AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. మరో వికెట్ డౌన్.. టీఎంసీకి రాజ్యసభ ఎంపీ, గిరిజన నేత గుడ్‌బై..!

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి గిరిజన నేత ప్రకాష్ చిక్ బరాయిక్ రాజీనామా చేశారు. దీంతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే టీఎంసీ మూడో కీలక నేతను కోల్పోయింది. ఇప్పటికే సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే..!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. మరో వికెట్ డౌన్.. టీఎంసీకి రాజ్యసభ ఎంపీ, గిరిజన నేత గుడ్‌బై..!
Prakash Chik Baraik, Mamata Banerjee
Balaraju Goud
|

Updated on: Jun 11, 2026 | 12:19 PM

Share

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి గిరిజన నేత ప్రకాష్ చిక్ బరాయిక్ రాజీనామా చేశారు. దీంతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే టీఎంసీ మూడో కీలక నేతను కోల్పోయింది. ఇప్పటికే సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బల తర్వాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. గురువారం (జూన్ 11)మరో రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్ బరైక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అధికారికంగా సమర్పించనున్నట్లు తెలిపారు.

తన రాజీనామా లేఖలో ప్రకాష్ చిక్ బరైక్, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన కాలంలో అందించిన సహకారం, మద్దతుకు డిప్యూటీ చైర్మన్‌తో పాటు రాజ్యసభ సచివాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే రాజీనామాకు గల కారణాలపై స్పష్టత ఇవ్వలేదు. రాజీనామా అనంతరం ప్రకాష్ చిక్ బరాయిక్ బీజేపీ సీనియర్ నేత నిషికాంత్ దూబే నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీ తోటల పేద కార్మికుల హక్కులు, పీఎఫ్ సమస్యలు, సామాజిక సంక్షేమ అంశాలపై పార్లమెంట్‌లో నిరంతరం గళం విప్పిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన తదుపరి రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది.

ఇదే సమయంలో టీఎంసీకి చెందిన మరో ప్రముఖ నేత, రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ కూడా పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మను కలవడంతో ఆమె త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన సుష్మితా దేవ్ 2021లో టీఎంసీలో చేరి రెండుసార్లు రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. అయితే రెండో పదవీకాలం పూర్తికాకముందే రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక జూన్ 8న టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ కూడా రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో అవినీతి, మహిళల భద్రత, విద్య, ఆరోగ్యం, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి వంటి రంగాల్లో వైఫల్యాల కారణంగా ప్రజలు టీఎంసీని తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు.

వరుస రాజీనామాలతో టీఎంసీలో అంతర్గత సంక్షోభం తీవ్రతరమవుతుండగా, టీఎంసీ-కాంగ్రెస్ విలీనంపై కూడా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తిరుగుబాటు నేతలు ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఈ పరిణామాలు బెంగాల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us