక్రమేణా.. ఈ డిజైన్‌కు అదనంగా ఫంక్షన్ కీలు, యారో కీలు, నంబర్ ప్యాడ్‌లను జోడించారు. ఆ తర్వాత కాలంలో వేగంగా టైప్ చేయడానికి వేళ్ల అలసటను తగ్గించడానికి డ్వోరాక్, కోల్‌మాక్ వంటి అనేక సులువైన కీబోర్డ్ డిజైన్లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. అప్పటికే సింహాసనం వేసుకుని కూర్చున్న QWERTY ఆధిపత్యాన్ని ఏదీ మార్చలేకపోయింది.
