ఎముకలు కొరికే చలి.. ఆక్సిజన్ లేక ఊపిరందక బేజారు.. శత్రు సైన్యం కాల్పులకు ప్రతిగా కాల్పులు జరపాల్సిన స్థితి.. సియాచిన్ గ్లేసియర్‌లో నిరంతరం కాపలా కాసే వేలాది మంది సైనికుల పరిస్థితి ఇది.
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రంలో మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు .. శత్రు శిబిరాల నుంచి దూసుకొచ్చే బుల్లెట్ల కన్నా ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు.. మంచు తుపాన్లు, హిమనీ నదాలు ఉన్న స్థలం. ఒకప్పుడు జమ్మూకాశ్మీర్‌లో ఓ భాగం సియాచిన్. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన లద్ధాక్‌లో అంతర్భాగమైంది. టిబెట్ భాష ‘బాల్టీ’లో సియాచిన్ అంటే ‘గులాబీ వనం’ అని అర్థం. భారత ఆధీనంలో ఉన్న సియాచిన్‌పై 40 ఏళ్ల కిందట పాకిస్తాన్ కన్ను పడింది. పర్వతారోహకులను పంపించడం మొదలుపెట్టిన పాక్ అహంకారానికి అడ్డుకట్ట వేయాలన్న భారత ఆర్మీ వ్యూహాత్మక ఎత్తుగడే ఆపరేషన్ మేఘ్‌దూత్. పాక్‌ను విస్మయానికి గురి చేస్తూ 15 వేల అడుగుల ఎత్తులో దాడి చేసి గ్లేసియర్‌పై కన్నెత్తి చూడకుండా చేయగలిగింది భారత సైన్యం.
కాంట్రవర్సీ ఎందుకు?
సియాచిన్ గ్లేసియర్ మొదటి నుంచీ వివాదాస్పదమే. దేశ విభజన సమయంలో వాస్తవాధీన రేఖకు అంచున మానవ మనుగడకు ఏ మాత్రం వీలు లేని సియాచిన్ ప్రాంతాన్ని అటు పాకిస్తాన్ కాని ఇటు ఇండియా గాని పట్టించుకోలేదు. 1949లో ఇండియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన కరాచీ ఒప్పందంలో రెండు దేశాలకు లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ)ను సరిహద్దుగా నిర్ణయించాయి. 23 వేల అడుగుల ఎత్తు 75 కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న సియాచిన్ గ్లేసియర్ భారత దేశానికే చెందిన భరత మాత నుదుటి కుంకుమ. NJ 9842 వరకు ఇండియా భూభాగం అంటూ మార్కింగ్ చేసిన తర్వాత అది తమ భూభాగమే అంటూ పాక్ మ్యాప్‌లో సైతం చేర్చడంతో ఇండియా అప్రమత్తమైంది. 1983లో విదేశీ పర్వతారోహకుల కోసం భారీ ఎత్తున ప్రత్యేక దుస్తులను జర్మనీ నుంచి పాక్ కొనుగోలు చేసినట్లు భారత ఇంటెలిజెన్స్ వింగ్ ‘రా’ గుర్తించింది. 1983లో జనరల్ జియా ఉల్ హక్ సైనికులకు మెషిన్‌గన్‌లు, మోర్టార్లు ఇచ్చి సియాచిన్‌కు పంపారు. కానీ భారత జవాన్లు వారికన్నా ముందే అక్కడికి చేరుకున్నారు. బుర్జిల్ ఫోర్స్ దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. 1984లో ఆపరేషన్ మేఘ్ దూత్‌తో విజయవంతమైన సైనిక చర్య చేయగలిగింది. ఆ తర్వాత 1999 వరకూ ఇరు పక్షాల మధ్య చర్యలు, ప్రతిచర్యలు సాగాయి. 2003లో ‘వాస్తవ మైదాన స్థానరేఖ’ను ఇరుపక్షాలు అంగీకరించి అక్కడ సైనిక స్థావరాలు నిర్మించుకున్నా మంచు ఖండం వంటి సియాచిన్ మీద భారత్ గాని, పాకిస్తాన్‌గాని తన స్థావరాలను తీసేయలేదు. ఇప్పటివరకూ భారత్ పాక్ సైనికులు దాదాపు 2000 మంది మరణించారని ఓ అంచనా. వారిలో అధికశాతం మంది కేవలం ప్రతికూల వాతావరణానికే మృత్యు ఒడిలోకి చేరారే కానీ సైనిక కాల్పుల్లో కాదు.
ఆపరేషన్ మేఘ్‌దూత్
1984 ఏప్రిల్ 13న ఆపరేషన్ మేఘ్‌దూత్ పేరిట సైనిక చర్య చేపట్టి పాక్ పన్నాగాన్ని వమ్ము చేసింది. ఆనాటి నుంచి 40 ఏళ్లుగా ఆ యుద్ధక్షేత్రం భారత్‌కు కంచుకోటలా మారింది. తొలినాళ్లలో అరకొర వసతులు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ భారత జవాన్లు చూపిన పోరాట పటిమ అనితరసాధ్యం. అప్పట్లో హై ఆల్టిట్యూడ్ వెల్ఫేర్ స్కూల్‌కి కమాండంట్‌గా ఉన్న కల్నల్ నరీందర్ “బుల్’ కుమార్ తన బృందంతో పర్వతారోహణం చేసి ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగా ముందుకు కదలిన భారత సైన్యం 18 వేల అడుగుల ఎత్తులో బిలాఫోండ్ లా ప్రాంతంలో భారత జెండాను రెపరెపలాడించింది. భారత వైమానిక దళానికి చెందిన చీతా, చేతక్ హెలికాప్టర్లు సామర్థ్యానికి మించి ఎత్తుకు ప్రయాణించి 300 మంది సైనికులను సామగ్రిని తరలించాయి. 1987 జూన్‌లో ఆపరేషన్ రాజీవ్‌లో భాగంగా భారత జవాన్లు 21,153 అడుగుల ఎత్తులో పాక్ అధీనంలో ఉన్న క్వైద్ పోస్ట్‌ను స్వాధీనం చేసుకున్నాయి. పరమ్‌వీర్ చక్ర గ్రహీత నైబ్ సుబేదార్ బణా సింగ్ పేరు మీద క్వైద్ పోస్ట్‌ను బణా పోస్ట్‌గా పేరు మార్చారు. 19 వేల అడుగుల ఎత్తులో భారత్ పాకిస్తాన్ స్థావరాల ఏర్పాటు ఎదురెదురుగా దర్శనమిస్తాయి. 20 వేల అడుగుల ఎత్తులో కేవలం భారత్ మాత్రమే బణా సింగ్ పోస్ట్ ను నెలకొల్పగలిగింది.
లెఫ్టనెంట్ కల్నల్ సలారియా నేతృత్వంలో ఏడుగురు ఆఫీసర్లు, 13 జెసీవోలు, 175 మంది జవాన్లు 1984 ఏప్రిల్ 12న సియాచిన్ గ్లేసియర్‌ను అధిరోహించారు. ఆ రోజున జరిగిన ఘటనల్ని గతంలో మీడియాతో ఆయన పంచుకున్నారు. ఆ రోజు ఆర్మీ తమకు ఇచ్చిన సాధారణ ఉన్ని దుస్తులనే ధరించి నడక మొదలపెట్టారు. 40 కేజీల బరువు మోస్తూనే రోజుకి 10 కి.మీ నడక సాగించామని సియాచిన్‌పై పీవోకే ఇంకా సియా లా ప్రాంతాల వైపు వారి పయనం సాగిందని చెప్పారు. ప్రయాణంలో వారు ఆరు క్యాంప్‌లను ఏర్పాటు చేశారు. టెర్షాన్ గ్లేసియర్ మీదుగా నడుస్తున్న సలారియా బృందానికి హెలికాప్టర్‌ల ద్వారా స్పెషల్ దుస్తులు అందాయట. అప్పుడు వాటిని ధరించి రేడియో సెట్‌లో సెక్టర్ కమాండర్ ఆదేశాలు పాటిస్తూ పైకి నడక సాగించారట. అప్పటికే హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సైనిక బృందాలు బిలాఫోండ్ లా, సియా లా పాస్‌లను ఆక్రమించాయన్న వార్త వచ్చిందని అవసరమైతే వారికి బ్యాకప్‌గా నిలుస్తూ పాక్ దాడులను తిప్పికొట్టేలా ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. 2003లో పదవీ విరమణ చేసిన కల్నల్ సలారియా ప్రస్తుతం పఠాన్‌కోట్‌లో శేషజీవితం గడుపుతున్నారు.
1984 సెప్టెంబర్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన హంటర్ ఫైటర్ విమానాలు లేహ్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి సియాచిన్‌కు చేరుకోవడం ప్రారంభించాయి. 12 వేల అడుగుల ఎత్తులో సియాచిన్ బేస్ క్యాంప్ వద్ద మోహరించిన సియాచిన్ బ్రిగేడ్ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తుంటారు. ఆపరేషన్ మేఘ్‌దూత్ తొలినాళ్లలో సైనికులకు ప్రత్యేక దుస్తుల కొరత తీవ్రంగా ఉండేది. తొమ్మిది జతల ఇంపోర్టెడ్ సాక్స్‌లు ఇచ్చేవారు. చలికి ఆ ఉన్ని సాక్స్ ఏ మాత్రం సరిపోయేవి కావు. మంచు కాటుకు గురై తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవారు. పహారాలో ఒంటరితరం, టిన్‌లో ఆహారం తినక, పొంచి ఉండే శత్రు భయంతో సైనికులు క్షణమొక యుగంలా గడిపేవారు. ఒకప్పుడు 100 మంది సైనికులలో 15 మందికి ‘హేప్’ వ్యాధి వచ్చేది. ఇప్పుడు వైద్యుల కృషి వల్ల ఆ సంఖ్య వంద మందిలో ఒకటికి తగ్గింది.
ప్రమాదంలో చనిపోయిన సైనికుల మృతదేహాలు లభ్యమయ్యేవి కావు. సియాచిన్‌లో 1984లో గల్లంతైన భారత జవాన్ చంద్రశేఖర్ హర్బోలా ఆచూకీ 38 సంవత్సరాల తరువాత లభించింది. అప్పట్లో 20 మంది జవాన్లు హిమపాతం కింద చిక్కుకుపోయారు. ఇక చనిపోయిన సైనికుల మృతదేహాలను తీసుకురావడమే పెద్ద సవాలు. సోనమ్ అనే గూర్ఖా రైఫిల్స్ సైనికుడు ‘హేప్’ వ్యాధితో మరణించగా అతని మృతదేహాన్ని బేస్ క్యాంప్‌కు తరలించేందుకు రెండు వారాలు పట్టింది. చలికి కట్టెలా బిగుసుకుపోయిన మృతదేహాన్ని చిన్న చేతక్ హెలికాప్టర్లలో తరలించడం కుదరక అధికారులు తాడుతో కట్టి హెలికాప్టర్‌కు వేలాడదీసి తరలించాల్సి వచ్చింది.
ఎత్తైన యుద్ధక్షేత్రంలో ఆధునిక సౌకర్యాలు
అతిశీతల సియాచిన్ వాతావరణంలో మోహరించిన సైనికులకు ఆహారం, ఇతర సరకుల రవాణా, బట్వాడా చాలా కష్టం. సియాచిన్‌ను మన దేశం కాపాడుకున్న ఈ 40 ఏళ్లలో సమస్యలను అధునాతన సాంకేతికతతో సాయుధ దళాలు అధిగమించగలిగాయి. ముఖ్యంగా గడచిన అయిదేళ్లలో పరిస్థితి విశేషంగా మెరుగైంది. ఎక్కువ బరువులను తీసుకెళ్లే హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో శీతాకాలంలో సైతం సైనికులకు నిత్యావసర సరకులను అందజేత, సైనికులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం సరఫరాకు భారత ప్రభుత్వం రోజుకు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పర్వతాలపై కనిపించే ఎత్తు పల్లాల్లో సులభంగా తిరగాడే అడ్వాన్స్డ్ టెర్రెన్ వెహికల్ ఏటీవీలను సమకూర్చారు. రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) లోయలను దాటడానికి తోడ్పడే ప్రత్యేక ఏటీవీ వంతెనలను ఏర్పాటు చేసింది. డైనీమా తాళ్లతో గుట్టల మధ్య తాళ్ల వంతెనలను కట్టి సరకులు తరలిస్తున్నారు. మైనస్ డిగ్రీల వాతావరణాన్ని తట్టుకునేలా ప్రత్యేక దుస్తులు, పర్వతారోహణ సామానుతో సైనికులు సులువుగా సంచరించే వీలు కల్పించారు. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే పాకెట్ వెదర్ ట్రాకర్లను ప్రతి సైనికుడికి అందించారు. ఉన్నట్టుండి మంచుపెళ్లలు విరిగిపడే ప్రమాదం గురించి అవి ముందే హెచ్చరిస్తాయి. డబ్బాల్లో నిల్వ చేసిన కూరగాయల బదులు తాజా కూరగాయలు, పండ్లను సియాచిన్‌కు పంపుతున్నారు. వీసాట్ టెక్నాలజీతో సైనికులకు అధునాతన మొబైల్, డేటా సౌకర్యాలను కల్పించారు. సైనికులకు, పర్యాటకులకు ఆరోగ్య సేవలు అందించడానికి ఇస్రో సంస్థ టెలిమెడిసిన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సముద్రమట్టానికి 20 వేల అడుగుల అతిశీతల వాతావరణంలో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారే వారికి అత్యవసర చికిత్స చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కుటుంబాలకు దూరంగా నెలల తరబడి గ్లేసియర్‌పై మోహరించిన సైనికుల్లో మానసిక ఉత్తేజాన్ని నింపే పరిస్థితులు లేవు. కుటుంబాల్లో జరిగే వేడుకలకు మిస్ అవుతున్న వారి కోసం టెలికాం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్ తొలిసారి బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ బీటీఎస్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 15 వేల అడుగుల ఎత్తులో విధి నిర్వహణలో ఉన్న సాహస సైనికులు కుటుంబసభ్యులతో మాట్లాడటం కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసింది.
Siachen
సియాచిన్ గ్లేసియర్ ఓ రిమోట్ ఏరియా. రోడ్ కనెక్టివిటీ చాలా తక్కువ. గ్లేసియర్‌లోని బేస్ క్యాంప్‌కు అక్కడి నుంచి 10 మైళ్ల దూరంలో వార్షి గ్రామస్తులను అనుమతిస్తారు. దళాలకు వీరు పోర్టర్లుగా పనిచేస్తున్నారు. అయితే సాధారణ ప్రజల్లో సైనికుల పనితీరును తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు లడాఖ్ టూరిజం ఇప్పటికే బేస్ క్యాంప్ ట్రైనింగ్ సెంటర్లను చూసేందుకు ప్రజలకు అనుమతించింది. ఇందుకు ఎలాంటి పర్మిట్‌లు లేకుండానే పర్యాటకులను పంపిస్తోంది. సియాచిన్ గ్లేసియర్‌లోని ఆర్మీ పోస్ట్‌లలో పర్యటించేందుకు కూడా పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. అలాగే కార్గిల్ వార్ జరిగిన ‘టైగర్హిల్’ను చూసేందుకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏప్రిల్ 13, 1984లో ఆపరేషన్ మేఘ్‌దూత్ మొదలైన నాటి నుంచి భారత్ పాక్ దేశాల సైనికులు వేలల్లో ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య కంటె ఎక్కువగా దాదాపు 97 శాతం మంది వాతావరణ ప్రతికూలతల కారణంగా మరణించారు. 40 ఏళ్ల కాలంలో 1,150 మంది భారత సైనికులు చనిపోయారని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో కొద్ది నెలల క్రితం ప్రకటించారు. సియాచిన్ నుంచి నిస్సైనికీకరణ జరగాలని ఇరుదేశాల మధ్య చర్చలు జరిగినా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పటికీ అతి ఎత్తయిన యుద్ధక్షేత్రంలో సైనికులు పహారా కాస్తున్నారు.
మరిన్ని ప్రీమియం వార్తల కోసం