
అతనో లోకో పైలట్(Loco pilot). వేలమంది ప్రయాణీకులను గమ్య స్థానానికి చేర్చాల్సిన బాధ్యత అతనిపై ఉంది. కానీ అతను మాత్రం తన కర్తవ్యాన్ని విస్మరించాడు. రైలును నడుపుతూ ఉండగా.. మరో రైలుకు క్రాసింగ్ ఇచ్చేందుకు ఆపాడు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న ఓ దుకాణానికి వెళ్లి పూటుగా మద్యం తాగాడు. తప్ప తాగి రోడ్డుపై పడిపోయాడు. ప్రయాణికుల ఆందోళనతో రైల్వే పోలీస్ అధికారులు అపస్మారక స్థితిలో ఉన్న ఆ లోకో పైలట్ ను గుర్తించారు. విచారణ పూర్తయిన తర్వాత రైల్వే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన బిహార్(Bihar) లో జరిగింది. సమస్తిపూర్- సహర్సా లోకల్ రైలు.. సోమవారం సాయంత్రం సమస్తిపూర్ జంక్షన్ నుంచి సహర్సాకు బయల్దేరింది. దాదాపు గంట తర్వాత రాజధాని ఎక్స్‌ప్రెస్ క్రాసింగ్ కోసం హసన్‌పూర్ స్టేషన్‌లో లోకల్ ట్రైన్ ను ఆపారు. దీంతో అసిస్టెంట్ లోకో పైలట్ కరమ్‌వీర్ ప్రసాద్ యాదవ్.. రైలు దిగి మద్యం తాగేందుకు వెళ్లాడు. ఈ రైలు(Train) దాదాపు గంటకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. ఆందోళనకు దిగడంతో స్టేషన్ మాస్టర్ స్పందించారు. అదే రైల్లో ప్రయాణిస్తున్న మరో అసిస్టెంట్ లోకో పైలట్‌ను విధులు నిర్వహించాలని కోరారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు జీఆర్పీ బృందం రైలు ఆపిన ప్రదేశానికి చేరుకుంది. ప్రయాణికులను ఆరా తీసి.. కరమ్ వీర్ కోసం స్థానికంగా గాలించారు. ఇలా వెదుకుతుండగా కరమ్ వీర్.. హసన్‌పూర్‌లోని ఓ మార్కెట్‌లో కనిపించారు. ఆ సమయంలో అతను తప్ప తాగి, మద్యం మత్తులో నేలపై పడి ఉన్నాడు. అతణ్ని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోరినట్లు సమస్తిపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అలోక్ అగర్వాల్ తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత రైల్వే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే, మద్యం ఎవరు సరఫరా చేశారన్న దానిపై స్పష్టత రాలేదు. బిహార్‌లో మద్యపానంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా.. అయితే మీ డైట్ లో వెల్లుల్లిని చేర్చుకోండి