OTT: ఓటీటీల్లో అశ్లీల కంటెంట్‌పై కేంద్రం నజర్‌.. ఫిర్యాదుల పరిష్కారానికి మూడంచెల సెన్సార్‌ వ్యవస్థ

ఓటీటీల్లోని అశ్లీల, అసభ్యకర కంటెంట్‌ నిషేధానికి కేంద్రం చర్యలు చేపడుతోంది. ఓటీటీ కంటెంట్‌పై కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశానికి సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర సహా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు.

OTT: ఓటీటీల్లో అశ్లీల కంటెంట్‌పై కేంద్రం నజర్‌.. ఫిర్యాదుల పరిష్కారానికి మూడంచెల సెన్సార్‌ వ్యవస్థ
Censor To Ott
Follow us
Basha Shek

|

Updated on: Apr 18, 2023 | 9:02 AM

ఈ మధ్య కొన్ని ఓటీటీల్లో సినిమాల్లో చూస్తున్నారా? కొన్నింట్లో అయితే డైలాగ్‌ డైలాగ్‌కీ బూతులు, సీన్ సీన్‌కి అశ్లీలం. ఇంట్లోనే కదా.. ఫ్యామిలీతో కూర్చుని ఓ సినిమా చూద్దాం అనే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితం పోటెత్తుతున్న ఫిర్యాదులు. అందుకే ఓటీటీల్లో అశ్లీల కంటెంట్‌ కన్నేసింది కేంద్రం. ఇకపై నా సినిమా నా ఇష్టం అంటే కుదిరేలా లేదు. మూడంచెల సెన్సార్‌కు సిద్ధమవుతోంది. ఓటీటీల్లోని అశ్లీల, అసభ్యకర కంటెంట్‌ నిషేధానికి కేంద్రం చర్యలు చేపడుతోంది. ఓటీటీ కంటెంట్‌పై కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశానికి సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర సహా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఓటీటీ కంటెంట్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కన్నేసింది. ఓటీటీ వెబ్ సిరీస్‌లలో అశ్లీలం పెరిగిపోవడంపై కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటీటీల్లో పెరుగుతున్న అశ్లీలత, భారతీయ సంస్కృతిపై దుష్ప్రభావం చూపుతోందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

మూడంచెల వ్యవస్థ..

ఇక.. ఓటీటీ కంటెంట్‌ విషయంలో సోనీ లివ్‌పై 4063, అమెజాన్ ప్రైమ్‌ పై 3203, నెట్‌ఫ్లిక్స్ పై 401 ఫిర్యాదులు అందాయని కమిటీకి సమాచారం అందింది. డిస్నీ హాట్‌స్టార్‌ ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించలేదని కమిటీ వెల్లడించింది. తదుపరి సమావేశంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, సోనీ లివ్ వంటి పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను పిలిచి వారి స్టాండ్‌ను తెలుసుకోవాలని కమిటీ భావిస్తోంది. OTT ప్లాట్‌ఫామ్‌లపై సెన్సార్‌షిప్‌ కానీ.. మరింత నియంత్రణ కానీ ఉండాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. మరోవైపు.. ఓటీటీలు బహిరంగ వేదికలని కమిటీలోనున్న ప్రతిపక్ష ఎంపీలు వాదించారు. ఓటీటీ కంటెంట్ తమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందన్న ఎంపీల ప్రశ్నలకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు సమాధానం ఇచ్చారు. ఫిర్యాదుల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థను రూపొందించినట్టు వెల్లడించారు. మొదట ప్రచురణకర్త స్థాయిలో, తరువాత స్వీయ నియంత్రణ, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నియంత్రణ ఉండేలా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా.. ఓటీటీల్లోని అశ్లీల కంటెంట్‌కు చెక్‌ పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా గట్టిగా వాదిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం  క్లిక్ చేయండి