కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. పాఠశాల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై నిషేధం విధించారు. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ పై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. 10 రోజులపాటు దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్లు రాజీవ్ ధావన్, కపిల్ సిబాల్, దేవదత్ కామత్, సంజయ్ హెగ్డే, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ నవడ్గి, ఏఎస్‌జీ కేఎం నటరాజ్ వాదించారు. సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. నిరసనలను రెచ్చగొట్టేందుకు కుట్ర జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనవసరమైన విషయాన్ని సొలిసిటర్ జనరల్ లేవనెత్తారని వాదించారు. మీడియాలో విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం బుధవారం జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించారు. ఇటువంటి సమయంలో సొలిసిటర్ జనరల్ లేవనెత్తిన అంశం ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం తన సర్క్యులర్‌ను తానే ఉపసంహరించుకోవచ్చని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
2021లో కర్ణాటక విద్యా శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను దవే తో పాటు ఇతర పిటిషనర్లు న్యాయస్థానానికి సమర్పించారు. ప్రభుత్వ కాలేజీల్లో యూనిఫాం ధరించడం తప్పనిసరి కాదని ఈ సర్క్యులర్ చెప్తోందని వివరించారు. యూనిఫాం ను తప్పనిసరి చేసే కాలేజ్ యాజమాన్యాలకు శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. 2022 విద్యా సంవత్సరం కోసం మార్గదర్శకాలను వారి సొంత అఫిడవిట్‌లోనే తెలియజేశారని, యూనిఫారాలు తప్పనిసరి కాదని ఈ మార్గదర్శకాలు చెప్తున్నాయని తెలిపారు. హిజాబ్‌ను ధరించడం వల్ల విద్యకు, క్రమశిక్షణకు ఏ విధంగా విఘాతం కలుగుతుందో సరైన కారణాన్ని వివరించలేదని సీనియర్ అడ్వకేట్ హుజెఫా అహ్మది ప్రశ్నించారు.
ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ హేమంత్ గుప్తా అక్టోబరు 16న పదవీ విరమణ చేయబోతున్నారు. కాబట్టి ఈ తీర్పు అంతకుముందే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం