బొద్దింకను చూసి అమ్మాయిలు ఎందుకు భయపడతారు..? సైకాలజీ ఏం చెప్పేది తెలిస్తే అవాక్కే..
ఇంట్లో పాము కనిపిస్తే భయపడటంలో ఒక అర్థం ఉంది కానీ.. ఒక చిన్న బొద్దింక కనిపిస్తే చాలు, ఇల్లంతా తలకిందులు చేసేలా కేకలు వేస్తుంటారు చాలామంది అమ్మాయిలు.అసలు ఈ చిన్న ప్రాణిని చూస్తే మహిళలకు ఎందుకంత భయం, అసహ్యం కలుగుతాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ కారణాలు ఏంటీ..? అనేది తెలుసుకుందాం..

ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయం ఉండటం సహజం. కొంతమందికి చీకటి అంటే భయం, కొందరికి ఎక్కువ ఎత్తులు, మరికొందరికి నీళ్లన్నా, పాములన్నా భయం వేస్తుంది. అయితే మన ఇళ్లలో సాధారణంగా కనిపించే ఒక చిన్న జీవిని చూసి చాలామంది మహిళలు గట్టిగా కేకలు వేసి పారిపోతుంటారు.. అదే బొద్దింక. పరిమాణంలో చాలా చిన్నగా ఉండే ఈ జీవిని చూసినప్పుడు కొందరు భయంతో వణికిపోతారు కూడా. అసలు బొద్దింకలంటే మహిళలకు ఎందుకంత భయం? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో సైకాలజీ ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ భయానికి ఒక పేరుంది
సైకాలజీ ప్రకారం.. బొద్దింకల పట్ల ఉండే విపరీతమైన భయాన్ని కత్సరిడాఫోబియా అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో కనిపించే ఒక రకమైన ఫోబియా. ఈ ఫోబియా ఉన్నవారు బొద్దింకను చూడగానే వారి శరీరంలో తెలియకుండానే కొన్ని ప్రతిచర్యలు జరుగుతాయి. చేతులు, పాదాలు చల్లబడటం, విపరీతంగా చెమటలు పట్టడం, గుండె వేగం పెరగడం, కొన్ని క్షణాల పాటు ఏం చేయాలో పాలుపోని స్థితికి వెళ్ళిపోవడం జరుగుతుంది.
భయం ఒక తరం నుండి మరో తరంలా..
సైకాలజీ ప్రకారం.. ఈ భయం చాలావరకు బాల్యంలోనే మొదలవుతుంది. చిన్న పిల్లలు తమ చుట్టూ ఉన్న పెద్దల ప్రవర్తనను చూసే విషయాలను నేర్చుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు బొద్దింకను చూసి భయపడటం, కేకలు వేయడం గమనించినప్పుడు.. ఆ జీవి చాలా ప్రమాదకరమైనదనే భావన పిల్లల ఉపచేతన మనస్సులో బలంగా నాటుకుపోతుంది. క్రమంగా అది భయంగా మారి, పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది.
అమ్మాయిలలో ఈ భయం ఎక్కువగా ఉండటానికి కారణాలు..
పరిశుభ్రతపై పెరిగే శ్రద్ధ: సామాజికంగా అమ్మాయిలకు చిన్న వయస్సు నుంచే ఇల్లు, పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నేర్పిస్తారు. బొద్దింకలు సాధారణంగా మురుగు కాలువలు, అపరిశుభ్ర ప్రదేశాలలో నివసిస్తాయి కాబట్టి ఆ మురికి జీవుల పట్ల అమ్మాయిలకు సహజంగానే తీవ్రమైన అసహ్యం, ప్రతికూల స్పందన ఏర్పడతాయి.
వాటి విచిత్రమైన శారీరక ప్రవర్తన: బొద్దింకల జిడ్డు చర్మం, చాలా వేగంగా పారిపోయే అలవాటు, అకస్మాత్తుగా గెంతి శరీరంపై వాలే స్వభావం ఎవరికైనా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా కొన్ని బొద్దింకలు అనుకోకుండా ఎగరడం వల్ల తీవ్రమైన ఆందోళన, భయం కలుగుతాయి.
ఆరోగ్య ముప్పు: బొద్దింకలు నేరుగా పాముల్లా కాటు వేయకపోయినప్పటికీ, అవి ఎన్నో ప్రమాదకర క్రిములను మోసుకొస్తాయి. వాటి శరీరంలో ఉండే అలెర్జీ కారకాలు ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ముప్పు కూడా మనస్సులో ఒక తెలియని భయాన్ని కలిగిస్తుంది.
భయపడే వారిని చూసి నవ్వకండి..
బొద్దింకలకు భయపడే వారిని చూసి ఎగతాళి చేయడం లేదా తక్కువగా చూడటం అస్సలు చేయకూడదని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారు కావాలని చేసే పని కాదు. అది వారి మెదడు యొక్క సహజ రక్షణ యంత్రాంగం. బొద్దింకను చూడగానే శరీరం దానిని ఒక ప్రమాద సంకేతంగా భావించి అలా స్పందిస్తుంది. ఈ భయం నుండి బయటపడటం అసాధ్యమేమీ కాదు. సరైన కౌన్సెలింగ్ ద్వారా క్రమంగా మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం ద్వారా ఈ ఫోబియాను పూర్తిగా తగ్గించుకోవచ్చు.
