Robbery: తమిళనాడులో వింత దొంగతనం జరిగింది. ఇంట్లో అందరూ ఉండగానే తెగబడ్డ దొంగలు ఎంచకా తమ పని చక్కబెట్టుకున్నారు. కాంచీపురంలోని ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు సీరియల్ చూస్తూ బిజీగా ఉన్నారు. అదేదో కొంపలంటుకునే కార్యం మాదిరి.. సౌండ్ తెగపెట్టేసుకున్నారట. ఇదే సమయంలో దొంగచాటుగా ఇంట్లోకి చొరబడిన ముగ్గురు సభ్యుల ముఠా ఇంట్లోని విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకెళితే.. కాంచీపురంలోని మారుతీ నగర్ కి చెందిన శ్రీనివాసన్ ఇంట్లో రెండు రోజుల క్రితం జరిగిన దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాత్రి 9 గంటల సమయంలో శ్రీనివాసన్ భార్య తన బంధువుతో కలిసి ఇంట్లో టీవీ సీరియల్ చూస్తోంది. హై వాల్యూమ్‌తో ఇంట్రెస్ట్ గా సీరియల్ చూస్తూ ఉండగా వెనుక భాగం నుండి వచ్చిన దొంగలు పైన బీరువాలో ఉన్న 44 తులాల బంగారం, కిలో వెండి, నగదు దొంగిలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. నిందితులు టూవీలర్‌పై ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఇద్దరు గేటు బయట కాపలా ఉండగా, మరో ఇద్దరు దొంగ చాటుగా లోపలికి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు.
ఇంట్లో అందరూ ఉండగా దొంగతనం జరగడంపై పోలీసులు విచారించగా, సీరియల్ చూస్తూ ఉన్నామని తమకు ఏమి తెలియలేదన్నారు. ఒక్క సారిగా శబ్దం రావడంతో పైకి వెళ్లి చూడగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో బెదిరించి బయటికి వెళ్లిపోయారని శ్రీనివాసన్ భార్య పోలీసులకు తెలిపారు. సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు దొంగతనం చేసినట్టు అనుమానం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాసన్ బంధువులలో ఒకరే ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో సీరియల్ చూస్తూ ఉండగా దొంగలు ఇళ్లు గుల్ల చేయటం ఎంటనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read:
Best Vastu tips: సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఈ వాస్తు చిట్కాలను పాటించండి..
Andhra Pradesh: మెడలో నగలు ఉంటే పెన్షన్ రాదట.. అది నమ్మిన వృద్ధురాలి పరిస్థితి ఏమైందంటే..