Akshaya Tritiya: అక్షయ తృతీయ సందర్భంగా దేశ వ్యాప్తంగా జ్యువెలరీ షాప్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా ప్రభావంతో గత రెండేళ్లు (2020, 2021) గా ఆక్షయ తృతీయ కళ తప్పింది. జ్యువలరీ షాప్‌లలో బంగారు ఆభరణాల విక్రయాలు అంతంత మాత్రంగానే జరిగాయి. అయితే ఇప్పుడు కరోనా ఉధృతి గణనీయంగా తగ్గడంతో విక్రయదారులు ఈ యేటి అక్షయ తృతీయ విక్రయాలపై భారీ ఆశలే పెట్టుకున్నారు. వారి అచనాలకు తగినట్లే వినియోగదారులు స్వయంగా జ్యువెలరీ షాప్‌లకు వస్తున్నారు. తమ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ బంగారు ఆభరణాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఇవాళ (మే 3న) 2019నాటి స్థాయిని మించి దేశంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు జరగొచ్చని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 2019లో దేశ వ్యాప్తంగా అక్షయ తృతీయనాడు 15-18 టన్నుల బంగారు ఆభరణాలు అమ్మడుపోయాయని మార్కెట్ వర్గాల అంచనా. 2020లో కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా అక్షయ తృతీయ సందర్భంగా పెద్దగా కొనుగోళ్లు లేవు. 2021లో కొనుగోళ్లు కొంతమేర పెరిగినా.. మార్కెట్ వర్గాలు సంతృప్తి చెందలేదు. 2019 అక్షయ తృతీయ తర్వాత 2019 దీపావళి సీజన్‌లోనే కొనుగోళ్లు కాస్త సంతృప్తినిచ్చాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఇవాళ(మే 3) దేశంలో 20 టన్నులకు పైగా బంగారు ఆభరణాల కొనుగోళ్లు జరుగుతాయని అంచనావేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఒక టన్ను, మిగితా రాష్ట్రంలో మరో టన్ను బంగారు ఆభరణాలు కొనుగోళ్లు జరుగుతాయని అంచనా.
గత రెండేళ్లుగా వాయిదాపడిన పెళ్లిళ్లు, వేడుకలు ఈ ఏడాది జరుగుతుండటంతో బంగారు ఆభరణాల కొనుగోళ్లు భారీగా ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవహారాలు గాడిలో పడటం కూడా బంగారం విక్రయాలపై సానుకూల ప్రభావాన్ని చూపొచ్చని భావిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో బంగారం ధర గణనీయంగా పెరగడం మాత్రం వినియోగదారులను కాస్త నిరాశపరిచే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52 వేలకు ఎగువున ఉంది. అక్షయ తృతీయపై దేశ ప్రజల్లో ఉన్న బలమైన సెంటిమెంట్ కారణంగా ఈ ప్రతికూల అంశం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అంటున్నారు.
మారిన ట్రెండ్‌కు అనుగుణంగా గతంతో పోలిస్తే సరికొత్త డిజైన్లలో బంగారు ఆభరణాలను జ్యువెలరీ షాప్‌లలో అందుబాటులోకి తెచ్చారు. బంగారు ఆభరణాలతో పాటు వెండి, ప్లాటినం, డైమండ్స్ ఆభరణాలను సైతం కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అటు డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు సైతం మంచి స్పందన లభిస్తోంది.
అక్షయ తృతీయకు సంబంధించి మరిన్ని వార్తలు ఇక్కడ చదవండి..
Also Read..
YS Jagan: ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లింపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
Viral Video: వేగంగా దూసుకొస్తున్న కారు..ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం..వైరల్ ..వీడియో