
తమిళనాడు రాజకీయ రణక్షేత్రం ఇప్పుడు డీఎంకే, అన్నా డీఎంకేల మధ్యే కాదు, తలపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం వర్సెస్ కేంద్రం అన్నట్లుగా మారిపోయింది. విజయ్‌ను ఎలాగైనా ఎన్డీయే కూటమిలోకి లాగాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఆయన్ని ఇరకాటంలో పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయ్ నటించిన తాజా చిత్రం జననాయకన్ ఇప్పుడు సీబీఐ రాడార్‌లోకి రావడం సంచలనం రేపుతోంది. గత కొద్దిరోజులుగా విజయ్ బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం సాగింది. పార్టీలోని కొందరు నేతలు కూడా కూటమి వైపే మొగ్గు చూపినప్పటికీ, విజయ్ సన్నిహితులు మాత్రం రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఒంటరి పోరే సరైన మార్గమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో కేంద్రానికి, విజయ్‌కు మధ్య దూరం పెరిగింది.
ఇటీవల కరూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన ఘటనపై సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే విజయ్‌ను సీబీఐ రెండుసార్లు విచారించింది. అయితే ఈ విచారణ వెనుక అసలు కారణం సినిమా షూటింగ్ అని సీబీఐ అనుమానిస్తోంది. జననాయకన్ సినిమా కోసం భారీ జనసందోహం ఉన్న దృశ్యాలను రికార్డ్ చేసేందుకు విజయ్ ఉద్దేశపూర్వకంగానే సభకు ఆలస్యంగా వచ్చారని సీబీఐ భావిస్తోంది. మధ్యాహ్నం రావాల్సిన విజయ్, సాయంత్రం 7 గంటలకు చేరుకున్నారని.. జనం బాగా పోగైన తర్వాత ఆ దృశ్యాలను షూట్ చేసి సినిమాలో వాడుకున్నారని, అదే తొక్కిసలాటకు దారితీసిందని సీబీఐ అనుమానిస్తోంది.
ఈ క్రౌడ్ షూటింగ్ వ్యవహారంపై విజయ్‌ను ప్రశ్నించగా, తనకు తెలియదని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో సీబీఐ ఇప్పుడు తన దృష్టిని జననాయకన్ చిత్ర బృందంపై సారించింది. త్వరలోనే సినిమా డైరెక్టర్, ప్రొడక్షన్ టీమ్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. విజయ్ తమ కూటమిలోకి రానందుకు ప్రతీకారంగానే బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తోందని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. సీబీఐ విచారణ పేరుతో ఒత్తిడి తెచ్చి లొంగదీసుకోవాలని చూస్తున్నారని, కానీ విజయ్ తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల వేళ తమిళనాట ఈ సినిమా – పాలిటిక్స్ వార్ ఎటు దారితీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.